
రోదిస్తున్న తల్లి, బంధువులు
చెన్నై ,అన్నానగర్: రైలులో మహిళ వద్ద చైన్ స్నాచింగ్ చేసిన దొంగని పట్టుకోవడానికి యత్నించిన యువకుడు రైలు ఢీకొని మృతి చెందాడు. వివరాలు.. మదురై జిల్లా పుదూర్ సమీపంలోని పరశురామ్‌పట్టికి చెందిన వెల్లైస్వామి కుమారుడు బాలాజీ (27). ఇతను తన తల్లి ఇంద్రాణి, బంధువులు వల్లి (50), ప్రకాష్ సహా 10 మంది తిరుచ్చి జిల్లా సమయపురం మారియమ్మన్ ఆలయానికి వెళ్లడానికి నిర్ణయించుకున్నారు. గురువారం మదురై నుంచి విల్లుపురం వెళ్లే రైలులో ఎక్కారు. ఆ రైలు దిండుక్కల్ జిల్లా, కొడైరోడ్డు రైల్వే స్టేషన్‌కి వచ్చింది. కొడైరోడ్డు రైల్వే స్టేషన్ నుంచి రైలు బయలుదేరింది. అప్పుడు వల్లి మెడలో ఉన్న చైన్‌ని ఓ వ్యక్తి స్నాచింగ్ చేసుకుని పరుగెత్తాడు. ఇది చూసిన బాలాజీ ఆ దొంగని పట్టుకోవడానికి యత్నించాడు. వెంటనే ఆ దొంగ కనురెప్ప పాటుతో వెళుతున్న రైలు నుంచి దూకి పరారయ్యాడు. అతన్ని పట్టుకోవడానికి బాలాజీ వెళ్లే రైలు నుంచి దూకాడు. రైలు కోడైరోడ్డు రైల్వే స్టేషన్‌ని దాటింది.
దీనిపై కోడై రోడ్డు రైల్వే పోలీసులకు బాలాజీ బంధువులు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు కోడై రోడ్డు రైల్వే స్టేషన్‌లో వెతికారు. అప్పుడు రైలులో ఢీకొని దేహం ముక్కలై బాలాజీ మృతి చెంది ఉన్నాడు. పోలీసులు అతని బంధువుకి సెల్‌ఫోన్‌లో సమాచారం తెలిపారు. రైలు అంబత్తూర్ రైల్వే స్టేషన్ రాగానే వారు అక్కడ నుంచి కారులో కోడైరోడ్డు రైల్వే స్టేషన్‌కి వచ్చారు. బాలాజీ మృతదేహాన్ని చూసి తల్లి, బంధువులు బోరున ఏడ్చారు. సమాచారంతో దిండుక్కల్ రైల్వే పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి బాలాజీ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. విచారణలో వల్లి మెడలో ఉన్నది కవరింగ్ చైన్ అని తెలిసింది. పరారైన దొంగ కోసం పోలీసులు గాలిస్తున్నారు. మృతుడు బాలాజీ భార్య కన్నగి. కాగా ఇతను ఫ్యాన్సీ దుకాణం నడుపుతున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment