ఆరిలోవ(విశాఖ తూర్పు): వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ నిరుద్యోగులకు ఓ ప్రబుద్ధుడు వల చేసి, లక్షల్లో దండేశాడు. తీరా ఉద్యోగాలు లేకపోవడంతో బాధితులు ఇచ్చిన ఫిర్యాదుతో టాస్క్‌ఫోర్సు పోలీసులు రంగంలోకి దిగి నిందితుడిని పట్టుకున్నారు.వివరాలిలా ఉన్నాయి. జీవీఎంసీ మూడో వార్డు పరిధి రవీంద్రనగర్‌కు చెందిన కోటేశ్వరరావు జిల్లా పరిషత్ ప్రాంతంలో ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. అతనికి సాయికృష్ణ పరిచయమయ్యాడు. కేజీహెచ్‌లో ఉద్యోగం చేస్తున్నానని చెప్పి సాయికృష్ణ.. కోటేశ్వరరావుతో పరిచ యం పెంచుకున్నాడు.
జిల్లాలో ఏదైనా పీహెచ్‌సీ(ప్రాథమిక ఆరోగ్య కేంద్రం)లో ఉద్యోగం ఇప్పిస్తానని, డీఎంహెచ్‌వో, ఇతర వైద్యాధికారులు తనకు బాగా తెలుసని నమ్మించాడు. అలా కోటేశ్వరరావు వద్ద రూ.50 వేలు తీసుకున్నాడు. ఈ విషయం కోటేశ్వరరావు తన స్నేహితులతో చెప్పడంతో విజయనగరం జిల్లా తెర్లాం మండలానికి చెందిన మరో 8 మంది, శ్రీకాకుళం జిల్లా, విశాఖ నగరానికి చెందినవారు సుమారు 30 మంది రూ.35,000లు నుంచి రూ.లక్ష వరకు సాయికృష్ణకు చెల్లించారు. పీహెచ్‌సీలలో కంప్యూటర్ ఆపరేటర్, ఫీల్డ్ ఆఫీసర్ పోస్టులు ఇప్పిస్తానని నమ్మించి ఈ ఏడాది జూన్ మొదటి వారంలో డబ్బులు వసూలు చేశాడు. రెండో వారంలోనే ఉద్యోగాలు ఇప్పిస్తానని హామీ ఇచ్చాడు.
చేతికి పోస్టింగ్ ఆర్డర్ ఇస్తానంటూ కొందరిని కాకినాడ రీజనల్ హెల్త్ సెంటర్‌కు కూడా తీసుకెళ్లి నాలుగు రోజుల పాటు లాడ్జీలో ఉంచాడు. కొద్ది రోజులు పడుతుందని అధికారులు అన్నారని మాయమాటలు చెప్పి తిరిగి పంపించేశాడు. జూలై గడిచినా ఉద్యోగాలు రాలేదని, సాయికృష్ణ మోసం చేశాడని బాధితులు గ్రహించారు. సాయికృష్ణను పరిచయం చేసిన కోటేశ్వరరావుని బాధితులు నిలదీశారు. దీంతో కోటేశ్వరరావు తాను కూడా బాధితుడినేనని, మిగిలిన బాధితుల సహకారంతో ఇటీవల టాస్క్‌ఫోర్సు పోలీసులను ఆశ్రయించాడు. రంగంలోకి దిగిన పోలీసులు గురువారం నగరంలో సాయికృష్ణను అదుపులోకి తీసుకున్నారు. రవీంద్రనగర్‌కు చెందిన కోటేశ్వరరావు ఫిర్యాదు చేయడంతో టాస్క్‌ఫోర్సు పోలీసులు అదుపులోకి తీసుకొన్న సాయికృష్ణను ఆరిలోవ పోలీసులకు అప్పగించారు. మిగిలిన బాధితులు కూడా స్టేషన్‌కు వచ్చి సాయికృష్ణ తమకు ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ, డబ్బులు తీసుకొని మోసం చేశాడని ఫిర్యాదు చేశారు.
ఆరిలోవలో రెండో ఫిర్యాదు
ఇదిలా ఉండగా సాయికృష్ణ ఆరు నెలల క్రితం ఇదే విధంగా నిరుద్యోగులను మోసం చేయడంపై ఆరిలోవ పోలీసులు కేసు నమోదు చేశారు. వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ అప్పట్లో కూడా నగరానికి చెందిన కొందరు నిరుద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేశాడు. వారంతా హనుమంతవాక వద్ద సాయికృష్ణను పట్టుకొని దేహశుద్ధి చేశారు. అనంతరం ఆరిలోవ పోలీసులకు అప్పగించారు. ఇప్పుడు మళ్లీ ఇదే మాదిరిగా నిరుద్యోగులను మోసం చేశాడు. ఇప్పుడు రెండో ఫిర్యాదు నమోదైంది. సాయికృష్ణ వలలో పడి ఇలా నిరుద్యోగులు తరచూ మోసపోతున్నారు.
ద్యోగాల పేరిట మోసగించిన వ్యక్తి అరెస్ట్
అల్లిపురం(విశాఖ దక్షిణ): నేవల్ డాక్‌యార్డులో ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి నిరుద్యోగులను మోసగించిన వ్యక్తిని టూటౌన్ పోలీసులు గురువారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. సీఐ జీవీ రమణ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లా మున్సిపల్ పార్కు దరి హెచ్‌బీ కాలనీకి చెందిన గాడి సత్యసూర్య చలపతిరావు అలియాస్ శశికాంత్ హైదరాబాద్ యల్లారెడ్డి గూడెంలోని సన్ సిటీ అపార్టమెంట్స్‌లో నివసిస్తున్నాడు. ఈయన గత నెల జూలైలో విశాఖపట్నం వచ్చి డాల్ఫిన్ హోటల్‌లో బస చేశాడు. ఆ సమయంలో ఆయన నేవల్ అధికారుల వస్త్రధారణలో, కెప్టెన్‌గా నిరుద్యోగులను ఆకట్టుకున్నాడు. ఉద్యోగం అవసరమైన వారిని గుర్తించి వారిని హోటల్‌కు ఆహ్వానించి డిన్నర్ ఏర్పాటు చేసేవాడు. ఇలా అక్కయ్యపాలెంలో సరోజా హాస్పటల్ వద్ద నివసిస్తున్న హుకుంపేటకు చెందిన బుడ్డిగ తరుణ్‌కుమార్‌ను ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి హోటల్‌కు పిలిచాడు. అతని వద్ద నుంచి రూ.50వేలు తీసుకున్నాడు. ఆ తరువాత శశికాంత్ ముఖం చాటేయడంతో తరుణ్‌కుమార్ మోసపోయానని గ్రహించి గత నెల 30న టూటౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు విచారణ చేపట్టిన సీఐ, తన సిబ్బందితో కలసి నిందితుడిని గురువారం అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. శశికాంత్ చేతిలో మోసపోయిన నిరుద్యోగులు టూటౌన్ పోలీసులను సంప్రదించాలని కోరారు. బాధితులు 9440904716, 7989359509 నంబర్లలో ఫోన్ చేసి వివరాలు తెలియజేయాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment