![Married Woman Suspicious death in Chittoor - Sakshi](/styles/webp/s3/article_images/2018/12/19/gangothri.jpg.webp?itok=egSGXiP1)
మృతి చెందిన గంగోత్రి
చిత్తూరు, ములకలచెరువు: అనుమానాస్పద స్థితిలో ఒక వివాహిత బలవన్మరణానికి పాల్పడిన సంఘటన మంగళవారం మండలంలో చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం..మండలంలోని కొండకింద వడ్డిపల్లెకు చెందిన పూజారి సురేంద్రకు కర్నాటక రాష్ట్రం లక్ష్మీపురం పంచాయతీ గౌడతాతగడ్డకు చెందిన మేకల తిమ్మప్ప కుమార్తె గంగోత్రి (20)కి గత ఏడాది నవంబరులో వివాహం చేశారు. సురేంద్ర కోలారులో ఎలక్రీషియన్‌గా పని చేస్తూ నెలలో రెండు, మూడు రోజులు కొండకింద వడ్డిపల్లెకు వచ్చి వెళ్లేవాడు.
తానూ కోలారులో ఉంటానని ఎన్నోసార్లు గంగోత్రి కోరినా సురేంద్ర తిరస్కరించాడు. గ్రామంలో తన తల్లిదండ్రుల వద్దే ఉండాలని చెప్పాడు. ఈ నేపథ్యంలో, మనస్తాపానికి గురై మంగళవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యానుకు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. స్థానికులు గమనించి తలుపులు పగలగొట్టి గంగోత్రిని కిందికి దించారు. సమాచారమివ్వడంతో 108తో సిబ్బంది అక్కడి చేరుకున్నారు. అప్పటికే గంగోత్రి మృతి చెందిందని ధ్రువీకరించారు. పోలీసులకు సమాచారం అందడంతో సీఐ శ్రీనివాసులు మృతదేహాన్ని పరిశీలించారు. మృతికి గల కారణాలపై కుటుంబ సభ్యులను ఆరా తీశారు. భర్త దూరంగా ఉన్నాడనే మనస్తాపమా? వేధింపులేమైనా ఉన్నాయా? ఇతర కారణాలా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment