
సాక్షి, హైదరాబాద్ : మ్యాట్రిమోని సైట్ల ద్వారా పెళ్లి సంబంధాలు చూసేవారు కాస్తా ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఉంది. మ్యాట్రిమోని సైట్ల పేరిట మోసాలకు పాల్పడుతున్న ఘటనలు ఇటీవలి కాలంలో అధికమవుతున్నాయి. తాజాగా నగరంలో ఇలాంటి సంఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది. పెళ్లి సంబంధాల కోసం మ్యాట్రిమోని సైట్లను ఆశ్రయించే వారిని అదనుగా చూసుకుని మోసాలకు పాల్పడుతున్న మహిళను రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. అమెరికాలో ఉంటున్న సింహాద్రి పవన్ కుమార్ తనకు తగిన వధువు కావాలని భారత్ మ్యాట్రిమోని సైట్‌లో అతని వివరాలు పెట్టారు. ఇదే అవకాశంగా భావించిన కొరం అర్చన అనే మహిళ తప్పుడు ప్రొఫైల్‌తో అతన్ని బురిడి కొట్టించారు. పవన్ నుంచి 4 లక్షల రుపాయలు వసూలు చేశారు. తర్వాత సదురు మహిళ చేతిలో తాను మోసపోయానని గ్రహించిన భాదితుడు వెంటనే పోలీసులను ఆశ్రయించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు ఐపీసీ 417, 418, 420 సెక్షన్ 66 ఆఫ్ ఐటీ యాక్ట్ కింద కేసులు నమోదు చేసి మహిళను అదుపులోకి తీసుకున్నారు.