ప్రేమించిన అమ్మాయి దక్కలేదని.. | Man Who Tried To Murder Was Arrested | Sakshi
Sakshi News home page

ప్రేమించిన అమ్మాయి దక్కలేదని..

Published Tue, Apr 30 2019 10:16 AM | Last Updated on Tue, Apr 30 2019 10:16 AM

Man Who Tried To Murder Was Arrested - Sakshi

నిందితులను అరెస్ట్‌ చూపుతున్న డీసీపీ సుదర్శన్‌గౌడ్‌ 

సాక్షి, రామగుండం : ప్రేమించిన అమ్మాయి దక్కలేదనే క్షక్ష్యతో ఆమె భర్త ఇంట్లో పెట్రోల్‌పోసి ఇంటిల్లిపాదిని హత్యచేయాలని కుట్రపన్నాడు.. కుటుంబ సభ్యులు అప్రమత్తం కావడంతో పెద్ద ప్రమాదం తప్పింది. పెద్దపల్లి డీసీపీ సుదర్శన్‌గౌడ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. గోదావరిఖని టూటౌన్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని జనగామ గ్రామానికి చెందిన గాదె అవినాష్‌కు మందమర్రి పట్టణానికి చెందిన సింధూతో వివాహం జరిగింది. అయితే పెళ్లికి ముందే ఆమెతో పాటు చదువుకున్న మందమర్రి పట్టణానికి చెందిన ముదాం రవి ప్రేమపేరుతో వెంటపడ్డాడు. అమ్మాయి తల్లిదండులు అతడితో పెళ్లికి నిరాకరించి అవినాష్‌తో వివాహం జరిపించారు. తాను ప్రేమించిన సింధూను అవినాష్‌ వివాహం చేసుకున్నాడని అప్పటి నుంచి కక్ష్య పెంచుకున్నాడు. ఆమెను కలవడానికి కూడా చాలాసార్లు జనగామ వచ్చి వెళ్లినట్లు డీసీపీ తెలిపారు. ఫోన్లో మాట్లాడడానికి ప్రయత్నించడంతో ఈవిషయమై సింధూ, రవిపై మంచిర్యాల పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు అతడిని రెండుసార్లు పిలిపించి కౌన్సెలింగ్‌ కూడా నిర్వహించారు. అయినా పద్ధతి మార్చుకోక ఆమెపై ప్రేమను పెంచుకుని అవినాష్‌ను బెదిరిండంతో పాటు మందమర్రికి వెళ్లిన సమయంలో అతడి కారుపై దాడిచేసి కారు అద్దాలు కూడా పగులగొట్టాడు. ఈక్రమంలో దమ్ముంటే తన ఊరికి రా అని అవినాష్‌ అనడంతో మరింత కక్ష్య పెంచుకుని, ఏలాగైనా చంపాలనే ఉద్దేశ్యంతో కుటుంబాన్ని అంతమొందించేందుకు రవి పన్నాగం పన్నినట్లు వివరించారు. 

డెలివరీకి వెళ్లిన సమయంలో..
అవినాష్‌ భార్య డెలివరీ అయి మంచిర్యాలలోని ఆసుపత్రిలో ఉన్న విషయాన్ని తెలుసుకుని, ఆమె భర్త ఇంట్లోనే ఉన్నాడని నిర్ధారించుకుని అతడి కుటుంబాన్ని అంతమొందించేందుకు రవి కుట్ర పన్నాడు. తనతో పాటు మరో ముగ్గురు స్నేహితులను వెంటబెట్టుకుని ఈ నెల 25వ తేదీన అర్ధరాత్రి 2.30 గంటల సమయంలో రెండు క్యాన్లలో 10లీటర్ల పెట్రోల్‌తో అవినాష్‌ ఇంటికి చేరుకున్నాడు. ఇంటి తలుపులకు బయటివైపు గడియలు పెట్టి పైపుద్వారా ఐదు లీటర్లపెట్రోల్‌ను ఇంట్లోకి పంపించాడు. అయితే ఘాటు వాసన రావడంతో కుటుంబ సభ్యులు నిద్రలేచి తలుపులు బలంగా తీసి బయటివచ్చి అరవడంతో నిందితులు పరారయ్యారు. ఆసమయంలో ఇంట్లో అవినాష్‌తో పాటు తల్లి అరుణ, అమ్మమ్మ అనసూయ, తమ్ముడు అభిలాష్‌ ఉన్నారు. కుటుంబ సభ్యులు లేచి అరవడంతో పెద్ద ప్రమాదం తప్పిందని పోలీసులు వెల్లడించారు. 

రౌడీషీట్‌ నమోదు చేస్తాం: డీసీపీ సుదర్శన్‌
కుటుంబాన్ని హతమార్చాలనే దుష్ట పన్నాగం చేసిన మందమర్రి పట్టణం తాళ్లపల్లి గ్రామానికి చెందిన ప్రధాన నిందితుడు ముదాం రవి(27)ని అరెస్ట్‌ చేసినట్లు డీసీపీ వివరించారు. ఈహత్యాయత్నానికి సహకరించిన మరో ముగ్గురు నిందితులు అదే ప్రాంతానికి చెందిన కాతం రమేశ్‌(22), ఇందారం మండలం నర్సింగాపూర్‌కు చెందిన పులి ప్రశాంత్‌(22), వరంగల్‌ జిల్లా బాహుపేట్‌కు చెందిన పొన్నం అనిరుధ్‌(19)లను అరెస్ట్‌ చేసినట్లు పేర్కొన్నారు. వారు ఉపయోగించిన పెట్రోల్‌ క్యాన్లు, ద్విచక్రవాహనాలు, సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. సీసీ కెమెరాల పుటేజీ, సైబర్‌ సిబ్బంది సహకారంతో నిందితున్ని త్వరగా పట్టుకున్నామని, ప్రధాన నిందితుడు రవిపై రౌడీషీట్‌ నమోదు చేస్తామని వెల్లడించారు.

పోలీసులకు రివార్డులు
కుటుంబాన్ని హతమార్చేందుకు కుట్రపన్నిన నిందితులను చాకచక్యంగా పట్టుకున్న గోదావరిఖని టూటౌన్‌ సీఐలు వెంకటేశ్వర్లు, ప్రవీణ్‌కుమార్, కానిస్టేబుల్‌ శ్రీనివాస్, క్రిష్ణారెడ్డిలను డీసీపీ అభినందించారు. చాకచక్యంగా వ్యవహరించిన వీరికి రివార్డులు అందజేయనున్నట్లు ప్రకటించారు. సమావేశంలో గోదావరిఖని ఏసీపీ ఉమేందర్, సీఐలు పాల్గొన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement