సాక్షి, మెదక్ : అక్రమ సంబంధమే హత్యకు దారితీసిందని డీఎస్పీ కృష్ణమూర్తి పేర్కొన్నారు. శుక్రవారం మెదక్ రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో నిందితుల వివరాలను వెల్లడించారు. మెదక్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అవుసులపల్లి శివారులో హవేళిఘణాపూర్ మండలం ఔరంగాబాద్ తండాకు చెందిన విజయ(26) అనే మహిళను ఈ నెల 18న రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు అత్యాచారం చేసి హత్య చేసినట్లు తెలిపారు. ఈ ఘటన పై చేపట్టిన విచారణలో కేసును ఛేదిం చిన నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. కాగా క్షేత్రస్థాయిలో జరిపిన విచారణలో మృతిరాలి భర్తే ప్రధాన సూత్రధారి అని తేలినట్లు వివరించారు.
భర్తను, పిల్లలను పట్టించుకోలేదు..
మృతురాలు విజయకు కెతావత్ దేవులతో ఎనిమిదేళ్ల క్రితం వివాహం జరిగింది. కాగా దేవుల బతుకుదెరువు కోసం గత ఏడాది మలేషియాకు వెళ్లి ఆరు నెలల క్రితం స్వగ్రామానికి వచ్చారు. ఈ క్రమంలో కూలీ పనులు చేసుకుంటున్న భార్య విజయ మరో వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకొని భర్త దేవులను, ఇద్దరు పిల్లలను పట్టించుకోలేదన్నారు. అలాగే తన ప్రాణానికి హాని ఉందనే ఉద్దేశ్యంతో చెడు తిరుగుళ్లు తిరుగుతున్న భార్యను ఎలాగైనా హతమార్చాలని పథకం వేసినట్లు తెలిపారు. కాగా ట్రాక్టర్ డ్రైవర్‌గా పని చేస్తున్న రూప్‌సింగ్‌తో పాటు మదన్ అనే ఇద్దరు తండా వాసుల సహకారం తీసుకున్నారు.
అత్యచారం.. హత్య
ఈ నెల 17న రూప్‌సింగ్ విజయను తీసుకొని సినిమాక్స్‌లో నడుస్తున్న రణరంగం సినిమాకు తీసుకెళ్లాడు. సినిమా చూసిన తర్వాత తిరుగు ప్రయాణంలో మెదక్ పట్టణంలోని వైన్స్ షాప్‌లో మద్యం కొనుగోలు చేసి అవుసులపల్లి శివారులోని నిర్మానుష్యమైన ప్రదేశానికి రాత్రి 8:30 గంటలకు తీసుకెళ్లారు. అక్కడ రూప్‌సింగ్, మధన్‌లు విజయకు ఎక్కువగా మద్యం తాగించి అత్యాచారం చేసి, ఆపై చీరతోనే ఆమె గొంతు నులిమి చంపేసినట్లు నిందితులు ఒప్పుకున్నట్లు వెల్లడించారు. ఈ విషయం అంతటిని ఎప్పటికప్పుడు మృతురాలి భర్త ఫోన్‌ద్వారా తెలుసుకుంటున్నారని తెలిపారు.
రూ.10వేలకు ఒప్పందం..
హత్యకు తనకు ఎలాంటి సంబంధం లేకుండా మృతురాలి భర్త దేవుల బందువులకు ఫోన్ చేసి భార్య కనపడటం లేదని నటించినట్లు తెలిపారు. తన భార్యను హతమారిస్తే రూ. 10వేలు ఇస్తానని దేవుల చెప్పినట్లు నిందితులు స్పష్టం చేసినట్లు తెలిపారు. కాగా సినీఫక్కీలా చేసిన హత్య ఉదంతాన్ని అత్యంత చాకచక్యంగా చేధించిన పోలీసులను అభినందించారు. క్షేత్రస్థాయిలో విచారణ జరిపి హత్య కేసులో నిందితులను పట్టుకున్న రూరల్ సీఐ రాజశేఖర్, ఎస్‌ఐలు లింబాద్రి, శ్రీకాంత్, కృష్ణ, బాషిత్‌అలీ, రాములు, విజయ్, యాదగిరి, వెంకట్‌లను ప్రశంసించారు. ఈ విషయంలో అధికారులకు రివార్డులను అందజేయనున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment