
మురళి(ఫైల్)
మందస శ్రీకాకుళం : ఆ కుటుంబంపై విధి పగబట్టింది. మూడు రోజుల వ్యవధిలోనే ఇద్దరు కొడుకుల ప్రాణాలు బలి తీసుకుంది. గాయపడిన చివరి కుమారుడైనా బతుకుతాడని ఆశించిన ఆ కుటుంబం ఆశలను తుంచేసింది. మందస మండలంలోని బహడపల్లి గ్రామానికి చెందిన కర్రి సోమేశ్వరరావు, మురళీ కాశీబుగ్గ నుంచి తిరిగివస్తూ, మాకన్నపల్లి జంక్షన్‌లో ప్రమాదానికి గురై తీవ్రంగా గాయపడ్డారు. వీరికి పలాస ప్రభుత్వాస్పత్రిలో ప్రథమ చికిత్స అనంతరం విశాఖలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స చేయించారు.
గాయపడిన రెండోరోజు సోమేశ్వరరావు మరణించాడు. మృత్యువుతో పోరాడిన మురళి.. ఆదివారం కన్నుమూశాడు. ఆయన ఆర్మీలో పని చేస్తున్నారు. ఇప్పటికే పెద్ద కుమారుడు కర్రి దేవరాజ్ సాయుధ పోరాటంలో దళ సభ్యుడిగా ఉంటూ ఎన్‌కౌంటర్‌లో మరణించారు. ఒకే కుటుంబంలోని ముగ్గురు కొడుకులు మరణించడంతో తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మురళీ మృతదేహాన్ని ప్రైవేటు ఆస్పత్రి నుంచి కేజీహెచ్‌కు సోమవారం తీసుకువెళ్లి, పోస్టుమార్టం చేసిన అనంతరం బహడపల్లికి తీసుకువస్తారని బంధువులు చెప్పారు.