అప్పారావు (ఫైల్)
జి.సిగడాం: సంతలో సామగ్రి కొనుగోలు చేసేందుకు బయలుదేరిన ఆ వ్యక్తిని మృత్యురూపంలో దూసుకొచ్చిన ఎక్స్‌ప్రెస్ రైలు ఢీకొనడంతో దుర్మరణం చెందాడు. తొలుత గూడ్స్ రైలు ప్రమాదం నుంచి తప్పించుకుని, పొరపాటున మరో రైలు పట్టాలపైకి రావడంతో ఈ ప్రమాదానికి గురయ్యాడు. ఈ ఘటన మండలంలోని వాండ్రంగి రైల్వే గేటు వద్ద ఆదివారం చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం మేరకు... సంతవురిటి గ్రామానికి చెందిన ముత్తాల అప్పారావు(50) పొందూరు సంతలో ఇంటి సామగ్రి కొనుగోలు చేసి వస్తానని కుటుంబ సభ్యులకు చెప్పి తన గ్రామం నుంచి బయలుదేరాడు.
ఈ క్రమంలో వాండ్రంగి రైల్వే గేటు వద్ద పట్టాలు దాటుతున్నాడు. ఇంతలో ఒడిశా నుంచి విశాఖపట్నం వైపు వెళ్తున్న గూడ్స్‌ను గమనించి వెనక్కి తగ్గాడు. ఈ క్రమంలో పొరపాటున మరో పట్టాలపైకి రావడంతో అదే సమయంలో విశాఖపట్నం నుంచి ఒడిశా వైపు వెళ్తున్న ఎక్స్‌ప్రెస్ రైలు ఢీకొంది. దీంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అతడి ముఖ భాగం గుర్తు పట్టలేనంతగా నుజ్జనుజ్జయింది. మృతుడికి భార్య పద్మ, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. అప్పారావు కూలీ చేసుకుంటూ కుటుంబాన్ని పోషించేవాడని, పెద్ద దిక్కు కోల్పోయిన పేద కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. సంఘటనా స్థలానికి ఆమదాలవలస రైల్వే ఎస్‌ఐ శ్రీనివాసరావు, హెడ్ కానిస్టేబుల్ కృష్ణారావు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment