తోడు కోసం వెతుక్కుంటున్న హెచ్‌ఐవీ/ఎయిడ్స్ రోగులకు ఆన్‌లైన్ వివాహ వేదికలు ఇప్పుడు అందుబాటులోకి వస్తున్నాయి.. సూరత్ కేంద్రంగా పనిచేసే గుజరాత్ స్టేట్ నెట్‌వర్క్ ఆఫ్ పీపుల్ సంస్థ(జీఎస్‌ఎన్‌పీ+) అహ్మదాబాద్ ఐఐఎం సాంకేతిక సహకారంతో తాజాగా ఆన్‌లైన్ వివాహ వేదికను ప్రారంభించింది. ఈ వ్యాధితో బాధపడుతున్న రోగులు తమ సమస్యను కుటుంబ సభ్యులకు కూడా చెప్పడానికి ఇష్టపడరు. చాలా గోప్యంగా వైద్యులను కలిసి అవసరమైన మందులు వాడుతుంటారు. ఇలాంటి వారికి అదే సమస్యతో బాధపడుతున్న వారు తోడుంటే, మానసిక స్థైరం కల్పిస్తే మెరుగైన జీవితాన్ని గడిపే అవకాశం ఉందన్న లక్ష్యంతో ఈ సంస్థ ఆన్‌లైన్ వివాహ సేవలు అందించేందుకు ముందుకు వచ్చింది. ఇప్పటికే ఈ రోగుల సమస్యలపై గుజరాత్ కేంద్రంగా ఈ సంస్థ పనిచేస్తోంది.
గుజరాత్‌లోనే 68 వేల మంది ఏఆర్‌టీ సెంటర్‌కు వెళ్తున్నారని జీఎస్‌ఎన్‌పీ వ్యవస్థాపకురాలు దక్షా పటేల్ తెలిపారు. పెళ్లి చేసుకోవాలనే ఆసక్తి ఉన్న హెచ్‌ఐవీ పాజిటివ్ రోగులతో ఇప్పటికే జీఎస్‌ఎన్‌పీ+ ఆరు వివాహ వేదికలను నిర్వహించింది. గత పదేళ్లలో ఈ వేదికల ద్వారా 245 మంది వివాహం చేసుకున్నారు. వివాహ వేదికలో 1900 మంది రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. మ్యాట్రీమోనీ సర్వీసును ప్రారంభించాలని అనేక మంది ఒత్తిడి తేవడంతో ఆన్‌లైన్ సేవలు ప్రారంభించినట్లు నిర్వాహకులు తెలిపారు. పెళ్లి చేసుకోవాలనుకుంటున్న వారి ఇరువురి కుటుంబాల్లోని పెద్దలను ముందు కలిసి ఈ విషయం చెబుతాం..భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఇటువంటి జాగ్రత్తలు తీసుకుంటామని తెలిపారు. ఆసక్తి ఉన్న వారు www.gsnpplus.orgలో రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశాన్ని త్వరలో కల్పిస్తున్నారు.
ఇలా మొదలైంది
రాసిక్ భువా అనే యువకుడికి వివాహం నిశ్చయం అయిన తర్వాత హెచ్‌ఐవీ ఉన్నట్లు పరీక్షల్లో తేలింది. దీంతో ఆ వివాహాన్ని రద్దు చేసుకున్నాడు. హెచ్‌ఐవీ రోగులకు భువా అప్పటి నుంచి కౌన్సిలింగ్ మొదలు పెట్టాడు. నవశ్రీ అనే యువతి అతడ్ని కలిసింది. తర్వాత ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. మ్యాట్రీమోనియల్ సర్వీసు, తర్వాత ఆన్‌లైన్ వివాహ వేదిక ప్రారంభించడానికి ఈ సంఘటనే తమకు ప్రేరణ అని జీఎస్‌ఎన్‌పీ+ నిర్వాహకులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment