హైదరాబాద్: మ్యాట్రిమోని సైట్‌లో పరిచయం చేసుకొని నగరానికి చెందిన ఓ మహిళను సైబర్ చీటర్స్ మోసం చేశారు. నగర సైబర్ క్రైమ్ ఏసీపీ శివమారుతి తెలిపిన వివరాల ప్రకారం... ఓ మహిళ వివాహం కోసం మ్యాట్రిమోని సైట్‌లో రిజిస్టార్ చేసుకుంది. ఈ సైట్ ద్వారా ఓ వ్యక్తి పరిచయం అయ్యాడు. ఇద్దరూ కలిసి కొద్ది రోజులు చాట్ చేసుకున్నారు. తనను ప్రేమిస్తున్నానని నమ్మించాడు.
తాను అమెరికాలో ఉన్నత స్థాయిలో పనిచేసే వ్యక్తినని, అమెరికా నుంచి ఇండియా వచ్చాక పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. కొద్దిరోజుల తర్వాత ఇండియాలో ఉన్న తమ బంధువులకు సీరియస్‌గా ఉందని, వైద్యం చేయించాలని చెప్పి ఆ ఖర్చులకు గాను డబ్బులు కావాలని అడిగాడు. తాను ఇండియా వచ్చాక మొత్తం డబ్బులు తిరిగి ఇస్తానని, తర్వాత పెళ్లి కూడా చేసుకుందామని నమ్మించాడు.
దీంతో ఆ మహిళ విడతల వారిగా రూ. 30 లక్షలు చీటర్స్ చేప్పిన విధంగా ఆన్‌లైన్ ద్వారా ట్రాన్స్‌ఫర్ చేసింది. అనంతరం ఆ వ్యక్తి స్పందించకపోవడంతో అనుమానం వచ్చిన మహిళ మోసపోయానని నగర సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ శివమారుతి తెలిపారు. ఈ తరహా మ్యాట్రిమోని మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, గుర్తు తెలియని వారితో ఆన్‌లైన్‌లో ప్రేమ, పెళ్లి అని చెబితే నమ్మవద్దని సైబర్ క్రైమ్ పోలీసులు సూచిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment