
నిందితుడు రాణాప్రతాప్
పంజగుట్ట : పోలీస్ అనిచెప్పి మహిళ సెల్‌ఫోన్, నగదు లాక్కుని ఆమె మొబైల్ నుండే బాధితురాలి కుటుంబ సభ్యులకు అసభ్యకర మెసేజ్‌లు పెడుతున్న వ్యక్తిని పంజగుట్ట పోలీసులు అరెస్టు చేశారు. పంజగుట్ట క్రైమ్ ఇనిస్పెక్టర్ షేక్ షఫీ తెలిపిన మేరకు హుజూర్‌నగర్‌కు చెందిన కంభంపాటి సాహితి అమీర్‌పేట బిగ్‌బజార్ సమీపంలో ఓ హాస్టల్‌లో ఉంటూ యానిమేషన్ కోర్సు చేస్తుంది. ఈ నెల 23వ తేదీన సాహితి తన స్నేహితుడు షేక్ రహమాన్‌తో కలిసి అమీర్‌పేట షాలీమార్ జంక్షన్ వద్ద నుండి నడుచుకుంటూ వస్తుండగా ఓ గుర్తుతెలియని వ్యక్తి వచ్చి తాను పోలీసునని ఇక్కడ ఏంచేస్తున్నారంటూ గద్దించాడు. మీపైన కేసులు బనాయించి స్టేషన్‌లో పెడాతానని భయపెట్టి వారి మొబైల్‌ఫోన్లు లాక్కున్నారు.
మరుసటి రోజు నగదు తీసుకువచ్చి మొబైల్‌ఫోన్లు తీసుకువెళ్లాలని ఆదేశించారు. మరుసటిరోజు వీరు నాలుగువేలు తీసుకుని అతనివద్దకు వెళ్లగా ఉన్న నగదు లాక్కుని మొబైల్స్ కూడా ఇవ్వకుండా బెదిరించి పంపించేశాడు. అంతటితో ఆగక బాధితురాలి ఫోన్ నుండే ఆమె తల్లికి సామాజిక మాధ్యమాలద్వారా అసభ్యకర సందేశాలు పంపిస్తున్నాడు. అతని బాధ భరించలేక శుక్రవారం బాధితులు పంజగుట్ట పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు వికారాబాద్‌కు చెందిన పి.రాణాప్రతాప్ (22) నగరంలో ఎర్రగడ్డలో నివసిస్తూ ఈ తతంగం చేస్తున్నాడని గుర్తించారు. ఎర్రగడ్డలో మొబైల్‌ఫోన్ అమ్మేందుకు యత్నిస్తుండగా అరెస్టు చేసి అతని వద్ద నుండి మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment