మృతదేహాన్ని పరిశీలిస్తున్న ఎస్సై
రేగిడి : మేకలకు ఆహారంగా కొమ్మలను కోసేందుకు బావి వద్దకు వెళ్లిన వ్యక్తి .. ప్రమాదవశాత్తూ అందులోనే పడి మృత్యువాత పడిన సంఘటన మండలంలోని వావిలవలస వద్ద జరిగింది. గ్రామానికి చెందిన దాసరి అప్పలనాయుడు (52) శనివారం మేకలను తీసుకుని వెళ్లారు. సాయంత్రం మేకల కోసం కొమ్మలు కోసేందుకు గ్రామ సమీపంలో ఉన్న నేలబావి వద్దకు వెళ్లి అందులోనే పడిపోయాడు.
రాత్రవుతున్నా.. అప్పలనాయుడు ఇంటికి రాకపోవడంతో భార్య అన్నపూర్ణ, కుమారుడు శంకరరావు, కుమార్తె చిన్నమ్మడు గ్రామస్థుల సహకారంతో గాలింపు చర్యలు చేపట్టారు. ఎంత వెతికినా ప్రయోజనం లేకపోకపోయింది. ఆదివారం ఉదయం మళ్లీ గ్రామస్థులంతా వెతకడంతో పంట పొలాల్లో ఉన్న నేలబావిలో గమనించగా అక్కడ అతడి మృతదేహాన్ని గుర్తించారు. దీంతో కుటుంబ సభ్యులంతా కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
అప్పలనాయుడు భార్యకు కంటిచూపులేదు. కుమార్తె చిన్నమ్మడు భర్తతో విడాకులు తీసుకోవడంతో ఇంటి వద్దే ఉంటోంది. కుమారుడు శంకరరావు తండ్రికి చేదోడువాదోడుగా ఉంటూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. పెద్ద దిక్కు మృతితో కుటుంబం బోరున విలపిస్తోంది. వీరిని ప్రభుత్వం ఆదుకోవాలని సర్పంచ్ ముయిద ప్రసన్నలక్ష్మి, ఎంపీటీసీ పాలూరి రామినాయుడు కోరారు. వీఆర్వో రామచంద్రినాయుడు, తహసీల్దార్ ఎన్.సరళ ఎస్సై జి.భాస్కరరావుకు సమాచారం అందించారు.
ఎస్సై సంఘటనా స్థలాన్ని పరిశీలించి శవ పంచనామా చేసి రాజాం సామాజిక ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. కుమారుడు శంకరరావు ఇచ్చిన ఫిర్యాదుమేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు జరుపుతున్నామని ఎస్సై తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment