
అత్తారింటికి అతిథిగా అయితేనే మేలు!
సర్వే
అత్తారింటికి వెళ్లడం... అంటే ఆడపిల్లకు పెళ్లికి మరో పర్యాయపదం. అయితే పెళ్లి కాగానే అత్తారింటికి వెళ్లడం, అక్కడే ఉండవలసి రావడం అనేది నేటి తరం యువతులకు అంత ఆసక్తికరమైన అంశం కాదు.. అని అంటోంది ఒక మ్యాట్రిమొనీ వెబ్‌సైట్. పెళ్లి విషయంలో యువతీ యువకుల అభిప్రాయాలను సేకరించిన ఈ వెబ్‌సైట్ ఓ ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించింది. పెళ్లితో భర్త ఇంటికి వెళ్లడానికి అంతగా ఇష్టపడటం లేదట చాలామంది అమ్మాయిలు. అలాగని భర్తను ఇల్లరికం తెచ్చుకోవాలని వారు అనుకోవడం లేదు. భార్య, భర్త కలిసి ఒక ఇంటిలో సెటిలవ్వాలనేది ఈ యువతుల ఆకాంక్ష.
దాదాపు 52 శాతం మంది యువతులు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారట. పెళ్లి తర్వాత కొత్త ఇల్లు తీసుకొని అందులో ఉండాలనేది వీరి కోరిక. అత్తారిల్లు అంటే ప్రత్యేకమైన భయం ఏమీ లేకపోయినా.. ప్రైవసీని పరిగణనలోకి తీసుకొని వీరు వేరే ఇంటిలో ఉండాలనే కోరికను వెళ్లబుచ్చుతున్నారు.
34 శాతం మంది పెళ్లి తర్వాత అత్తారింట్లో అడుగుపెట్టడం, వాళ్లతో కలిసి పోవడం అనేది ఉద్వేగాన్ని ఇచ్చే అంశమన్నారు. మిగిలిన వారు మాత్రం ఈ విషయంలో తమకు ప్రత్యేకమైన అభిప్రాయం ఏమీలేదు.ఎలాగైనా ఒకటే.. అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారట. ఇవీ... ఆ వెబ్‌సైట్ పేర్కొన్న సర్వే వివరాలు. .