Matrimony website
-
పెళ్లి కూతురిని వెతకనందుకు రూ.60 వేలు జరిమానా!
కుమారుడికి పెళ్లి కూతురుని వెతకడంలో విఫలమైన ఓ మ్యాట్రిమోనీ కంపెనీపై తండ్రి కోర్టుకెళ్లిన ఘటన బెంగళూరులో చోటు చేసుకుంది. దీనిపై విచారణ జరిపించిన కోర్టు కుమారుడి తండ్రికి రూ.60,000 చెల్లించాలని కంపెనీని ఆదేశిస్తూ తీర్పునిచ్చింది. ఇంతకీ తండ్రి, కంపెనీ మధ్య ఎలాంటి వివాదం ఉందో, దీనిపై కోర్టుకు ఎందుకు వెళ్లాల్సి వచ్చిందో తెలుసుకుందాం.సామాజిక మాధ్యమాల వేదికగా చేసిన ప్రమోషన్ ఆధారంగా కుమార్ అనే వ్యక్తి దిల్మిల్ అనే మ్యాట్రిమోనీ కంపెనీను మార్చిలో ఆశ్రయించాడు. తన కుమారుడు బాలాజీకి పెళ్లి చేయాలనుకుంటున్నట్లు చెప్పాడు. అందుకు పెళ్లి కూతురును వెతికే బాధ్యతను కంపెనీకి అప్పగించాడు. సంస్థ అందుకు నెల రోజుల సమయం విధించింది. ప్రతిగా ఇనిషియల్ పేమెంట్ ఛార్జీల కింద కుమార్ నుంచి రూ.30,000 వసూలు చేసింది. ముందుగా నిర్ణయించిన సమయం ప్రకారం నెల తర్వాత కుమార్ వెళ్లి వివరాలు అడిగితే కంపెనీ స్పందించలేదు. ఏప్రిల్ నెలాఖరు వరకు ఆగాలని కంపెనీ ప్రతినిధులు కోరారు. ఏప్రిల్ తర్వాత కూడా తనకు పెళ్లికుతురి వివరాలు పంపలేదు. దాంతో మే నెలలో కళ్యాణ్ నగర్‌లోని దిల్మిల్ మ్యాట్రిమోనీ కంపెనీకి కుమార్ లీగల్ నోటీసులు పంపాడు. కోర్టు నోటీసులకు కూడా కంపెనీ స్పందించలేదు. దాంతో బెంగళూరు వినియోగదారుల కమిషన్‌కు ఫిర్యాదు చేశాడు.ఇదీ చదవండి: ఎలక్ట్రిక్ బైంక్ లాంచ్ చేసిన రాయల్ ఎన్ఫీల్డ్అక్టోబరు 28న న్యాయస్థానం దిల్మిల్ సంస్థపై చర్యలు చేపట్టింది. కుమార్‌కు అనుకూలంగా తీర్పునిచ్చింది. తాను ముందుగా చెల్లించిన సొమ్ముపై 6 శాతం వడ్డీతోపాటు నష్ట పరిహారంగా రూ.20,000 చెల్లించాలని ఆదేశించింది. కస్టమర్‌కు మానసిక వేదన కలిగించినందుకు రూ.5000, లీగల్ ఖర్చులకు మరో రూ.5000 చెల్లించాలని కంపెనీని స్పష్టం చేసింది. -
గొంతు మార్చి.. ఏమార్చి!
సాక్షి, హైదరాబాద్: వాయిస్ ఛేంజ్ ఫీచర్ సాంకేతికతతో అమ్మాయిల గొంతులాగా మాట్లాడుతూ మోసాలకు పాల్పడుతున్న ఇద్దరు సైబర్ నేరస్తులను రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు పట్టుకున్నారు. ఇన్స్పెక్టర్ కాశీ విశ్వనాథ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని తూర్పు గోదావరి జిల్లా కాకినాడకు చెందిన కోమలి సూర్య ప్రకాశ్, శెట్టి సతీష్‌లు ఇంటర్నెట్ నుంచి అమ్మాయిల ఫొటోలను డౌన్లోడ్ చేసి నకిలీ పేరు, ఇతరత్రా వివరాలతో మ్యాట్రిమోనీ సైట్లలో తమ పేర్లను నమోదు చేసుకున్నారు. నకిలీ ప్రొఫైల్స్‌ను మ్యాట్రిమోనిలో అబ్బాయిలకు పంపించేవారు. తీయని మాటలతో వాట్సాప్ చాట్లు, ఫోన్లు మాట్లాడుతుండేవారు. కొద్ది రోజుల తర్వాత పెళ్లి ప్రస్తావన తీసుకొస్తుంటారు. బాధితుల కుటుంబ వివరాలు, ఫొటోలను వాట్సాప్ ద్వారా సేకరించేవారు. తల్లిదండ్రులకు అనారోగ్యం, చదువుల ఫీజులు, వ్యాపారంలో నష్టాలు అంటూ రకరకాల కారణాలు చెప్పి డబ్బులు వసూలు చేసేవారు. ఈ క్రమంలో రూ.13.27 లక్షలు మోసపోయిన బాధితులు రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు శుక్రవారం ఇద్దరు నిందితులు సూర్య ప్రకాశ్, సతీష్‌లను అరెస్టు చేశారు. ఇప్పటివరకు ఈ నిందితులు రామగుండం ఎన్టీపీసీ, సైబరాబాద్, రాచకొండ సైబర్ క్రైమ్ ఠాణాల పరిధిలోని పలువురు బాధితుల నుంచి ఇదే తరహాలో రూ.33.68 లక్షలు మోసం చేశారు. -
పెళ్లి పేరుతో రూ.70 లక్షలు దోచేశాడు!
సాక్షి, హైదరాబాద్: పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి ఓ మహిళ నుంచి రూ.70 లక్షలు వసూలు చేసిన ఘరానా మోసగాడిని సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు శనివారం అరెస్టు చేసి, జ్యుడీయల్ రిమాండ్‌కు తరలించారు. ఏసీపీ రవీంద్రారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని కృష్ణా జిల్లాకు చెందిన ద్రోణాదుల రాజేశ్ స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేస్తుంటాడు. జూదం, విలాసాలకు బానిసై డబ్బు కోసం మ్యాట్రిమోనీ యాప్‌లలో నకిలీ ప్రొఫైల్స్ పెట్టి అమ్మాయిలకు వల వేస్తుంటాడు. ఈక్రమంలో గతేడాది ఏప్రిల్‌లో తెలుగు మ్యాట్రిమోనీ యాప్‌లో ఓ మహిళతో పరిచయం ఏర్పడింది. రోజూ వాట్సాప్‌లో సంభాషణలు, చాటింగ్‌లతో ఆమెకు మాయమాటలు చెబుతూ నమ్మించాడు. ఈక్రమంలో పెళ్లి ప్రస్తావన తీసుకురావడంతో పూర్తిగా విశ్వసించి.. ఒకసారి వ్యక్తిగతంగా కలిసి మాట్లాడదామని కోరింది. దీంతో తన తల్లిదండ్రులు, తమ్ముడు కృష్ణా జిల్లాలో నివాసం ఉంటున్నారని, కొన్ని ఆర్థిక సమస్యలు ఉన్నాయని చెప్పాడు. సహాయం చేయాలని కోరడంతో ఆమె గతేడాది ఏప్రిల్ 30న రూ.2 లక్షలు నగదు ఇచి్చంది. దీంతో ఇద్దరూ ప్రకాశ్‌నగర్‌లోని ఓ హోటల్లో కలిశారు. ఇక అప్పటి నుంచి మాయమాటలు చెబుతూ డబ్బు వసూలు చేయడం మొదలుపెట్టాడు. ఈ సొమ్ముతో జూదం, క్రిప్టో కరెన్సీ, స్టాక్ మార్కెట్ల ట్రేడింగ్ చేసేవాడు. అప్పు చేసి మరీ.. ముత్తూట్ ఫైనాన్స్‌లో బంగారం రుణం, రూ.52 లక్షలు గృహరుణంతో పాటు మనీవ్యూ, పోస్ట్‌పే వంటి వ్యక్తిగత రుణ యాప్‌లలో లోన్లు తీసుకొని మొత్తం రూ.70 లక్షలు రాజేశ్‌కు ఇచ్చింది. అనంతరం నిందితుడు ఆమెను పట్టించుకోవడం మానేశాడు. అంతేకాకుండా ఆమెను వివాహం చేసుకోవడం ఇష్టం లేదని తేల్చి చెప్పేశాడు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు రాజేశ్‌ను అరెస్టు చేసి, అతని నుంచి రెండు సెల్ఫోన్లు స్వాదీనం చేసుకున్నారు. -
మహిళను ముంచిన ‘మ్యాట్రిమోని’ ప్రేమ!
హైదరాబాద్: మ్యాట్రిమోని సైట్లో పరిచయం చేసుకొని నగరానికి చెందిన ఓ మహిళను సైబర్ చీటర్స్ మోసం చేశారు. నగర సైబర్ క్రైమ్ ఏసీపీ శివమారుతి తెలిపిన వివరాల ప్రకారం... ఓ మహిళ వివాహం కోసం మ్యాట్రిమోని సైట్లో రిజిస్టార్ చేసుకుంది. ఈ సైట్ ద్వారా ఓ వ్యక్తి పరిచయం అయ్యాడు. ఇద్దరూ కలిసి కొద్ది రోజులు చాట్ చేసుకున్నారు. తనను ప్రేమిస్తున్నానని నమ్మించాడు. తాను అమెరికాలో ఉన్నత స్థాయిలో పనిచేసే వ్యక్తినని, అమెరికా నుంచి ఇండియా వచ్చాక పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. కొద్దిరోజుల తర్వాత ఇండియాలో ఉన్న తమ బంధువులకు సీరియస్‌గా ఉందని, వైద్యం చేయించాలని చెప్పి ఆ ఖర్చులకు గాను డబ్బులు కావాలని అడిగాడు. తాను ఇండియా వచ్చాక మొత్తం డబ్బులు తిరిగి ఇస్తానని, తర్వాత పెళ్లి కూడా చేసుకుందామని నమ్మించాడు. దీంతో ఆ మహిళ విడతల వారిగా రూ. 30 లక్షలు చీటర్స్ చేప్పిన విధంగా ఆన్లైన్ ద్వారా ట్రాన్స్ఫర్ చేసింది. అనంతరం ఆ వ్యక్తి స్పందించకపోవడంతో అనుమానం వచ్చిన మహిళ మోసపోయానని నగర సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ శివమారుతి తెలిపారు. ఈ తరహా మ్యాట్రిమోని మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, గుర్తు తెలియని వారితో ఆన్లైన్లో ప్రేమ, పెళ్లి అని చెబితే నమ్మవద్దని సైబర్ క్రైమ్ పోలీసులు సూచిస్తున్నారు. -
యువతులే అతడి టార్గెట్.. ఖరీదైన కార్లు, బంగ్లాతో రిచ్ బ్యాచిలర్..
ధనవంతుడిలా కటింగ్ ఇచ్చాడు ఓ కన్నింగ్ ఫెలో. బీసీఏ, ఎంబీఏ పూర్తిచేసి తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే ఉద్దేశ్యంతో రెస్టారెంట్ పెట్టి ఘోరంగా నష్టపోయాడు. దీంతో, మనీ సంపాదించడం కోసం అడ్డదారులు తొక్కాడు. మ్యాట్రిమోనిలో రిచ్ బ్యాచ్‌లర్‌గా కలరింగ్ ఇస్తూ.. పెళ్లి పేరుతో పలువురు యువతులను మోసం చేశాడు. ఓ యువతి ద్వారా గుట్టురట్టై జైలుపాలయ్యాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. ముజఫర్‌నగర్‌కు చెందిన విశాల్(26) బీసీఏ, ఎంబీఏ పూర్తిచేశాడు. అనంతర, గుర్గావ్లోని ఓ మల్టీనేషనల్ కంపెనీలో హెచ్ఆర్గా ఉద్యోగంలో చేరాడు. ఈ క్రమంలో తక్కువ సమయంలోనే లక్షల్లో డబ్బు సంపాదించాలన్న ఆశతో మూడేండ్లకే ఉద్యోగం మానేసి ఓ రెస్టారెంట్ పెట్టుకున్నాడు. అయితే రెస్టారెంట్ వ్యాపారం అతనికి కలిసిరాలేదు. లక్షల్లో అప్పులయ్యాయి. దీంతో, డబ్బు కోసం ఏం చేయాలా అని ఆలోచించాడు. మైండ్ ఐడియా తట్టిందే అదనుగా.. మాట్రిమోనీ వెబ్సైట్లను టార్గెట్‌ను చేశారు. పెళ్లి పేరుతో యువతులను వల వేయడం ప్రారంభించాడు. ఈ క్రమంలోనే మ్యాట్రిమోనీల్లో రిచ్ బ్యాచిలర్లా ఫ్రొఫైల్ సెట్ చేశాడు. ఆ ప్రోఫైల్ చూసి కాంటాక్ట్ అయిన యువతులకు.. అతను అద్దెకు తెచ్చుకున్న లగ్జరీ కార్లు, భవనాలు చూపిస్తూ అతి తనవేనంటూ ఓవర్ బిల్డప్ ఇచ్చేశాడు. యువతి టచ్‌లోకి రాగానే వారికి మాయమాటలు చెప్పి వాళ్ల నుంచి అందినకాడికి డబ్బులు తీసుకున్నాడు. అనంతరం వాళ్ల ఫోన్ నెంబర్లు బ్లాక్ చేసి దూరంపెట్టేవాడు. అయితే, తాజాగా విశాల్ మ్యాట్రిమోనీ ప్రోఫైల్ చూసి పెళ్లి విషయమై గుర్గావ్కు చెందిన ఓ యువతి, ఆమె ఫ్యామిలీ కాంటాక్ట్ అయ్యారు. ఈ సందర్బంగా తన రిచ్‌నెస్ చూపించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశాడు. తనకు పలు విల్లాలు ఉన్నాయని, హోటల్ వ్యాపారాలు ఉన్నాయని బిల్డప్ ఇచ్చాడు. ఈ క్రమంలోనే విదేశాల నుంచి ఖరీదైన వస్తువులు, సెల్‌ఫోన్స్ తక్కువ ధరకే తెప్పిస్తానని మాయమాటలు చెప్పి ఆమె దగ్గరి నుంచి డబ్బులు వసూలు చేశాడు. అంతటితో ఆగకుండా ఆమె ఫ్రెండ్స్, బంధువుల నుంచి అందినకాడికి ఆర్డర్లు తీసుకున్నాడు. ఇలా మొత్తం రూ.3.05 లక్షలను బాధితురాలి నుంచి రాబట్టాడు. కాగా, వస్తువులు, ఫోన్ల కాలం బాధితులు విశాల్‌కు ఫోన్లు చేయడంతో వారి నంబర్లను కూడా బ్లాక్ చేశాడు. దీంతో, తేరుకున్న బాధితులు పోలీసులను ఆశ్రయించి.. జరిగిన విషయాన్ని తెలిపారు. దీంతో, రంగంలోకి దిగిన పోలీసులు.. ఓ మహిళా కానిస్టేబుల్‌తో డెకాయ్ ఆపరేషన్ చేపించి విశాల్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ క్రమంలో రిచ్ బ్యాచిలర్ అసలు కథ బయటకు వచ్చింది. ఇతగాడి మోసాలు తెలుసుకుని బాధితులు, పోలీసులు షాక్ తిన్నారు. -
Viral: మ్యాట్రిమోనీలో యాడ్.. సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కాల్ చేయద్దంటూ..
ఒకప్పుడు బంధువులు, తెలిసిన వారి ద్వారా పెళ్లి సంబంధాలు కుదిరేవి. ఇప్పుడు కాలం మారింది. మ్యాట్రిమోనీ సైట్లు వచ్చాక ఎక్కువగా వీటిపైనే ఆధారపడుతున్నారు. తమ వివరాలతో ప్రొఫైల్ క్రియేట్ చేసి మ్యాట్రిమోనీ సైట్లలో అప్లోడ్ చేసేస్తున్నారు. అంతేగాక తమకు ఎలాంటి గుణాలు ఉన్న వ్యక్తి కావాలో కూడా చెప్పుకునే అవకాశం ఉటుంది. వీటితోపాటు పత్రిక ప్రకటనలు చూసి కూడా పెళ్లిళ్లు నిశ్చయించుకుంటున్నారు. తాజాగా ఓ పత్రికలో ఇచ్చిన పెళ్లి ప్రకటన వైరల్‌గా మారింది. వ్యాపారవేత్త సమీర్ అరోరా.. న్యూస్ పేపర్లో ప్రచురితమైన మ్యాట్రిమోనీ అడ్వర్టైజ్మెంట్ క్లిప్‌ను ట్విటర్లో షేర్ చేశారు. ఇందులో 24 ఏళ్ల అందమైన అమ్మాయికి ధనవంతులైన, బిజినెస్ బ్యాగ్రౌండ్ ఉన్న వరుడు కావాలి. అదే కులానికి చెందిన ఐఏఎస్, ఐపీఎస్, లేదా డాక్టర్ అని అయి ఉండాలి’ అని ఉంది. అయితే ఇక్కడ వరకు బాగానే ఉన్నా ప్రకటన చివర్లో ‘సాఫ్ట్వేర్ ఇంజనీర్లు దయచేసి కాల్ చేయవద్దు’ అని నొక్కి చెప్పారు. ‘ఐటీ రంగానికి భవిష్యత్తు అంతాగా కనిపించడం లేదు’ అనే ట్యాగ్‌లైన్‌తో షేర్ చేసిన ఈ పోస్టు ప్రస్తుతం నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. Future of IT does not look so sound. pic.twitter.com/YwCsiMbGq2 — Samir Arora (@Iamsamirarora) September 16, 2022 ఓ వర్గం వారు నిజమేనంటూ మద్దతిస్తుంటే.. మరో వర్గం వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు మండిపడుతున్నారు. ఈ యాడ్ చూస్తుంటే.. దేశ భవిష్యత్తు మొత్తం మంచిగా కనిపించడం లేదు. ఐటీ లేకుంటే భవిష్యత్తే బాగోదు. హమ్మయ్యా నాకు 11 ఏళ్ల క్రితమే పెళ్లైంది. ఇది సరైంది కాదు. డోంట్ వర్రీ..ఇంజనీర్లు ఇలాంటి వార్తాపత్రికల ప్రకటనపై ఆధారపడరు. వారు తమంతట తాముగా ప్రతిదీ వెతుకుంటారు’ అని రకరకాలుగా కామెంట్ చేస్తున్నారు.అయితే ఇది ఎక్కడ జరిగిందో తెలియదు కాని ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతోది. Don't worry..Engineers don't rely on some newspaper ad. They find everything on their own. — Ajay sharma (@Ajaysha17977479) September 16, 2022 Looking at the ad, the whole country's future doesn't look so sound. — Ashutosh Vishwakarma (@aashutoshaawara) September 16, 2022 Thank god, I got married 11 years ago! — Bharat Trader 🇮🇳 (@BharatTrader) September 16, 2022 -
జోడీల ముసుగులో కేడీలు
(బీవీ రాఘవరెడ్డి): అప్పట్లో పెళ్లిళ్ల పేరయ్యలు, ఆ మ్యారేజి బ్యూరోలు సంబంధాలు కుదర్చటంలో ముఖ్య పాత్ర పోషించగా టెక్నాలజీ పెరిగాక వెబ్సైట్లు, యాప్‌లు వచ్చేశాయి. కాలికి బలపం కట్టుకుని తిరిగే పని లేకుండా ఇంట్లో కూర్చుని ఇంటిల్లిపాదీ తిలకించేలా చౌకగా సేవలందిస్తున్నాయి. దేశంలో ప్రముఖ పెళ్లిళ్ల వెబ్సైట్లను పరిశీలిస్తే భారత్ మ్యాట్రిమోనికి కోటి మందికి పైగా వినియోగదారులున్నారు. మ్యాచ్‌ఫైండర్ మ్యాట్రిమోనిలో రెండు వేల ప్రాంతాలకు చెందిన యువతీ యువకులు రిజిస్టర్ చేసుకున్నారు. 2002లో ప్రారంభించిన ఫ్రీ వెబ్సైట్ వివాహ్ డాట్‌కామ్ ఉచితంగానే సేవలందిస్తోంది. వెబ్గేట్ డాట్‌కామ్ రోజుకు 600 మందికి పైగా ఖాతాదారులకు సేవలు అందిస్తున్నట్లు చెబుతోంది. 1996లో ప్రారంభమైన షాదీ డాట్‌కామ్ దేశంలోనే మొదటిదిగా చెబుతారు. కమ్యూనిటీ మ్యాట్రిమోనికి దేశంలో 140 శాఖలున్నాయి. డైవర్సీ మ్యాట్రిమోని యాప్‌ను 5 లక్షల మంది డౌన్లోడ్ చేసుకుని ఉపయోగిస్తున్నారు. వెబ్సైట్ నిర్వాహకుల్లో కొందరు ఉచితంగా సేవలందిస్తుంటే మిగిలిన వారు రూ.500 నుంచి రూ.5,000 వరకు వసూలు చేస్తున్నారు. మొబైల్లో యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫీజు చెల్లిస్తే సరైన జోడీని వెతికి పెడతామంటున్నారు. విద్యార్హతలు, ఉద్యోగం, ఇష్టాయిష్టాలు, కుల గోత్రాలు, జాతకచక్రాలు, ఆర్థిక స్థితి, కుటుంబ నేపథ్యం లాంటి వివరాలన్నీ ఫొటోలు, ఫోన్ నంబర్లతో సహా వెబ్సైట్లు అందుబాటులో ఉంచుతున్నాయి. యువతీ యువకుల ప్రాధాన్యతలకు అనుగుణంగా పర్ఫెక్ట్ మ్యాచ్‌లను సూచిస్తున్నాయి. మ్యాట్రిమోనీ వెబ్‌సైట్స్‌లో అబ్బాయిల కంటే అమ్మాయిలే చురుగ్గా ఉంటున్నారు. ఆచి తూచి అడుగేయాల్సిందే... ఇదంతా ఒకఎత్తు కాగా పెళ్లిళ్ల వెబ్సైట్లను ఆసరాగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్న కేసులు పెరుగుతున్నాయి. నకిలీ ప్రొఫైల్స్, ఫొటోలతో రిజిస్టర్ చేసుకుని అమాయకులను మోసగిస్తున్నారు. మార్ఫింగ్ సర్టిఫికెట్లు అప్లోడ్ చేసి కొందరు కేటుగాళ్లు టోకరా వేస్తున్నారు. వివరాలు సేకరించి బహుమతులు పంపి ఎర వేస్తుంటారు. లైంగిక దాడులకు పాల్పడుతున్న ఘటనలూ వెలుగు చూస్తున్నాయి. ఇలాంటి వాటి బారిన పడకుండా అప్రమత్తత అవసరం. సమాచారం కోసమే మ్యాట్రిమోని సైట్లను ఉపయోగించుకోవాలి. పెద్దల ద్వారా ప్రత్యక్షంగా పూర్తి వివరాలు నిర్ధారించుకున్న తర్వాతే ఒక నిర్ణయానికి రావాలి. ఫోన్ చేసి డబ్బులు అడగడం, వ్యక్తిగత ఫొటోలు పంపమనటం, హోటళ్లకు రావాలని కోరితే సందేహించాల్సిందే. ట్విట్టర్, ఫేస్బుక్ లాంటి సోషల్ మీడియా ఖాతాలను క్షుణ్నంగా పరిశీలించాలి. అమెరికా వెళ్దామని.. పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేటలోని రామిరెడ్డిపేటకు చెందిన రజని (పేరు మార్చాం) భర్తతో మనఃస్పర్థల కారణంగా విడాకులు తీసుకుంది. ఓ మ్యాట్రిమోని వెబ్సైట్ ద్వారా కొచ్చర్ల శ్రీకాంత్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. పెళ్లి చేసుకుని అమెరికా వెళ్దామని చెప్పడంతో నమ్మింది. వీసా కావాలంటే బ్యాంకు ఖాతాలో పెద్ద మొత్తంలో డబ్బులు ఉండాలంటూ విడతల వారీగా రూ.48 లక్షలు కాజేసి ఫోన్ స్విచ్చాఫ్ చేశాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన పోలీసులు నిందితుడు కాకినాడకు చెందిన వంశీకృష్ణగా గుర్తించారు. బీఫార్మసీ చదివి వ్యసనాలకు బానిసై మోసాల బాట పట్టాడు. అతడిపై హైదరాబాద్, రామగుండం, రాజమహేంద్రవరం, విశాఖపట్నం తదితర ప్రాంతాల్లో 2009 నుంచి 16కిపైగా చీటింగ్ కేసులు నమోదయ్యాయి. ప్రకాశం జిల్లాకు చెందిన ఓ యువతిని పెళ్లి చేసుకుని అమెరికా పేరుతో రూ.17.5 లక్షలు స్వాహా చేశాడు. ఈ ఏడాది జనవరి 30న పోలీసులు అరెస్టు చేయగా బెయిల్‌పై విడుదలై తిరిగి అదే పంథాలో నరసరావుపేట మహిళను మోసగించి పరారయ్యాడు. సంపన్న మహిళలపై వల మ్యాట్రిమోనియల్ సైట్ల ద్వారా 40 మంది మహిళలను మోసగించిన వ్యక్తిని ముంబై పోలీసులు అరెస్టు చేశారు. షేర్ మార్కెట్లో పెట్టుబడి పేరుతో తన వద్ద రూ.2.25 లక్షలు కాజేసినట్లు యువతి ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. విశాల్ సురేశ్ చవాన్ అలియాస్ అనురాగ్ చవాన్(34) మ్యాట్రిమోనియల్ వెబ్‌సైట్స్‌లో నకిలీ ఖాతాలు సృష్టించి సంపన్న మహిళలపై వల విసిరాడు. ఖరీదైన ఐ ఫోన్లను బహుమతిగా పంపి ఆకట్టుకునేవాడు. పెట్టుబడుల పేరుతో డబ్బులు కాజేయడంతోపాటు, కొందర్ని హోటళ్లకు రప్పించుకుని లైంగిక దాడికి పాల్పడ్డాడు. మత్తుమందు ఇచ్చి.. పెళ్లిళ్ల వెబ్సైట్ల ద్వారా 12 మంది మహిళలను ఆకర్షించి లైంగిక వేధింపులకు పాల్పడ్డ ఓ మెకానికల్ ఇంజనీర్‌ను ముంబై పోలీసులు 2021 జూన్ 8న అరెస్టు చేశారు. మహేశ్ అలియాస్ కరణ్ గుప్తా మ్యాట్రిమోనియల్ వెబ్సైట్లలో నకిలీ ప్రొఫైల్స్‌తో రిజిస్టర్ చేసుకున్నాడు. మహిళలతో ఫోన్లో మాట్లాడి పబ్‌లు, రెస్టారెంట్లకు ఆహ్వానించేవాడు. మత్తుమందు కలిపిన డ్రింక్ తాగించి లైంగిక వేధింపులకు పాల్పడేవాడని వెల్లడైంది. హ్యాకర్‌గా పనిచేసిన అనుభవంతో తెలివిగా నేరాలకు పాల్పడేవాడు. గిఫ్ట్‌లు పంపి.. విశాఖకు చెందిన మీనాక్షి (పేరు మార్చాం) భర్త చనిపోవడంతో మాట్రిమోనీ డాట్‌కామ్ ద్వారా అమెరికాలోని ఓ సా‹ఫ్ట్‌వేర్ ఇంజనీర్‌తో పరిచయం పెంచుకుంది. అమెరికా నుంచి పలుసార్లు గిఫ్్టలు కూడా ఆమెకు అందాయి. కొన్నాళ్ల తర్వాత అత్యవసరమని చెప్పడంతో బాధితురాలు రూ.50 లక్షలు అతడికి ట్రాన్స్ఫర్ చేసింది. ఆ తర్వాత నుంచి నిందితుడి ఫోన్ పనిచేయలేదు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
ప్రేమ పేరిట అమ్మాయిలకు ఎర.. నమ్మిన స్నేహితులను కూడా
సాక్షి, పెద్దపల్లి, ఖమ్మం : పెళ్లి సంబంధాల కోసం మ్యాట్రీమోనీ సైట్లలో పరిచయమయ్యే మహిళలే కాకుండా స్నేహితులను మాయమాటలతో బురిడీ కొట్టించి రూ.కోటికి పైగా కొల్లగొట్టిన మోసగాడిని శుక్రవారం అరెస్ట్ చేసినట్లు పెద్దపల్లి ఏసీపీ సారంగపాణి వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాలు... ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం వెంకటాపురానికి చెందిన రాహుల్ ప్రస్తుతం హైదరాబాద్ కూకట్‌పల్లిలో నివాసముంటున్నాడు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌కు చెందిన ఓ మహిళ భర్త చనిపోవడంతో రెండో పెళ్లి కోసం వెబ్సైట్లో వివరాలు నమోదు చేసింది. దీంతో ఆమెను పెళ్లి చేసుకుంటానని నమ్మించిన రాహుల్ రూ.15.5లక్షల నగదు, ఐదున్నర తులాల బంగారు ఆభరణాలు తీసుకున్నాడు. ఆ తర్వాత కూడా మరికొంత డబ్బు తీసుకుంటూ, ఇచ్చేస్తున్న ఆయన అమెరికాలో ఉద్యోగం ఇప్పిస్తానని రూ.లక్షల్లో డబ్బు వసూలు చేశాడు. ఆ తర్వాత బంగారు ఆభరణాలు తీసుకుని ఫైనాన్స్ సంస్థలో కుదవపెట్టగా తనను మోసం చేసినట్లు తెలుసుకున్న ఆమె పోలీసులను ఆశ్రయించింది. దీంతో సుల్తానాబాద్ సీఐ ఇంద్రసేనారెడ్డి, ఎస్ఐ ఉపేందర్ ప్రత్యేక బృందాలతో గాలించి రాహుల్‌ను అరెస్టు చేశారని ఏసీపీ తెలిపారు. అయితే, రాహుల్‌పై 2010లో ఖమ్మంలో, 2012లో హైదరాబాద్ ఎల్బీ.నగర్లో, 2013లో ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో చీటింగ్ కేసులు నమోదయ్యాయని ఏసీపీ సారంగపాణి వివరించారు. చదవండి: వ్యభిచార గృహంపై టాస్క్‌ఫోర్స్ పోలీసుల దాడి ఇటీవల స్నేహితులను కూడా ఐటీ సమస్యలు ఉన్నాయని నమ్మించి రూ.లక్షల్లో అప్పు తీసుకుని తిరిగి చెల్లించలేదని తెలిపారు. మంగళగిరికి చెందిన జాస్తి వెంకటేశ్వర్లు నుంచి రూ.50లక్షలు, విజయవాడకు చెందిన బంగారి భాగ్యలక్ష్మి నుంచి రూ.1.80లక్షలు, షేక్‌ఖలీల్ నుంచి రూ.4.86లక్షలు, నాయుడు వెంకటేశ్ నుంచి రూ.1.20లక్షలు, హైదరాబాద్‌కు చెందిన ప్రసన్నలక్ష్మి నుంచి రూ.25లక్షలు, ప్రకాశంకు చెందిన కరీముల్లా నుంచి రూ.1.45లక్షలు, బాచు అప్పన్న నుంచి రూ. 2.5లక్షలు, ముప్పిరాజు మణికంఠ నుంచి రూ. 2లక్షలు తీసుకుని మోసగించాడని తేలిందని చెప్పారు. -
మ్యాట్రిమోనీలో పరిచయం.. సహజీవనం చేసి.. కోరిక తీర్చుకుని..
కర్నూలు(హాస్పిటల్): మ్యాట్రిమనీ వెబ్సైట్లో పరిచయమైన వ్యక్తి రెండు నెలల పాటు సహజీవనం చేయడంతో పాటు బంగారు, నగదుతో ఉడాయించిన సంఘటన కర్నూలులో చోటుచేసుకుంది. స్థానిక బాలా జీనగర్‌కు చెందిన ఓ మహిళకు భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు. భర్తతో విభేదించి ఆమె విడాకులు ఇచ్చింది. ఈ క్రమంలో మళ్లీ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుని ఓ మ్యాట్రిమనీలో తన వివరాలను అప్లోడ్ చేసింది. చదవండి: వృద్ధుడి పైశాచికం.. కామంతో కళ్లు మూసుకుపోయి.. ఈ వివరాలను చూసిన చంద్రశేఖర్ అనే వ్యక్తి తాను రాజమండ్రిలో ఉద్యోగం చేస్తున్నానని చెప్పి ఆమెను నమ్మించాడు. రెండు నెలల పాటు కర్నూలులోనే ఆమెతో పాటు ఉన్నాడు. ఇటీవల ఆమె వద్ద 8 తులాల బంగారు, రూ.2లక్షల నగదు తీసుకుని ఉడాయించాడు. దీంతో ఆ మహిళ జరిగిన మోసంపై తాలూకా పోలీసులకు ఫిర్యాదు చేసింది. -
‘నేను ఐపీఎస్ అధికారిని.. తొలిచూపులోనే నచ్చావ్.. పెళ్లి చేసుకుందాం’
సాక్షి, జవహర్‌నగర్: ‘మ్యాట్రిమనిలో నీ ప్రొఫైల్ చూశాను.. నువ్వు నాకు నచ్చావు పెళ్లి చేసుకుందామా.. నేను ఐపీఎస్ అధికారినని.. హోంమంత్రిత్వ శాఖలో పనిచేస్తున్నాను’అంటూ పెళ్లి చూపులకు సంబంధించిన వివరాలు పోస్ట్ చేసిన మహిళతో పరిచయం చేసుకున్నాడు. సదరు యువతికి అనుమానం రావడంతో అసలు విషయం బయట పడింది. సీఐ భిక్షపతిరావు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ మహిళ తన కూతురికి పెళ్లి సంబంధాలు చూడాలని తెలుగు మ్యాట్రిమోనీలో తన కూతరుకు సంబంధించిన వివరాలు పొందుపరచింది. చదవండి: 24 ఏళ్లుగా అన్న కోసం గాలింపు.. చివరికి అతడి చేతిలోనే ఆమె వివరాలను చూసిన పుప్పాల హరిప్రసాద్ (29) స్పందించి తాను ఐపీఎస్ అధికారినంటూ మహిళతో పరిచయం చేసుకున్నాడు. కొన్ని రోజులు వీరి మధ్య మాటలు కొనసాగాయి. ఈ క్రమంలో సదరు యువతికి హరిప్రసాద్‌పై అనుమానం రావడంతో నిలదీసింది. దీంతో అతడు గత నెల 27న మహిళకు ఫోన్ చేసి బెదిరించాడు. ఈ మేరకు బాధితురాలు జవహర్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు దర్యాప్తు ప్రారంభించి నిందితుడు హరిప్రసాద్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. చదవండి: వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని.. పత్తి చేనులోకి తీసుకెళ్లి -
ఒంటరి మహిళలే టార్గెట్: అదే కిరణ్ ప్రత్యేకత
సాక్షి, హైదరాబాద్: ఒంటరి మహిళలను లక్ష్యంగా చేసుకొని పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి అందినకాడికి దండుకొని పారిపోతున్న మోసగాడు ములుగు జిల్లా ఇంచర్ల గ్రామానికి చెందిన కోరండ్ల కిరణ్‌కుమార్‌రెడ్డి(29) ఎట్టకేలకు పోలీసుల చేతికి చిక్కాడు. సాంకేతిక ఆధారాలను సేకరించిన సైబరాబాద్ పోలీసులు నిందితుడు తిరుపతిలో తలదాచుకున్నాడని తెలుసుకొని అక్కడే అదుపులోకి తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. కిరణ్‌తో పాటు ఇంకా ఎవరైనా స్నేహితులు ఉన్నారా? ఇప్పటివరకు ఎంత మంది మహిళలను మోసం చేశాడు? ఎంత డబ్బులు కాజేశాడు వంటి వివరాలను రాబట్టే పనిలో పోలీసులు ఉన్నట్లు తెలిసింది. ఒకట్రెండు రోజుల్లో విచారణ పూర్తి చేసి కోర్టు ఎదుట హాజరుపరుస్తామని ఓ ఉన్నతాధికారి ‘సాక్షి’కి తెలిపారు. నలుగురు పోలీసు సభ్యుల బృందం ఇన్వెస్టిగేషన్లో పాల్గొన్నట్లు తెలిసింది. చదవండి: మలక్‌పేట్ మెట్రోస్టేషన్ పైనుంచి దూకి.. వెలుగులోకి తెచ్చిన ‘సాక్షి’.. వివిధ మ్యాట్రిమోని సైట్లలో రిజిస్ట్రేషన్ చేసుకున్న వితంతువు, విడాకులు తీసుకొని ఒంటరిగా ఉంటున్న మహిళలను టార్గెట్ చేసి పెళ్లి చేసుకుంటానని నమ్మించి డబ్బులతో ఉడాయించడం కిరణ్ ప్రత్యేకత. ఇదే విధంగా కరీంనగర్, వరంగల్ జిల్లాలకు చెందిన పలువురు మహిళలను మోసం చేసి వారి నుంచి నగదు, డబ్బు తీసుకొని పారిపోయి ఫోన్లు స్విచ్ఛాఫ్ చేసుకున్నాడు. ఈ మోసగాడి చేతిలో మోసపోయిన ఓ మహిళ ఆగస్టు 22న సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని బాచుపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. చదవండి: భార్యపై కోపంతో కారు, 4 బైకులకు నిప్పు పెట్టిన ఐటీ ఉద్యోగి పోలీసుల పెద్దగా పట్టించుకోకపోవడంతో ‘సాక్షి’ని సంప్రదించింది. దీంతో సెప్టెంబర్ 9న ‘ఒంటరి మహిళలే టార్గెట్’ అనే శీర్షికతో ‘సాక్షి’ కథనం ప్రచురించింది. అయినా పోలీసుల విచారణ ముందుకు సాగకపోవడంతో అవమానం, ఒత్తిడి తట్టుకోలేక ఆ అభాగ్యరాలు సెప్టెంబర్ 19(ఆదివారం) ఆత్మహత్య చేసుకుంది. దీంతో ‘పోలీసు నిర్లక్ష్యమే చంపేసింది’ శీర్షికన సెపె్టంబర్ 23న ‘సాక్షి’ మరో కథనం ప్రచురించింది. దీంతో పోలీసు యంత్రాంగం ప్రత్యేక దృష్టిసారించి నిందితుడిని పట్టుకుంది. -
నూటొక్క జిల్లాల.. కేటుగాడు!
అతను ఉన్నత చదువులు చదివాడు. సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా కూడా పనిచేశాడు. అయితే తన ప్రతిభను, అర్హతలను సక్రమంగా కాకుండా వక్రమార్గంలో వాడాడు. కొన్నేళ్ల క్రితం మ్యాట్రిమోనీ వెబ్సైట్ ద్వారా ఓ యువతితో పరిచయం పెంచుకుని, చాటింగ్‌తోనే చీటింగ్ చేసి రూ.లక్షలు కొట్టేశాడు. చాలా సులువుగా డబ్బులు రావడంతో అప్పటినుంచి అదే ప్రవృత్తిగా ఎంచుకున్నాడు. తనకు బట్టతల ఉన్న విషయాన్ని దాచి.. మ్యాట్రిమోనీ వెబ్సైట్లలో యువతులకు వల వేసి మోసాలకు పాల్పడ్డాడు. అంతేకాదు.. గంజాయి స్మగ్లింగ్, నకిలీ సాఫ్ట్వేర్ కంపెనీలు పెట్టి ఉద్యోగాల పేరిట మోసాలు.. ఇలా అతని నేరాల చిట్టా చేంతాడంత ఉంది. చివరకు పోలీసుల చేతికి చిక్కడంతో అతగాడి లీలలకు తెరపడింది. చిత్తూరు అర్బన్: పెళ్లికాని యువతులను మ్యాట్రిమోనీ (వివాహ సంబంధాల) వెబ్సైట్ల ద్వారా పరిచయం చేసుకుని, వారి నుంచి రూ.లక్షలు కాజేసే కేటుగాడిని చిత్తూరు జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్పీ సెంథిల్‌కుమార్, డీఎస్పీ సుధాకర్‌రెడ్డిలు సోమవారం మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. ప్రకాశం జిల్లా అద్దంకి మండలం కొటికలపూడి గ్రామానికి చెందిన పున్నాటి శ్రీనివాస్ (33) డిగ్రీ వరకు అద్దంకిలో చదివి, హైదరాబాద్‌లో ఎంసీఏ చేశాడు. ఆపై ఐఐటీ కాన్పూర్‌లో ఎంటెక్ చేస్తూ మధ్యలో మానేశాడు. కొన్నాళ్లు సాఫ్ట్వేర్ ఇంజనీరుగా పనిచేశాడు. 2017లో ఓ మ్యాట్రిమోనీ వెబ్సైట్లో తన ఫొటో ఉంచగా.. ఓ యువతి పరిచయమైంది. ఆ యువతితో ఆన్లైన్ చాటింగ్ చేసి రూ.లక్షలు కాజేశాడు. కష్టపడకుండానే డబ్బులు రావడంతో ఇదే ప్రవృత్తిగా ఎంచుకున్నాడు. పలు మ్యాట్రిమోనీ వెబ్సైట్లలో తనకు బట్టతల ఉన్న విషయాన్ని దాచిపెట్టి.. విగ్గుతో ఉన్న ఫొటోలు పెట్టేవాడు. నకిలీ పేర్లతో పెళ్లికాని యువతులతో ఆన్లైన్లో చాటింగ్ చేయడం, పరిచయం పెరిగాక మాయమాటలు చెప్పి వారితో డబ్బులు తన బ్యాంకు ఖాతాలోకి వేయించుకునేవాడు. అలా.. 2017లో ఒంగోలుకు చెందిన ఓ టెకీ యువతి వద్ద రూ.27 లక్షలు, 2018లో నరసరావుపేటకు చెందిన మరో టెకీ యువతి వద్ద రూ.40 లక్షలు కాజేసి రెండు సార్లు అరెస్టు కూడా అయ్యాడు. జైలు జీవితం అనుభవించినా శ్రీనివాస్‌లో ఏమాత్రం మార్పు రాలేదు. రెండు నెలల క్రితం చిత్తూరుకు చెందిన ఓ యువతిని మ్యాట్రిమోనీ ద్వారా మోసం చేసి రూ.1.4 లక్షలు, మదనపల్లెలో మరో యువతిని మోసం చేసి రూ.7 లక్షలు కాజేశాడు. బాధిత యువతుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడికోసం గాలిస్తుండగా.. చిత్తూరు–బెంగళూరు బైపాస్ రోడ్డు వద్ద నాలుగు కిలోల గంజాయి స్మగ్లింగ్ చేస్తూ దొరికిపోయాడు. విచారణలో శ్రీనివాస్ లీలలు వెలుగుచూశాయి. నకిలీ సాఫ్ట్వేర్ కంపెనీలు, ఉద్యోగాల పేరిట డబ్బులు వసూలు చేయడం లాంటి నేరాల చిట్టా బయటపడింది. నిందితుడి నుంచి రూ.50 వేల నగదు, ఓ విగ్గు, రెండు సెల్ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు ఛేదించడంలో ప్రతిభ చూపించిన పోలీసు సిబ్బందికి ఎస్పీ నగదు రివార్డులు అందజేశారు. -
మాట్రిమోనియల్ మోసగాడు.. సాఫ్ట్వేర్ ఇంజినీర్కే కుచ్చుటోపి..
సాక్షి, హైదరాబాద్: నగరానికి చెందిన ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్‌కు పెళ్లి పేరుతో ఎర వేసి రూ.10 లక్షల కాజేసిన సైబర్ నేరగాడిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. ఢిల్లీలో పట్టుబడిన ఈ నైజీరియన్‌ను మంగళవారం సిటీకి తీసుకువచ్చారు. పోలీసుల కథనం ప్రకారం వివరాలు.. నైజీరియాకు చెందిన ఓషర్ ఎబుక విక్టర్ కొన్నేళ్లుగా ఢిల్లీలో నివసిస్తున్నాడు. సైబర్ నేరాలు చేయడం మొదలెట్టిన ఇతగాడు మాట్రిమోనియల్ వెబ్‌సైట్స్‌లో రిజిస్టర్ చేసుకున్న యువతుల్ని టార్గెట్‌గా చేసుకుంటున్నాడు. బేగంపేట ప్రకాష్ నగర్‌కు చెందిన ఓ యువతి ప్రముఖ సంస్థలో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పని చేస్తోంది. ఈమె ఇటీవల తన ప్రొఫైల్‌ను తెలుగు మాట్రిమోని సైట్లో అప్లోడ్ చేసింది. దీన్ని చూసిన విక్టర్ మేహుల్ కుమార్ పేరుతో ఆమెను సంప్రదించాడు. అమెరికాలో ఫార్మాసిస్ట్‌గా ఉద్యోగం చేస్తున్న గుజరాత్ వాసినంటూ పరిచయం చేసుకున్నాడు. ఇంటర్నెట్ నుంచి డౌన్లోడ్ చేసిన ఫొటోలను తనవే అంటూ పంపించాడు. కొన్నాళ్ల చాటింగ్ తర్వాత ఆమెను వివాహం చేసుకుంటానని నమ్మించాడు. పలు దఫాలుగా ఆమె నుంచి రూ.10 లక్షలు కాజేశాడు. చివరకు తాను మోసపోయానని గుర్తించిన బాధితురాలు సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. దీన్ని దర్యాప్తు చేసిన అధికారులు సాంకేతిక ఆధారాలను బట్టి విక్టర్ నిందితుడిగా గుర్తించారు. నగరం నుంచి వెళ్లిన ప్రత్యేక బృందం ఢిల్లీలో అతడిని అరెస్టు చేసింది. అక్కడి కోర్టులో హాజరుపరిచి పీటీ వారెంట్‌పై మంగళవారం సిటీకి తరలించింది. నిందితుడు విక్టర్‌కు వైద్య పరీక్షల నిమిత్తం పోలీసులు మంగళవారం ఉస్మానియా ఆస్పపత్రికి తరలించగా.. కోవిడ్ పరీక్షలు నిర్వహించిన వైద్యులు పాజిటివ్‌గా నిర్ధారించారు. దీంతో అతగాడిని తిరిగి సైబర్ క్రైమ్ ఠాణాకు తీసుకువచ్చారు. విక్టర్‌ను అరెస్టు చేసిన, సిటీకి తరలించిన, విచారించిన బృందంలోని సైబర్ క్రైమ్ అధికారులు క్వారంటైన్‌కు వెళ్లారు. మంగళవారం సాయంత్రం విక్టర్‌ను గాంధీ ఆసుపత్రిలోని ప్రిజనర్స్ వార్డుకు తరలించారు. అప్పటి వరకు సైబర్ క్రైమ్ ఠాణా రిసెప్షన్ ఏరియాలోనే ఉన్న ఇతగాడు అటు పోలీసులు... ఇటు మీడియాకు చుక్కలు చూపించాడు. ముట్టుకుంటానంటూ మీడియా ప్రతినిధులను పరుగులు పెట్టించాడు. -
డ్యాన్సర్‌కు రూ.11.75 లక్షల టోకరా
సాక్షి, హైదరాబాద్: నగరానికి చెందిన మహిళా డ్యాన్సర్‌కు మాట్రిమోనియల్ సైట్ ద్వారా పరిచమైన సైబర్ నేరగాడు పెళ్లి పేరుతో ఎర వేసి రూ.11.75 లక్షలు స్వాహా చేశాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు గురువారం కేసు నమోదు చేసుకున్న సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేపట్టా రు. బంజారాహిల్స్‌కు చెందిన సదరు డ్యాన్సర్ షాదీ.కామ్‌లో తన ప్రొఫైల్‌ను అప్లోడ్ చేశారు. దీన్ని చూసి ఆకర్షితుడయ్యానంటూ సైబర్ నేరగా డు ఎన్ఆర్ఐగా పరిచయం చేసుకున్నాడు. తాను ప్రస్తుతం లండన్‌లో ఉంటూ బీఎండబ్ల్యూ కార్ల కంపెనీలో సూపర్వైజర్గా పని చేస్తున్నానంటూ నమ్మబలికాడు. ఇలా వ్యక్తగత విషయాలు చర్చించుకున్న ఇద్దరూ వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో త్వరలోనే తాను భారత్‌కు వచ్చి స్థిరపడతానంటూ సైబర్ నేరగాడు నమ్మబలికాడు. ఓ రోజు హఠాత్తుగా ఆమెతో మన ప్రేమకు గుర్తుగా, నిన్ను ఆశ్చర్యపరిచేందుకు ఓ అద్భుతమైన బహుమతి పంపుతున్నానంటూ చెప్పాడు. బంగారు ఆభరణాలు, కొన్ని డాలర్లు, ల్యాప్‌టాప్ పార్శిల్ చేస్తున్నానని చెప్పిన అతగాడు వాటి ఫొటోలనూ వాట్సాప్‌లో షేర్ చేశాడు. ఇది జరిగిన రెండో రోజు ఢిల్లీ విమానాశ్రయం కస్టమ్స్ అధికారులుగా కొందరు డ్యాన్సర్‌కు ఫోన్ చేశారు. మీ పేరుతో పార్శీల్ వచ్చిందని చెప్పి క్లియర్ చేసేందుకు కొన్ని పన్నులు కట్టాలన్నారు. ఇలా వివిధ క్లియరెన్స్‌ల పేరుతో పలుదఫాలుగా రూ.11.75 లక్షలు వివిధ బ్యాంకు ఖాతాల్లో జమ చేయించుకున్నారు. ఎట్టకేలకు ఇదంతా మోసమని తెలుసుకున్న బాధితురాలు సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. మరోపక్క ఓ ఛానల్లో న్యూస్ యాంకర్‌గా పనిచేస్తున్న యువతి తనపై సోషల్‌మీడియాలో జరుగుతున్న అసభ్య ప్రచారంపై ఫిర్యాదు చేశారు. రెడ్డీస్ ల్యాబ్ పేరుతో ఫేక్ వెబ్సైట్ సైబర్ నేరగాళ్లు డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ సంస్థ మాదిరిగా ఓ వెబ్సైట్ సృష్టించారు. ఆ సంస్థ అధికారిక ఈ-మెయిల్లో ఒక అక్షరం మార్చి పొందుపరుస్తూ ఐడీ సృష్టించారు. వీటి ఆధారంగా ఓ బ్యాంకు ఖాతాను కూడా తెరిచారు. అలా అనేక మంది నిరుద్యోగులకు ఉద్యోగాలంటూ ఎర వేశారు. వారి నుంచి కొంత వసూలు చేసి నకిలీ నియామక పత్రాలు అందించారు. ఇటీవల కాలంలో 15 మంది యువకులు ఇలాంటి అపాయింట్మెంట్ ఆర్డర్లు పట్టుకుని ఆ సంస్థ కార్యాలయానికి వెళ్లారు. ఇలా విషయం తెలుసుకున్న డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ సెక్యూరిటీ అధికారి గురువారం సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. -
అందమైన యువతుల ఫొటోలతో ఎర, గొంతులు మార్చి..
సాక్షి, సిటీబ్యూరో: తెలుగు మ్యాట్రిమోని సైట్లలో అందమైన యువతుల ఫొటోలు నిక్షిప్తం చేసి విదేశీ వరులను నమ్మించి బంగారు ఆభరణాలు, చీరలు కొనాలంటూ లక్షల్లో డబ్బులు దండుకొని మోసం చేస్తున్న యువతిని రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. ఆమె నుంచి రూ.5,16,920 నగదుతో పాటు ఒక ల్యాప్‌టాప్, నాలుగు సెల్ఫోన్లు, ఏటీఎం కార్డులు స్వాధీనం చేసుకున్నారు. రాచకొండ సైబర్‌క్రైమ్ ఏసీపీ హరినాథ్ కథనం ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెల్లూరు జిల్లా ఇనమడుగుకు చెందిన కొర్రెమ్ స్వాతి అలియాస్ అర్చన, అలియాస్ జూటూరి వరప్రసాద్ అర్చన, అలియాస్ జూటూరి ఇందిరా ప్రియదర్శిని, అలియాస్ పుస్తయి ఎస్వీ యూనివర్సిటీలో ఎంబీఏ చదివింది. ఆ తర్వాత నెల్లూరులో ఓ కళాశాలలో లెక్చరర్‌గా పనిచేసే సమయంలో ఏర్పడిన పరిచయంతో రంగనాయకులపేటకు చెందిన కొరమ్ దుర్గా ప్రవీణ్‌ను వివాహం చేసుకుంది. వేతనాలు సరిపోకపోవడంతో ఆర్థిక సమస్యల కారణంగా మోసాలకు తెరలేపింది. గూగుల్ ఫొటోలు సేకరించి.. గూగుల్ వెబ్సైట్ల నుంచి సేకరించిన ఫొటోలతో పాటు విదేశీ వరుడు మాత్రమే కావాలంటూ తెలుగు మ్యాట్రిమోనీ సైట్లలో వివరాలు పొందుపరిచింది. రెండో లైన్ మొబైల్ అప్లికేషన్ల ద్వారా వచ్చిన వర్చువల్ నంబర్(విదేశీ)ను సంప్రదించాలంటూ పేర్కొంది. దీనికి స్పందించిన వరుడు, అతడి తల్లిదండ్రులతో ఆడ, మగ అన్ని స్వరాలతో సెల్ లో నిక్షిప్తం చేసిన అడ్కామ్ వాయిస్ మాడులేషన్ సాఫ్ట్వేర్ ద్వారా మాట్లాడేది. వారు నమ్మారని అనుకున్నాక స్వాతి వారి పెళ్లి ప్రతిపాదనలకు ఓకే చెప్పేది. ఆ తర్వాత వారితో కొన్నిరోజులు చాటింగ్ చేశాకా అమెరికా నుంచి మరికొన్ని రోజుల్లో వస్తానంటూ చెప్పడంతో రాగానే కలుస్తామంటూ వరుడు, వారి తల్లిదండ్రులు ఆసక్తి చూపేవారు. బంగారు ఆభరణాలు.. చీరలు కావాలంటూ.. భారత్‌కు వస్తున్నానని చెప్పిన ఆమె పెళ్లి కోసం బంగారు ఆభరణాలు, చీరలు కావాలంటూ తియ్యటి మాటలతో వరుడు, అతడి తల్లిదండ్రులతో చెప్పేది. పెళ్లయ్యాక మీ ఇంటికే కదా వచ్చేది.. ఒకవేళ డబ్బులు ఎక్కువైతే తిరిగి మీకే ఇచ్చేస్తామంటూ లక్షల్లో డబ్బులు బురిడీ కొట్టించేది. ఆ తర్వాత నుంచి వారికి స్పందించడం మానేసేది. ఇలా హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండలో ఐదుకుపైగా కేసుల్లో ఆమె అరెస్టయ్యింది. తాజాగా రాచకొండలో మరో వరుడికి దాదాపు రూ.1.10 లక్షలు మోసం చేసింది. కేసు నమోదు చేసిన రాచకొండ సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ ఆర్.వెంకటేష్ సాంకేతిక సాక్ష్యాలతో నిందితురాలు స్వాతిగా గుర్తించి శుక్రవారం అరెస్టు చేశారు. చదవండి: భర్తపై కోపంతో పిల్లలకు వాతలు అమానుషం.. ఫ్రెండ్ తల్లిపైనే అఘాయిత్యం -
వేరు చెయ్యకు పేరయ్యా
లవ్ ఈజ్ బ్లైండ్. నలుపూ తెలుపు చూసుకోదు ప్రేమ. పెళ్లిళ్ల సైట్లే.. నాట్ కైండ్! అన్నీ చూస్తాయి.అడుగులు.. అంగుళాలు..ఆస్తులు.. అంతస్థులు..చేస్తున్న ఉద్యోగం.. వస్తున్న జీతం..రంగు కూడా! ‘కూడా’ ఏంటి! రంగే మెయిన్.ఇద్దరమ్మాయిలకు ఇది నచ్చలేదు.రంగుతో వేరు చెయ్యొదన్నారు.రంగు ‘ఫిల్టర్’ను తీయించేశారు. అబ్బాయికి అమ్మాయిని వెదకాలి. అమ్మాయికి అబ్బాయిని చూడాలి. వెదకడానికి, చూడ్డానికి తేడా ఉంది. ‘వెదకడం’ అంటే అబ్బాయికి అమ్మాయి దొరకడం లేదని! ‘చూడడం’ అంటే అబ్బాయిలు కాళ్లకు చేతులకు అడ్డం పడుతున్నారని! మరీ మునుపటిలా లేవు రోజులు. కొద్దిగా తారుమారయ్యాయి. వధువులు దొరకడం కష్టమైపోయింది. ఇంత కష్టమైపోయినా కూడా అబ్బాయిలు ఒక విషయంలో మాత్రం ‘ఎస్’ అందామా, ‘నో’ అందామా అని ఆలోచిస్తూనే ఉన్నారు. ఆ ఆలోచన.. అమ్మాయి ఒంటి రంగు గురించి! వధువు తెల్లగా ఉండాలి. పెళ్లిచూపుల్లో అయినా అదే చూపు, ఆన్లైన్ పరిచయ వేదికల్లో అయినా అదే చూపు. మగవాళ్లలో రంగును చూసే అమ్మాయిలు ఉంటే ఉండొచ్చు. అది రెండో చాయిస్‌గానే ఉంటుంది. ఫస్ట్ చాయిస్ మాత్రం ‘అబ్బాయి మంచివాడైతే చాలు’ అనే. పైకి ఎన్నిచెప్పినా పెళ్లి దగ్గరకు వచ్చేటప్పటికి పెద్దవాళ్లందరి ‘ఔట్లుక్’ ఒకేలా ఉంటుంది. పిల్లల ‘ఫస్ట్ లుక్’ వేరుగా ఉంటుంది. పిల్లల్ని అలా వదిలేద్దాం. వాళ్లు చూసేది ఎలాగూ రంగును కాదు, వాళ్లు చేసుకునేదీ రంగును కాదు. పెద్దవాళ్లయితే మాత్రం కచ్చితంగా ఈడూజోడూ చూస్తారు. పిల్లకన్నా పిల్లవాడు రెండంగుళాలైనా ఎత్తుండేలా చూసుకుంటారు. ఎత్తు చూసే ముందే.. ఉద్యోగంలో ఎంత ఎత్తుకు ఎదగగలడో చూసుకుని ఉంటారు. ఆస్తులు ఉంటే మంచిదే. తోబుట్టువులు పెద్దగా లేకుంటే మరీ మంచిది. ఇన్ని ఉంటాయి. అన్నీ కుదిరితే అప్పుడు అబ్బాయి రంగును కూడా కుదురుతుందేమోనని చూస్తారు. అబ్బాయి వైపు వాళ్లయితే ముందుగా పిల్ల రంగును చూసుకుంటారు. తర్వాతే మిగతావన్నీ. అందుకే మ్యాట్రిమోనియల్ సైట్స్‌లో కూడా ‘ఒంటి ఛాయ’ కాలమ్ మస్ట్‌గా కనిపిస్తుంటుంది. పెళ్లి సైట్లకు ఫొటో, వివరాలు ఇచ్చేవారు.. ఫొటోలో ఎలా ఉన్నా, రంగును మాత్రం ఉన్నది ఉన్నట్లుగా చెప్పేయాలి. తెలుపు అనీ, నలుపు అని, మరీ నలుపు కాదనీ, నలుపు కంటే కాస్త తక్కువని, చామన చాయ కంటే పిసరంత ఎక్కువనీ.. డీటెయిల్డ్‌గా ఇవ్వాలి. ‘షాదీ డాట్ కామ్’ ఇండియాలో పేరున్న పెద్ద పెళ్లిళ్ల పేరయ్య. ఆ సైట్లో రంగుకు ఏకంగా ఒక స్కిన్ కలర్ ఫిల్టరే ఉంటుంది. ఫెయిర్, వీటిష్, డార్క్. ముట్టుకుంటే కందిపోవడం ఫెయిర్. గోధుమ రంగులో ఉండటం వీటిష్. డార్క్ అంటే నలుపు. ఇప్పుడు ఈ ఫిల్టర్‌ని షాదీ డాట్ కామ్ తొలగించబోతోంది! పెద్ద విషయమే అనుకోవాలి. హీతల్, మేఘన్ అనే ఇద్దరు అమ్మాయిలు రంగును పెద్ద విషయం చెయ్యబట్టే షాదీ డాట్ కామ్ చిన్న విషయంగా కొట్టివేయలేకపోయింది. హీతల్ సంతకాల ఉద్యమం స్క్రీన్‌షాట్ పెళ్లీడుకొచ్చిన పిల్లల ‘లవ్ ఎట్ ఫస్ట్ సైట్’లో ఏ రంగూ లేని ప్రేమ మాత్రమే కనిపిస్తుంది. ఇదే పిల్లలు పెళ్లిళ్ల సైట్‌కి వెళ్తే మాత్రం మొదట క్లిక్ కొట్టేది రంగునే. ఆ కేటగిరీలోకి వెళ్లి ఇక ఆ దారంటా అన్వేషణ మొదలు పెడతారు. మానవ స్వభావం. సైట్ల వాళ్లను కూడా తప్పు పట్టేందుకు లేదు. కస్టమర్‌కి కావలసింది ఇవ్వలేకపోతే కొన్నాళ్లకు సైటే లేకుండా పోతుంది. అయితే మేఘన్ నాగ్‌పాల్ అనే యువతి దీన్నొక తప్పు పట్టకూడని విషయంగా తీసుకోలేకపోయారు. షాదీ డాట్ కామ్ ఎగ్జిక్యూటివ్ దృష్టికి తీసుకెళ్లి సైట్‌లోని ఆ కలర్ ఫిల్టర్లను తొలగించమని కోరారు. ‘‘కానీ మేడమ్.. చాలామంది పేరెంట్స్ ముఖ్యంగా రంగు గురించే మమ్మల్ని అడుగుతుంటారు’’ అని సమాధానం వచ్చింది. ఈ విషయాన్ని ఫేస్బుక్లో చర్చకు పెట్టారు మేఘన్. నిజమే ఈ ‘వర్ణవివక్ష’ ఏమిటి అన్నట్లు అంతా ఆమెను సపోర్ట్ చేశారు. యు.ఎస్.లో ఉంటున్న హేతల్ లఖానీ అనే యువతి మాత్రం ఆ సపోర్ట్‌ని ఇంకొంచెం పై స్థాయికి తీసుకెళ్లారు. ఆన్లైన్లో పిటిషన్ తయారు చేసి సంతకాలు సేకరించారు. ‘ఛేంజ్ డాట్ ఒఆర్జి’లో ఆమె ఆ పిటిషన్ పెట్టిన పద్నాలుగు గంటల్లోనే 1500 మంది ఫర్గా సంతకాలు చేశారు! దానిని షాదీ డాట్ కామ్‌కి ఫార్వర్డ్ చేశారు. వారి అభిప్రాయాలను గౌరవిస్తూ తన సైట్‌లోని స్కిన్ కలర్ ఫిల్టర్‌ను తొలగించబోతోంది ఆ పెళ్లిచూపుల సంస్థ. ‘బ్లాక్ లైవ్స్ మ్యాటర్’ (నల్లవారి ప్రాణాలూ ముఖ్యమే) ఉద్యమం విస్తృతం అవుతుండటంతో.. రంగుకు ప్రాధాన్యతనిచ్చే ధోరణులు అన్ని రంగాలలోనూ మెల్లిగా తగ్గుముఖం పడుతున్నాయి. ప్రసిద్ధ యు.ఎస్. కంపెనీ జాన్సన్ అండ్ జాన్సన్ ఇటీవలే.. చర్మాన్ని తెల్లబరిచే సౌందర్యసాధనాల విక్రయాన్ని ఇండియాలో నిలిపివేయబోతున్నట్లు ప్రకటì ంచింది. తర్వాత షాదీ డాట్ కామ్. ఇప్పుడిక తాజాగా మన దేశవాళీ హిందుస్థాన్ లీవర్ సంస్థ కూడా తమ ‘ఫెయిర్ అండ్ లవ్లీ’ బ్రాండ్ నేమ్ నుంచి ‘ఫెయిర్’ అనే మాటను తొలగిస్తున్నట్లు గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఫెయిర్, వైట్, లైట్ అనే మాటల్ని అందానికి ఏకపద ఆదర్శ నిర్వచనాలుగా వాడటం సరికాదని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ తెలిపింది. క్రమంగా మరికొన్ని. మరికొన్ని. మరికొన్ని. ప్రశ్నించడం వల్లనే సాధ్యమౌతున్నవీ, సాధించుకుంటున్నవీ.. ఈ మార్పులన్నీ. నాలో ఉండేవి ఉంటాయి. లేనివీ ఉంటాయి. ఉన్నవీ, లేనివీ నా రంగు చాటున ఉండిపోవడం ఏమిటి? తెలుపు రంగు నా లోపాలను కప్పిపుచ్చే పనైతే అంతకన్నా అసహ్యం ఇంకోటి ఉంటుందా? – హీతల్ లఖానీ, డాలస్, యూఎస్ బాలీవుడ్ తారలు ‘బ్లాక్ లైవ్స్ మ్యాటర్’ ఉద్యమానికి మద్దతు ఇస్తూనే ఫెయిర్‌నెస్ క్రీములకు ప్రచారం ఇస్తున్నారు. దీని వల్ల ఉపయోగం ఏమిటి? తెలుపు ఘనమైనది అనే భావన ఎలా పోతుంది? ఎప్పటికి పోతుంది?– మేఘన్ నాగ్‌పాల్ -
బెయిల్ కోసం నకిలీ డాక్యుమెంట్లు..
సాక్షి, సిటీబ్యూరో: మ్యాట్రిమోనీ మోసం కేసులో అరెస్టయి చంచల్‌గూడ జైలులో ఉన్న నిందితుడిని బెయిల్‌పై విడుదల చేసేందుకు ష్యూరిటీ సంతకం చేసి నకిలీ డాక్యుమెంట్లను సమర్పించిన మహిళా నైజీరియన్‌ను సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. మ్యాట్రిమోని వెబ్సైట్ ద్వారా డాక్టర్‌ను పరిచయం చేసుకొని పెళ్లి చేసుకుంటానని నమ్మించి లక్షలు కొట్టేసిన కేసులో ఈ ఏడాది మార్చి నెలలో నైజీరియన్ గిడ్డి ఇసాక్ ఓలూతో పాటు మరో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. అయితే జైలులో ఇతడికి బెయిల్ ఇచ్చేందుకు సమ్మతించిన న్యాయస్థానం ఇద్దరు ష్యూరిటీ సంతకాలు చేయాలని ఆదేశించింది. దీంతో ఒబినా బాతోలోమివూ గొడ్విన్, రొస్‌లైన్ అన్నా ఎక్యూరేలు సైబరాబాద్ సైబర్ క్రైమ్ ఠాణాకు వెళ్లి పాస్‌పోర్టు కాపీలు, రెంటల్ అగ్రిమెంట్ తదితరాలు సమర్పించారు. అయితే వీరిలో ఒకరైన న్యూఢిల్లీలో ఉంటున్న రొస్‌లైన్ అన్నా ఎక్యూరే 2016 ఫిబ్రవరి 10న మెడికల్ వీసాపై భారత్‌కు వచ్చానని పోలీసులకు సమర్పించిన పత్రాల్లో పేర్కొంది. వీటిని పోలీసులు నిశితంగా పరిశీలిస్తే అనుమానం వచ్చి సంబంధిత అదికారులకు పంపిస్తే వీసా ఫోర్జరీది అని తేల్చి చెప్పారు. దీంతో ఇటు పోలీసులు, అటు కోర్టును మోసం చేసి తమ వ్యక్తిని బెయిల్‌పై విడుదల చేసేందుకు యత్నించిన రొస్‌లైన్ అన్నా ఎక్యూరేను అరెస్టు చేశారు. -
ఈమె.. ఆమేనా..?
సాక్షి, హైదరాబాద్: మ్యాట్రిమోని వెబ్సైట్లో పరిచయమైన ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్‌ను పెళ్ళిచేసుకుంటానని నమ్మించిన ఓ యువతి అతని నుంచి కోటి రూపాయలకు పైగా వసూలు చేసి బురిడీ కొట్టించింది. దీంతో బాధితుడు కేపీహెచ్‌బీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సీఐ లక్ష్మీనారాయణ తెలిపిన మేరకు.. అనుపల్లవి మాగంటి పేరుతో వరుడు కావాలంటూ ఓ యువతి తెలుగు మ్యాట్రిమోని వెబ్సైట్లో పేరు నమోదు చేసుకుంది. అమెరికాలోని మేరీల్యాండ్ బల్టీమోర్ ప్రాంతంలో జన్మించినట్లుగా వివరాలను పొందుపర్చింది. తాను డాక్టర్ అని, తన తల్లిదండ్రులు కూడా డాక్టర్లేనని, తన నివాసం జూబ్లీహిల్స్ రోడ్డునెంబర్–71లో ఉందని పేర్కొంది. ఆ వివరాలను చూసిన ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆమెతో పలుమార్లు చాటింగ్ చేశాడు.(ఫేక్ ప్రొఫైల్‌తో ఎన్నారైకి వల) ఈ సందర్భంగా ఆమె.. తన తండ్రి చనిపోయారని, ఆస్తులను తన పేరిట రాశారని చెప్పుకొచ్చింది. తన పెళ్లి విషయంలో వివాదం నెలకొందని, డబ్బున్న బిజినెస్‌మేన్ కొడుకును వివాహం చేసుకోవాలని ఒత్తిళ్లు ఉన్నాయని నమ్మబలికింది. తనకు మాత్రం సాఫ్ట్వేర్ ఇంజనీర్‌ను పెళ్లి చేసుకోవాలని ఉందని పేర్కొంది. అయితే తన పేరిట ఉన్న ఆస్తులను న్యాయపరంగా దక్కించుకునేందుకు కొంత డబ్బు అవసరముందని, ఇందుకు సహాయం చేయాలని కోరింది. మాయ మాటలు నమ్మిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ పలుమార్లు కోటి రెండు లక్షలా 18 వేల 33 రూపాయలను ఆన్లైన్ బ్యాంకింగ్ ద్వారా యువతి సూచించిన అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేశాడు. అనంతరం ఆమె మొహం చాటేయడంతో తాను ఆన్లైన్లో చాటింగ్ చేసిన యువతి మాళవిక దేవతిగా గుర్తించడంతో పాటు తాను మోసపోయినట్లుగా భావించి కేపీహెచ్‌బీ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. () ఈమె.. ఆమేనా.. మాళవిక దేవతి పేరుతో గతంలోనూ సాఫ్ట్వేర్ ఇంజనీర్‌ను బురిడీ కొట్టించిన కేసు జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో నమోదైంది. ఓ ఎన్ఆర్ఐతో రూ.65 లక్షలు వసూలు చేసి మోసం చేసింది. విషయం తెలుసుకున్న పోలీసులు రెండు కేసుల్లోనూ నిందితురాలు ఒక్కరేనా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. -
ఫేక్ ప్రొఫైల్‌తో ఎన్నారైకి వల
సాక్షి, హైదరాబాద్ : ఫేక్ ప్రొఫైల్ క్రియేట్ చేసి ఎన్నారైకు వల వేసి మోసం చేసిన మహిళను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు.. హైదరాబాద్‌కు చెందిన మాళవిక అనే మహిళ ఫేక్ ప్రొఫైల్‌ను క్రియేట్ చేసి భారత్ మాట్రిమోనిలో షేర్ చేసి ఎన్నారైలను మోసం చేయడం టార్గెట్‌గా పెట్టుకుంది. దీనికి మాళవిక కుమారుడు ప్రణవ్ సహాయం చేస్తుండేవాడు. తాజాగా మాళవిక కాలిఫోర్నియాకు చెందిన వరుణ్ అనే ఎన్నారైకి వల వేసి దాదాపు రూ. 65 లక్షలు వసూలు చేసింది. (ప్రియుడితో పారిపోయిందని చితకబాదారు) తాను ఒక డాక్టర్‌నంటూ.. తనకు చాలా ఆస్తులు ఉన్నాయని పేర్కొంది. మా నాన్న చనిపోయాడని.. ఆస్తులన్నీ తన పేరు మీద రాయాలని తన తల్లి హింసిస్తున్నట్లు తెలిపింది. ఆస్తులను కాపాడుకోవడానికి తన తల్లిపై లీగల్‌గా ఫైట్ చేయడానికి తనకు సహాయం చేయాలని కోరింది. పరిస్థితి చక్కబడిన తర్వాత తప్పకుండా పెళ్లి చేసుకుంటానని.. అప్పుడు తన ఆస్తులన్నింటికి యాజమాని అవుతావంటూ మాయ మాటలు చెప్పింది. మాళవిక చెప్పినవన్నీ నిజమేనని నమ్మిన వరుణ్ ఆమె అకౌంట్లోకి రూ. 65 లక్షలు ట్రాన్స్ఫర్ చేశాడు. అనంతరం పెళ్లి విషయమై మాళవిక నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేకపోవడంతో తాను మోసపోయానని గ్రహించిన వరుణ్ జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు మాళవికతో పాటు ఆమె కొడుకు ప్రణవ్ను అరెస్టు చేశారు. కాగా గతంలోనూ మాళవిక తన భర్త, అత్తతో కలిసి ఇదే విధంగా ఓ ఎన్నారైను మోసం చేసినందుకు కేసు నమోదైనట్లు పోలీసులు వెల్లడించారు. (ప్రాణత్యాగం చేస్తే కరోనా పోతుందని..) -
విడాకులు తీసుకున్న మహిళలనే లక్ష్యంగా..
సాక్షి, సిటీబ్యూరో: మాట్రిమోనీ వెబ్సైట్లో పునర్వివాహం కోసం వివరాలు నమోదు చేసుకున్న మహిళలే లక్ష్యంగా ఖరీదైన బహుమతులు పంపిస్తానంటూ కస్టమ్స్ రూపంలో లక్షల్లో డబ్బులు కాజేస్తున్న నలుగురు సభ్యులతో కూడిన ముఠాను సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. ఢిల్లీలో ఉంటున్న నైజీరియన్ గిడ్డీ ఇసాక్ ఉలూతో పాటు నేపాలీలు సాగర్ శర్మ, సుదీప్ గిరి, బికాస్ బల్మీకిల నుంచి 18 సెల్ఫోన్లు, తొమ్మిది గుర్తింపు కార్డులు, పాస్‌పోర్టు, 25 సిమ్‌కార్డులు, ల్యాప్‌టాప్, 67 చెక్కుబుక్కులు, 15 డెబిట్‌కార్డులు స్వాధీనం చేసుకున్నారు. వీరి బ్యాంక్ ఖాతాల్లోని రూ.3,05,076 నగదు ఫ్రీజ్ చేశారు. కేసు వివరాలను క్రైమ్స్ డీసీపీ రోహిణి ప్రియదర్శిని, అడిషనల్ డీసీపీ కవిత, సైబర్‌క్రైమ్ ఏసీపీ శ్రీనివాస్‌లతో కలిసి సీపీ వీసీ సజ్జనార్ బుధవారం మీడియా ప్రతినిధులకు వెల్లడించారు. ఖరీదైన గిఫ్ట్‌ల పేరుతో.. నైజీరియాకు చెందిన ప్రధాన నిందితుడు ఎసెలూ ఉడో (పరారీలో ఉన్నాడు), గిడ్డి ఇసాక్ ఉలూలు సైబర్ నేరాలు చేయడంలో దిట్ట. 2018లో బిజినెస్ వీసాపై దిల్లీకి వచ్చిన గిడ్డి, ఎసెలూ ఉడోలు ఆన్లైన్ వేదికగా మ్యాట్రిమోనీ గిఫ్ట్ మోసాలు, బిజినెస్ మోసాలు, జాబ్ మోసాలు చేస్తున్నారు. గిడ్డీ ఆయిల్, సీడ్స్ వ్యాపారం పేరుతో బెంగళూరుకు చెందిన ఇద్దరు వ్యక్తుల నుంచి లక్షల్లో డబ్బులు లాగాడు. దిల్లీలో ఉంటున్న నైజీరియన్లకు అక్కడే మూన్‌షైన్ హోటల్లో పనిచేస్తున్న సాగర్ శర్మ, సుదీప్గిరి, బికాస్ బల్మీకిలకు పరిచయం ఏర్పడింది. బ్యాంక్ ఖాతాలు ఓపెన్ చేసి ఇస్తే ఆయా ఖాతాల్లో డిపాజిటయ్యే డబ్బుల్లో కొంతమేర కమీషన్ ఇస్తామంటూ ఈ ముగ్గురికి ఎర చూపారు. దీంతో వారు వివిధ పేర్లన్న వ్యక్తుల ఆధార్, పాన్‌కార్డులు ఉపయోగించి పదుల సంఖ్యలో ఖాతాలు ఓపెన్ చేశారు. ఇలా అంతా సిద్ధమయ్యాక నైజీరియన్లు విడాకులు తీసుకున్న మహిళలు మళ్లీ వివాహం చేసుకునేందుకు మ్యాట్రిమోనీ వెబ్సైట్లో వివరాలు నమోదు చేసుకున్న వారినే లక్ష్యంగా చేసుకున్నారు. ఇందుకోసం యూకేలో ఆర్థోపెడిక్ వైద్యుడిగా పనిచేస్తున్ననంటూ డాక్టర్ విపుల్ ప్రకాశ్ పేరుతో నకిలీ ప్రొఫైల్ సృష్టించారు. గూగుల్ నుంచి సేకరించిన కొందరి ఫొటోలు ప్రొఫైల్‌లో షేర్ చేశారు. ఈ ప్రొఫైల్ చూసిన నల్లగండ్లలో ఉంటున్న ముంబై వాసి మహిళా వైద్యురాలు ఆసక్తి చూపడంతో వాట్సాప్ చాటింగ్ చేయడం మొదలెట్టారు. కొన్నిరోజులకే మిమ్మల్ని వివాహం చేసుకుంటానని, భారత్‌కు త్వరలోనే వస్తానని, ఇప్పటికే భారీగా డబ్బులు సంపాదించానని అక్కడే సెటిల్ అవుతానంటూ నమ్మించారు. కొన్నిరోజులకే బంగారు ఆభరణాలు, యాపిల్ ఫోన్, రిస్ట్ వాచ్, డాలర్లు తదితర ఖరీదైన బహుమతులను కొరియర్ ద్వారా పంపించానంటూ బాధితురాలికి చెప్పారు. కొన్ని గంటలకే ఢిల్లీ కస్టమ్స్ డిపార్ట్మెంట్ నుంచి మాట్లాడుతున్నానంటూ డాక్టర్ విపుల్ ప్రకాష్ పంపిన గిఫ్ట్ బాక్స్ పంపించాలంటే కస్టమ్స్ క్లియరెన్స్, జీఎస్టీ తదితరాలు చెల్లించాలని ఫోన్‌కాల్ చేశారు. ఇది నిజమని నమ్మిన బాధితురాలు వారు పంపిన బ్యాంక్ ఖాతాల్లో రూ.7,45,000 డిపాజిట్ చేసింది. ఆ తర్వాత ఇది మోసమని సైబరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిబ్రవరి గత 4న ఫిర్యాదు చేసింది. ఈ కేసు విచారణలో ఉండగానే మళ్లీ బాధితురాలికి ఫిబ్రవరి 15న ఓ వ్యక్తి గిఫ్ట్‌బాక్స్/లాకర్ (నంబర్ లాక్, పాస్వర్డ్ కలిగిన) కొరియర్ వచ్చిందంటూ గిడ్డీ తీసుకొచ్చి ఇచ్చాడు. ఈ లాకర్లో భారీగా విదేశీ కరెన్సీ, బంగారు ఆభరణాలు ఉన్నాయని ఇంగ్లిష్‌లో మాట్లాడాడు. ఆ వెంటనే డాక్టర్ విపుల్ ప్రకాశ్‌గా ఫోన్‌కాల్ రాగానే నిజమని నమ్మింది. మళ్లీ మోసగాళ్లు ఇచ్చిన బ్యాంక్ ఖాతాల్లో రూ.