లేడీస్ టాయిలెట్‌లోని వెంటిలేటర్ అద్దాలు పగులగొట్టిన దృశ్యం
మహబూబాబాద్ రూరల్ : మహబూబాబాద్ టౌన్ పోలీసులు ఇటీవల రాత్రి సమయంలో గస్తీ తిరుగుతుండగా మానుకోట శివారు సాలార్ తండావాసి ఇస్లావత్ మహేష్ అనుమానాస్పదంగా కనిపించడంతో అదుపులోకి తీసుకున్నారు. అప్పటి నుంచి పోలీసుల అదుపులో ఉన్న అతడు గురువారం మధ్యాహ్నం మూత్రవిసర్జనకని వెళ్లి మహిళల టాయిలెట్‌లోని వెంటిలేటర్ అద్దాలు పగులగొట్టి అందులో నుంచి బయటికి దూకాడు.
అనంతరం పోలీస్ స్టేషన్ భవనం వెనుక వైపు నుంచి బయటికి వచ్చి పరారయ్యాడు. ఈ విషయం రాత్రి వరకు టౌన్ పోలీస్ వర్గాలు బయటకు తెలియనీయకుండా దాచిపెట్టాయి. విషయం కాస్తా ఆ నోటా ఈనోటా పడి అందరికి తెలియడంతో దావానంలా వ్యాపించింది.
టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి పోలీసుల అదుపులో ఉన్న యువకుడు పరారయ్యాడనే విషయంపై టౌన్ సీఐ జబ్బార్‌ను వివరణ కోరగా అలాంటిదేమి లేదని సమాధానమిచ్చారు. పరారైన మహేష్ కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నట్లు తెలిసింది. ఈ విషయమై డీఎస్పీ అంగోత్ నరేష్‌కుమార్ రాత్రి టౌన్ పోలీస్ స్టేషన్‌కు చేరుకుని జరిగిన సంఘటనపై టౌన్ సీఐ జబ్బార్, ఎస్సై రమేష్‌బాబుతో మాట్లాడారు.
Comments
Please login to add a commentAdd a comment