విడాకులు తీసుకున్న మహిళలనే లక్ష్యంగా.. | Matrimony Website Cheaters Held in Hyderabad | Sakshi
Sakshi News home page

మాట్రి‘మనీ’ చీటర్స్‌!

Published Thu, Mar 12 2020 11:02 AM | Last Updated on Thu, Mar 12 2020 11:02 AM

Matrimony Website Cheaters Held in Hyderabad - Sakshi

నిందితులు

సాక్షి, సిటీబ్యూరో: మాట్రిమోనీ వెబ్‌సైట్‌లో పునర్వివాహం కోసం వివరాలు నమోదు చేసుకున్న మహిళలే లక్ష్యంగా ఖరీదైన బహుమతులు పంపిస్తానంటూ కస్టమ్స్‌ రూపంలో లక్షల్లో డబ్బులు కాజేస్తున్న నలుగురు సభ్యులతో కూడిన ముఠాను సైబరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు అరెస్టు చేశారు. ఢిల్లీలో ఉంటున్న నైజీరియన్‌ గిడ్డీ ఇసాక్‌ ఉలూతో పాటు నేపాలీలు సాగర్‌ శర్మ, సుదీప్‌ గిరి, బికాస్‌ బల్మీకిల నుంచి 18 సెల్‌ఫోన్లు, తొమ్మిది గుర్తింపు కార్డులు, పాస్‌పోర్టు, 25 సిమ్‌కార్డులు, ల్యాప్‌టాప్, 67 చెక్కుబుక్కులు, 15 డెబిట్‌కార్డులు స్వాధీనం చేసుకున్నారు. వీరి బ్యాంక్‌ ఖాతాల్లోని రూ.3,05,076 నగదు ఫ్రీజ్‌ చేశారు. కేసు వివరాలను క్రైమ్స్‌ డీసీపీ రోహిణి ప్రియదర్శిని, అడిషనల్‌ డీసీపీ కవిత, సైబర్‌క్రైమ్‌ ఏసీపీ శ్రీనివాస్‌లతో కలిసి సీపీ వీసీ సజ్జనార్‌ బుధవారం మీడియా ప్రతినిధులకు వెల్లడించారు. 

ఖరీదైన గిఫ్ట్‌ల పేరుతో..  
నైజీరియాకు చెందిన ప్రధాన నిందితుడు ఎసెలూ ఉడో (పరారీలో ఉన్నాడు), గిడ్డి ఇసాక్‌ ఉలూలు సైబర్‌ నేరాలు చేయడంలో దిట్ట. 2018లో బిజినెస్‌ వీసాపై దిల్లీకి వచ్చిన గిడ్డి, ఎసెలూ ఉడోలు ఆన్‌లైన్‌ వేదికగా మ్యాట్రిమోనీ గిఫ్ట్‌ మోసాలు, బిజినెస్‌ మోసాలు, జాబ్‌ మోసాలు చేస్తున్నారు. గిడ్డీ ఆయిల్, సీడ్స్‌ వ్యాపారం పేరుతో బెంగళూరుకు చెందిన ఇద్దరు వ్యక్తుల నుంచి లక్షల్లో డబ్బులు లాగాడు. దిల్లీలో ఉంటున్న నైజీరియన్లకు అక్కడే మూన్‌షైన్‌ హోటల్‌లో పనిచేస్తున్న సాగర్‌ శర్మ, సుదీప్‌గిరి, బికాస్‌ బల్మీకిలకు పరిచయం ఏర్పడింది. బ్యాంక్‌ ఖాతాలు ఓపెన్‌ చేసి ఇస్తే ఆయా ఖాతాల్లో డిపాజిటయ్యే డబ్బుల్లో కొంతమేర కమీషన్‌ ఇస్తామంటూ ఈ ముగ్గురికి ఎర చూపారు. దీంతో వారు వివిధ పేర్లన్న వ్యక్తుల ఆధార్, పాన్‌కార్డులు ఉపయోగించి పదుల సంఖ్యలో ఖాతాలు ఓపెన్‌ చేశారు. ఇలా అంతా సిద్ధమయ్యాక నైజీరియన్లు విడాకులు తీసుకున్న మహిళలు మళ్లీ వివాహం చేసుకునేందుకు మ్యాట్రిమోనీ వెబ్‌సైట్‌లో వివరాలు నమోదు చేసుకున్న వారినే లక్ష్యంగా చేసుకున్నారు.