ఐదు లక్షలు డిపాజిట్ చేసింది. చివరకు మళ్లీ ఇది మోసమని ఫిబ్రవరి 26న మళ్లీ ఫిర్యాదు చేసింది. టెక్నికల్ డాటాతో.. ఆయా బ్యాంక్ ఖాతాల చిరునామాలతో పాటు అవి డబ్బులు డ్రా అయిన ఏటీఎం కేంద్రాల్లో ఉన్న సీసీటీవీ కెమెరాల్లో చిక్కిన దృశ్యాల ఆధారంగా మొదటగా ముగ్గురు నేపాలీలను పట్టుకున్నారు. వారితోనే నైజీరియన్ గిడ్డీ ఇసాక్ ఓలూను పట్టుకున్నారు. ప్రధాన నిందితుడు ఎసెలూ ఉడో మాత్రం అక్కడా అందుబాటులో లేకుండా పోయాడు. అతడ్ని పట్టుకునేందుకు పోలీసు బృందాలు అక్కడే ఉన్నాయని సీపీ సజ్జనార్ తెలిపారు. ఢిల్లీలో అరెస్టు చేసిన ఈ నలుగురు నిందితులను ట్రాన్సిట్ వారంట్‌పై నగరానికి తీసుకొచ్చి కోర్టులో హజరుపరిచి జైలుకు తరలించామన్నారు. అయితే కస్టమ్స్ క్లియరెన్స్ ఫీ, ఆర్బీఐ క్లియరెన్స్ ఫీ, జీఎస్టీ, సర్వీసు ట్యాక్స్, కొరియర్ చార్జీలు, లాకర్ కోడ్ ఫీ, బ్లాక్ కరెన్సీ క్లీన్ పౌడర్ల పేర్లతో ఫోన్‌కాల్స్ చేస్తే నమ్మవద్దని సీపీ సజ్జనార్ సూచించారు. -
పెళ్లి పేరుతో ప్రభుత్వ ఉద్యోగినికి టోకరా
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో మరో మాట్రిమోనియల్ మోసం వెలుగులోకి వచ్చింది. ఓ సైట్లో రిజిస్టర్ చేసుకున్న ప్రభుత్వ ఉద్యోగినిని పరిచయం చేసుకున్న సైబర్ నేరగాడు స్కాట్‌ల్యాండ్‌లో బిల్డర్‌గా బిల్డప్ ఇచ్చాడు. ఆమెను పెళ్లి చేసుకుంటానని నమ్మించి రూ.2 లక్షలు కాజేశాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సికింద్రాబాద్‌కు చెందిన ఓ ప్రభుత్వ ఉద్యోగిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో తగిన సంబంధం కోసం భారత్‌మాట్రిమోనీ సైట్లో రిజిస్టర్ చేసుకుని తన ప్రొఫైల్ అప్లోడ్ చేశాడు. దీనికి స్పందనగా లోకేష్జోషి అని చెప్పుకున్న వ్యక్తి నుంచి ఆమెకు మెసేజ్ వచ్చింది. తాను స్కాట్‌ల్యాండ్‌లో బిల్డర్‌గా పనిచేస్తున్నానని, మీ ప్రొఫైల్ నచ్చిందని ఆసక్తి చూపాడు. ఒకరి నంబర్లు మరొకరు మార్చుకున్న తర్వాత చాటింగ్ చేయడంతో పాటు ఆమెతో ఫోన్లోనూ మాట్లాడిన అతను వివాహం చేసుకుంటానంటూ ప్రతిపాదించాడు. వారం రోజుల పాటు నమ్మకంగా ఉన్న లోకేష్ జోషి ఆపై అసలు కథ ప్రారంభించాడు. దుబాయ్‌లోనూ తాను కొన్ని భవనాలు నిర్మిస్తున్నానని చెప్పి, ఆ సైట్లో పని చేసే ఓ కార్మికుడు తీవ్రంగా గాయడినట్లు చెప్పాడు. ఈ ఘటనలో అతను డబ్బులు కూడా పోగొట్టుకున్నాడని చెబుతూ భారత్‌లో ఉంటున్న అతడి కుటుంబీకులకు అత్యవసరంగా కొంత మొత్తం పంపాల్సి ఉందని చెప్పాడు. తన వద్ద డబ్బు ఉన్నప్పటికీ స్కాట్‌ల్యాండ్ నుంచి పంపడం ఆలస్యం అవుతుందని చెప్పిన మోసగాడు రూ. 37 వేలు వారికి చేర్చాలని కోరాడు. సదరు కార్మికుడి భార్య కూడా అనారోగ్యంతో ఆస్పత్రి పాలైనందున, డబ్బులను నేరుగా వైద్యుడి ఖాతాకు పంపాలని కోరాడు. ఇందుకు ఆమె అంగీకరించడంతో ఓ బ్యాంకు ఖాతా నంబర్ పంపి అందులో డిపాజిట్ చేయించాడు. అప్పటి నుంచి మొదలుపెట్టి తన దుబాయ్ సైట్లో యంత్రాలు మరమ్మతులు గురయ్యాయని వాటిని రిపేర్ చేయించేందుకు రూ.3.5 లక్షలు రావాలని మరోసారి కోరాడు. అయితే తన వద్ద అంత మొత్తం లేదని చెప్పిన ఆమె రూ.60 వేలు బ్యాంకు ఖాతాలో డిపాజిట్ చేసింది. ఈ నెల 4న తాను దుబాయ్ మీదుగా ముంబైకి వస్తున్నట్లు చెప్పిన అతను కేవలం నీ కోసమే ఈ ప్రయాణమంటూ చెబుతూ ఇండియాకు వచ్చాక నీకు ఓ బహుమతి ఇస్తానంటూ నమ్మబలికాడు. అంతటితో ఆగకుండా దుబాయ్ నుంచి ముంబైకి బుక్ చేసినట్లు సృష్టించిన ఓ విమాన టిక్కెట్టునూ వాట్సాప్ చేశాడు. ఆ మర్నాడే ముంబై విమానాశ్రయం నుంచి అంటూ ఆమెకు ఓ ఫోన్ కాల్ వచ్చింది. కస్టమ్స్ అధికారులుగా చెప్పుకున్న అవతలి వ్యక్తులు జోషి అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నామని, అతడి వద్ద భారీ మొత్తం లండన్ పౌండ్స్ రూపంలో ఉన్నట్లు చెప్పారు. అలా నగదు రూపంలో తీసుకురావడం నేరమని చెప్పారు. అతికష్టమ్మీద అతడితో మాట్లాడే అవకాశం ఇస్తున్నట్లు చెప్పారు. ఆపై అదే ఫోన్ కాల్లో మాట్లాడిన జోషి తన వద్ద ఉన్న భారీ మొత్తాన్ని నీ కోసం తీసుకువస్తున్నానని, భారత్ కరెన్సీలో రూ.కోట్లలో ఉండే ఆ పౌండ్స్‌ను విడిచిపెట్టాలంటే కస్టమ్స్ అధికారులు రూ.9.5 లక్షలు డిమాండ్ చేస్తున్నట్లు చెప్పాడు. ఇది నమ్మిన ఆమె అతడు సూచించిన ఖాతాకు రూ.లక్ష బదిలీ చేసింది. అంతటితో ఆగని అతగాడు మిగిలిన రూ.8.5 లక్షలనూ పంపాలని కోరాడు. దీంతో అనుమానం వచ్చిన ఆమె మంగళవారం సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న అధికారులు దుండగులు వాడిన ఫోన్ నంబర్లతో పాటు బ్యాంకు ఖాతాల వివరాలను బట్టి దర్యాప్తు చేస్తున్నారు. -
మ్యాట్రిమోని సైట్లో బురిడి కొట్టించిన మహిళ అరెస్ట్
సాక్షి, హైదరాబాద్ : మ్యాట్రిమోని సైట్ల ద్వారా పెళ్లి సంబంధాలు చూసేవారు కాస్తా ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఉంది. మ్యాట్రిమోని సైట్ల పేరిట మోసాలకు పాల్పడుతున్న ఘటనలు ఇటీవలి కాలంలో అధికమవుతున్నాయి. తాజాగా నగరంలో ఇలాంటి సంఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది. పెళ్లి సంబంధాల కోసం మ్యాట్రిమోని సైట్లను ఆశ్రయించే వారిని అదనుగా చూసుకుని మోసాలకు పాల్పడుతున్న మహిళను రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. అమెరికాలో ఉంటున్న సింహాద్రి పవన్ కుమార్ తనకు తగిన వధువు కావాలని భారత్ మ్యాట్రిమోని సైట్లో అతని వివరాలు పెట్టారు. ఇదే అవకాశంగా భావించిన కొరం అర్చన అనే మహిళ తప్పుడు ప్రొఫైల్‌తో అతన్ని బురిడి కొట్టించారు. పవన్ నుంచి 4 లక్షల రుపాయలు వసూలు చేశారు. తర్వాత సదురు మహిళ చేతిలో తాను మోసపోయానని గ్రహించిన భాదితుడు వెంటనే పోలీసులను ఆశ్రయించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు ఐపీసీ 417, 418, 420 సెక్షన్ 66 ఆఫ్ ఐటీ యాక్ట్ కింద కేసులు నమోదు చేసి మహిళను అదుపులోకి తీసుకున్నారు. -
పెళ్లి పేరుతో మోసగాడి ఆటకట్టు
సాక్షి, వనపర్తి : విలాసాలకు అలవాటుపడిన ఓ వ్యక్తి.. తన భార్యకు విడాకులిచ్చానంటూ మ్యాట్రిమోని వెబ్సైట్లో ఫొటో అప్లోడ్ చేసి విడాకులు తీసుకున్న అమ్మాయిలను టార్గెట్ చేసుకొని మోసం చేయడానికి పూనుకున్నాడు. గత 8 నెలల క్రితం వనపర్తికి చెందిన ఓ అమ్మాయిని మ్యాట్రిమోనిలో పరిచయం చేసుకొని మోసం చేస్తున్న చంద్రశేఖర్‌ను వనపర్తి పోలీసులు పట్టుకున్నారు. కేసుకు సంబంధించిన వివరాలను సోమవారం సాయంత్రం సీఐ సూర్యనాయక్ విలేకరులకు వెల్లడించారు. పెద్దపల్లి జిల్లా రామగూడెం పాతకాలనీకి చెందిన చంద్రశేఖర్ అలియాస్ చందుకు 2007లో వివాహం జరిగింది. అతడికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే పేకాట.. ఇతర జల్సాలకు అలవాటుపడిన అతను భార్యను పుట్టింటికి పంపాడు. తన భార్యకు విడాకులు ఇచ్చానని.. మ్యాట్రిమోని వెబ్సైట్లో ప్రొఫైల్ క్రియేట్ చేశాడు. వనపర్తికి చెందిన ఓ మహిళ తన భర్తకు విడాకులిచ్చింది. తను కూడా మ్యాట్రిమోనిలో అప్లోడ్ చేసింది. వెబ్సైట్ ద్వారా ఆమెను పరిచయం చేసుకున్న చంద్రశేఖర్ సామ్సాంగ్ కంపెనీలో సేల్స్ మేనేజర్‌గా పనిచేస్తానంటూ నమ్మబలికాడు. ఒక స్కీంలో ఇన్వెస్ట్‌మెంట చేస్తే తనకు ఎక్కువ లాభాలు వస్తాయని, ఈక్రమంలో డబ్బులు అవసరం ఉందని చెప్పి ఆమె ద్వారా రూ.9.70 లక్షలు తన ఖాతాలో వేయించుకున్నాడు. వాటితో ఓ బైక్, సెల్‌ఫోన్ కొనుగోలు చేశాడు. అంతటితో ఊరుకోక ఆమె మెడలో ఉన్న బంగారు చైన్ కావాలంటూ తీసుకున్నాడు. చివరకు మోసపోయానని తెలుసుకున్న బాధితురాలు ఈ నెల 14న పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో అతనిపై నిఘా పెట్టారు. మహిళ చంద్రశేఖర్‌కు ఫోన్ చేసి వనపర్తికి పిలిచింది. వనపర్తికి వచ్చిన అతన్ని స్థానిక రాజీవ్ చౌరస్తాలో పట్టుకున్నట్లు సీఐ తెలిపారు. అతను పేకాటకు అలవాటు పడి డబ్బుల కోసం మహిళలను మోసం చేస్తూ డబ్బులు వసూలు చేసేవాడని వెల్లడించారు. గతంలో రాజమండ్రిలో ఓ అమ్మాయి వద్ద రూ.70 వేలు, మధ్యప్రదేశ్‌లో ఓ అమ్మాయి వద్ద రూ.80 వేలు డబ్బులు ఖాతాలో వేయించుకొని మోసం చేశాడన్నారు. పేకాటకు అలవాటుపడి ఆర్థిక ఇబ్బందులతో విడాకులు తీసుకున్న అమ్మాయిలను ఎంచుకున్నానని నిందితుడు ఒప్పుకున్నాడని తెలిపారు. ఇతను పేకాట ఆడేందుకు గోవా, రాయిచూర్ వెళ్లేవాడన్నారు. ఈ మేరకు నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. కేసును ఛేదించిన వారిలో రేవల్లి ఎస్ఐ వెంకటేష్‌గౌడ్, ట్రెయినీ ఎస్ఐ ఉమ, కానిస్టేబుల్ రాజగౌడ్ తదితరులున్నారు. -
ఒంటరి మహిళలే వాళ్ల టార్గెట్....
సాక్షి, సిటీబ్యూరో: సీజన్‌ను బట్టి ఎత్తులు వేస్తూ... అవసరానికి తగ్గట్టు పంథా మారుస్తూ ఆన్లైన్ ద్వారా రెచ్చిపోతున్న నైజీరియన్లు తాజాగా మాట్రిమోనియల్ మోసాల బాట పట్టారు. అవివాహిత, విడాకులు తీసుకున్న మహిళలను టార్గెట్‌గా చేసుకుని రెచ్చిపోతున్న వీరికి ఈశాన్య రాష్ట్రాలకు చెందిన యువతులూ సహకరిస్తున్నారు. మాట్రిమోనియల్ ఫ్రాడ్స్‌తో పాటు ఫేస్బుక్ ఆధారిత నేరాలకు వీరు వర్చువల్ నంబర్లు వినియోగిస్తున్నట్లు సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. మెట్రోల్లో మాటు వేసి.. వివిధ రకాలైన వీసాలపై భారత్‌కు వస్తున్న నైజీరియన్లు ఢిల్లీ, ముంబై తదితర మెట్రో నగరాల్లో తిష్ట వేస్తున్నారు. లాటరీలు, బహుమతుల పేరుతో ఎస్సెమ్మెస్‌లు, ఈ–మెయిల్స్ ఇస్తూ ఆన్లైన్ మోసాలకు పాల్పడుతున్న వీరు తాజాగా మాట్రిమోనియల్ సైట్స్‌ను ఆధారం చేసుకుంటున్నారు. తాము ప్రవాస భారతీయులమని, లండన్, అమెరికాల్లో డాక్టర్లు, సాఫ్ట్వేర్ ఇంజినీర్లుగా పని చేస్తున్నామంటూ మారుపేర్లతో ఈ వెబ్‌సైట్స్‌లో రిజిస్టర్ చేసుకుంటున్నారు. తన భార్య చనిపోయిందనో, విడాకులు తీసుకున్నామనో చెబుతూ అదే కోవకు చెందిన పెళ్లి కుమార్తెల కోసం వెతుకున్నట్లు వల వేస్తున్నారు. 30 ఏళ్లు దాటిన వారినే ఎంచుకుని... ఈ ప్రొఫైల్స్ చూసి ఆకర్షితులవుతున్న మహిళలు ఆసక్తి చూపుతూ లైక్ చేసిన వెంటనే అసలు కథ ప్రారంభిస్తున్నారు. ఇలా లైక్ చేసిన వారిలో 30 ఏళ్లు పైబడిన మహిళలు, విడాకులు తీసుకున్న వారు, వితంతువులను ఎంపిక చేసుకుంటున్నారు. వీరినే ఎంపిక చేసుకోవడం వెనుకా మతలబు ఉన్నట్లు సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. మిగిలిన మహిళలు, యువతులకు వివాహ సంబంధిత సంప్రదింపులను తల్లిదండ్రులు పర్యవేక్షిస్తారు. వీరైతేనే నేరుగా తమంతట తామే వ్యవహారాలు చక్కబెట్టుకునేందుకు ప్రయత్నిస్తారనే ఉద్దేశంతోనే వారిని టార్గెట్‌గా ఎంచుకుంటున్నారు. నైజీరియన్లు వీరితో చాటింగ్ చూస్తూ, ఫోన్ నంబర్లు తీసుకుని మాట్లాడుతూ వివాహానికి సమ్మతించినట్లు చెప్పి పరిచయాన్ని కొనసాగిస్తున్నారు. వర్చువల్ నంబర్లు ఎంపిక చేసుకుని... దేశంలోని మెట్రో నగరాల్లో ఉంటున్న ఈ నైజీరియన్లు తాము టార్గెట్‌గా చేసుకున్న వారితో మాట్లాడటానికి వర్చువల్ నంబర్ల వాడుతున్నారు. ఇంటర్నెట్లోని అనేక వెబ్సైట్లు ఈ ఫోన్ నంబర్లను నిర్ణీత కాలానికి అద్దెకు ఇస్తుంటాయి. ఆయా సైట్లలో ప్రపంచంలోని అన్ని దేశాలకు చెందిన కొన్ని నంబర్లు డిస్ప్లే అవుతుంటాయి. వీటిలో లండన్, అమెరికాలకు చెందిన నంబర్లను ఎంపిక చేసుకుంటున్నారు. వీటిని వినియోగించి సెల్‌ఫోన్ ద్వారా ఇంటర్నెట్ కాలింగ్ చేస్తే... ఆ ఫోన్ అందుకుంటున్న వారికి ఇతర దేశాల నంబర్లే డిస్ప్లే అవుతాయి. దీంతో ఆయా దేశాల నుంచే ఫోన్ వచ్చినట్లు భ్రమపడతారు. ఇలా కొన్ని రోజులు సాగిన తరవాత భారత్‌కు వచ్చి వివాహం చేసుకుంటానని ఆయా మహిళలను నమ్మిస్తున్నారు. అధికారులుగా ఈశాన్య రాష్ట్రాల యువతులు... కొన్ని రోజుల తరవాత వివాహ కానుకలు పంపిస్తున్నాననో, తాను వేరే దేశానికి వెళ్తున్న నేపథ్యంలో తన వద్ద ఉన్న విలువైన వస్తువులను భద్రపరిచేందుకు పంపిస్తున్నానో చెబుతూ సదరు మహిళల చిరునామా, ఫోన్ నంబర్ తదితరాలు సేకరిస్తున్నారు. ఆ తర్వాత కొన్ని రోజులకు ఢిల్లీ, ముంబైలకు చెందిన నంబర్ల నుంచి ఈశాన్య రాష్ట్రాలకు చెందిన యువతుల ద్వారా ఆయా మహిళలకు ఫోన్లు చేయిస్తున్నారు. కస్టమ్స్ అధికారులుగా పరిచయం చేసుకునే వీరు మీ పేరుతో విదేశాల నుంచి గిఫ్ట్ ప్యాక్ లేదా బంగారం వచ్చిందని, కస్టమ్స్ క్లియరెన్స్‌తో పాటు వివిధ పన్నుల చెల్లింపు జరగని నేపథ్యంలో ఎయిర్‌పోర్ట్‌లో ఆగిపోయిందని మహిళలకు చెబుతున్నారు. ఆయా పన్నుల నిమిత్తం నిర్ణీత మొత్తాలను తాము చెప్పిన బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్ చేయాల్సిందిగా కోరుతున్నారు. సాధారణంగా ఈ టార్గెట్ మహిళలు ఉద్యోగ, వ్యాపార రంగాలకు చెందిన వారే కావడంతో ఈ మాటలు నమ్మి పలు దఫాలుగా వారి కోరిన మొత్తాన్ని బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్ చేస్తున్నారు. బోగస్ పేర్లు, వివరాలను తెరుస్తున్న ఈ ఖాతాల్లో డిపాజిట్ అయిన సొమ్మును ఎప్పటికప్పుడు డ్రా చేసుకుంటూ టోకరా వేస్తున్నారు. తెలుసుకోకుండానమ్మవద్దు ‘కేవలం మాట్రిమోనియల్ వెబ్సైట్లు మాత్రమే కాదు ఫేస్బుక్ వంటి సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ ద్వారా అయిన పరిచయాలను నమ్మకూడదు. అవతలి వ్యక్తిని వ్యక్తిగతంగా కలవడమో, పూర్తి వివరాలు సరిచూసుకోవడమో చేయకుండా ఎలాంటి ఆర్థిక లావాదేవీలు నెరపవద్దు. ఈ తరహా కేసుల్లో అనేక కష్టనష్టాలకు ఓర్చి నిందితుల్ని పట్టుకున్నా వారి నుంచి నగదు రికవరీ అసాధ్యం. ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉంటేనే ఇలాంటి మోసగాళ్లకు చెక్ చెప్పడానికి అవకాశం ఉంటుంది’– సైబర్ క్రైమ్ పోలీసులు -
హెచ్ఐవీ రోగులకు ‘ఆన్లైన్ వివాహ వేదిక’
తోడు కోసం వెతుక్కుంటున్న హెచ్ఐవీ/ఎయిడ్స్ రోగులకు ఆన్లైన్ వివాహ వేదికలు ఇప్పుడు అందుబాటులోకి వస్తున్నాయి.. సూరత్ కేంద్రంగా పనిచేసే గుజరాత్ స్టేట్ నెట్వర్క్ ఆఫ్ పీపుల్ సంస్థ(జీఎస్‌ఎన్‌పీ+) అహ్మదాబాద్ ఐఐఎం సాంకేతిక సహకారంతో తాజాగా ఆన్లైన్ వివాహ వేదికను ప్రారంభించింది. ఈ వ్యాధితో బాధపడుతున్న రోగులు తమ సమస్యను కుటుంబ సభ్యులకు కూడా చెప్పడానికి ఇష్టపడరు. చాలా గోప్యంగా వైద్యులను కలిసి అవసరమైన మందులు వాడుతుంటారు. ఇలాంటి వారికి అదే సమస్యతో బాధపడుతున్న వారు తోడుంటే, మానసిక స్థైరం కల్పిస్తే మెరుగైన జీవితాన్ని గడిపే అవకాశం ఉందన్న లక్ష్యంతో ఈ సంస్థ ఆన్లైన్ వివాహ సేవలు అందించేందుకు ముందుకు వచ్చింది. ఇప్పటికే ఈ రోగుల సమస్యలపై గుజరాత్ కేంద్రంగా ఈ సంస్థ పనిచేస్తోంది. గుజరాత్‌లోనే 68 వేల మంది ఏఆర్టీ సెంటర్‌కు వెళ్తున్నారని జీఎస్‌ఎన్‌పీ వ్యవస్థాపకురాలు దక్షా పటేల్ తెలిపారు. పెళ్లి చేసుకోవాలనే ఆసక్తి ఉన్న హెచ్ఐవీ పాజిటివ్ రోగులతో ఇప్పటికే జీఎస్‌ఎన్‌పీ+ ఆరు వివాహ వేదికలను నిర్వహించింది. గత పదేళ్లలో ఈ వేదికల ద్వారా 245 మంది వివాహం చేసుకున్నారు. వివాహ వేదికలో 1900 మంది రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. మ్యాట్రీమోనీ సర్వీసును ప్రారంభించాలని అనేక మంది ఒత్తిడి తేవడంతో ఆన్లైన్ సేవలు ప్రారంభించినట్లు నిర్వాహకులు తెలిపారు. పెళ్లి చేసుకోవాలనుకుంటున్న వారి ఇరువురి కుటుంబాల్లోని పెద్దలను ముందు కలిసి ఈ విషయం చెబుతాం..భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఇటువంటి జాగ్రత్తలు తీసుకుంటామని తెలిపారు. ఆసక్తి ఉన్న వారు www.gsnpplus.orgలో రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశాన్ని త్వరలో కల్పిస్తున్నారు. ఇలా మొదలైంది రాసిక్ భువా అనే యువకుడికి వివాహం నిశ్చయం అయిన తర్వాత హెచ్ఐవీ ఉన్నట్లు పరీక్షల్లో తేలింది. దీంతో ఆ వివాహాన్ని రద్దు చేసుకున్నాడు. హెచ్ఐవీ రోగులకు భువా అప్పటి నుంచి కౌన్సిలింగ్ మొదలు పెట్టాడు. నవశ్రీ అనే యువతి అతడ్ని కలిసింది. తర్వాత ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. మ్యాట్రీమోనియల్ సర్వీసు, తర్వాత ఆన్లైన్ వివాహ వేదిక ప్రారంభించడానికి ఈ సంఘటనే తమకు ప్రేరణ అని జీఎస్‌ఎన్‌పీ+ నిర్వాహకులు తెలిపారు.