ఇందుకోసం యూకేలో ఆర్థోపెడిక్‌ వైద్యుడిగా పనిచేస్తున్ననంటూ డాక్టర్‌ విపుల్‌ ప్రకాశ్‌ పేరుతో నకిలీ ప్రొఫైల్‌ సృష్టించారు. గూగుల్‌ నుంచి సేకరించిన కొందరి ఫొటోలు ప్రొఫైల్‌లో షేర్‌ చేశారు. ఈ ప్రొఫైల్‌ చూసిన నల్లగండ్లలో ఉంటున్న ముంబై వాసి మహిళా వైద్యురాలు ఆసక్తి చూపడంతో వాట్సాప్‌ చాటింగ్‌ చేయడం మొదలెట్టారు. కొన్నిరోజులకే మిమ్మల్ని వివాహం చేసుకుంటానని, భారత్‌కు త్వరలోనే వస్తానని, ఇప్పటికే భారీగా డబ్బులు సంపాదించానని అక్కడే సెటిల్‌ అవుతానంటూ నమ్మించారు. కొన్నిరోజులకే బంగారు ఆభరణాలు, యాపిల్‌ ఫోన్, రిస్ట్‌ వాచ్, డాలర్లు తదితర ఖరీదైన బహుమతులను కొరియర్‌ ద్వారా పంపించానంటూ బాధితురాలికి చెప్పారు. కొన్ని గంటలకే ఢిల్లీ కస్టమ్స్‌ డిపార్ట్‌మెంట్‌ నుంచి మాట్లాడుతున్నానంటూ డాక్టర్‌ విపుల్‌ ప్రకాష్‌ పంపిన గిఫ్ట్‌ బాక్స్‌  పంపించాలంటే కస్టమ్స్‌ క్లియరెన్స్, జీఎస్‌టీ తదితరాలు చెల్లించాలని ఫోన్‌కాల్‌ చేశారు. ఇది నిజమని నమ్మిన బాధితురాలు వారు పంపిన బ్యాంక్‌ ఖాతాల్లో రూ.7,45,000 డిపాజిట్‌ చేసింది. ఆ తర్వాత ఇది మోసమని సైబరాబాద్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులకు ఫిబ్రవరి గత 4న ఫిర్యాదు చేసింది. ఈ కేసు విచారణలో ఉండగానే మళ్లీ బాధితురాలికి ఫిబ్రవరి 15న ఓ వ్యక్తి గిఫ్ట్‌బాక్స్‌/లాకర్‌ (నంబర్‌ లాక్, పాస్‌వర్డ్‌ కలిగిన) కొరియర్‌ వచ్చిందంటూ గిడ్డీ తీసుకొచ్చి ఇచ్చాడు. ఈ లాకర్‌లో భారీగా విదేశీ కరెన్సీ, బంగారు ఆభరణాలు ఉన్నాయని ఇంగ్లిష్‌లో మాట్లాడాడు. ఆ వెంటనే డాక్టర్‌ విపుల్‌ ప్రకాశ్‌గా ఫోన్‌కాల్‌ రాగానే నిజమని నమ్మింది. మళ్లీ మోసగాళ్లు ఇచ్చిన బ్యాంక్‌ ఖాతాల్లో రూ.ఐదు లక్షలు డిపాజిట్‌ చేసింది. చివరకు మళ్లీ ఇది మోసమని ఫిబ్రవరి 26న మళ్లీ ఫిర్యాదు చేసింది.

టెక్నికల్‌ డాటాతో..
ఆయా బ్యాంక్‌ ఖాతాల చిరునామాలతో పాటు అవి డబ్బులు డ్రా అయిన ఏటీఎం కేంద్రాల్లో ఉన్న సీసీటీవీ కెమెరాల్లో చిక్కిన దృశ్యాల ఆధారంగా మొదటగా ముగ్గురు నేపాలీలను పట్టుకున్నారు. వారితోనే నైజీరియన్‌ గిడ్డీ ఇసాక్‌ ఓలూను పట్టుకున్నారు. ప్రధాన నిందితుడు ఎసెలూ ఉడో మాత్రం అక్కడా అందుబాటులో లేకుండా పోయాడు. అతడ్ని పట్టుకునేందుకు పోలీసు బృందాలు అక్కడే ఉన్నాయని సీపీ సజ్జనార్‌ తెలిపారు. ఢిల్లీలో అరెస్టు చేసిన ఈ నలుగురు నిందితులను ట్రాన్సిట్‌ వారంట్‌పై నగరానికి తీసుకొచ్చి కోర్టులో హజరుపరిచి జైలుకు తరలించామన్నారు. అయితే కస్టమ్స్‌ క్లియరెన్స్‌ ఫీ, ఆర్‌బీఐ క్లియరెన్స్‌ ఫీ, జీఎస్‌టీ, సర్వీసు ట్యాక్స్, కొరియర్‌ చార్జీలు, లాకర్‌ కోడ్‌ ఫీ, బ్లాక్‌ కరెన్సీ క్లీన్‌ పౌడర్‌ల పేర్లతో ఫోన్‌కాల్స్‌ చేస్తే నమ్మవద్దని సీపీ సజ్జనార్‌ సూచించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement