IIM Ahmedabad
-
దేశంలో ఐఐఎం–అహ్మదాబాద్ టాప్
సాక్షి, అమరావతి: ప్రపంచ వ్యాప్తంగా భారతీయ విశ్వవిద్యాలయాలు అత్యుత్తమ పనితీరును కనబరుస్తున్నాయి. సెంటర్ ఫర్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ (సీడబ్ల్యూయూఆర్)లో 65 భారతీయ వర్సిటీలు, ఐఐటీ, ఐఐఎంలు చోటు దక్కించుకున్నాయి. ప్రపంచంలో మొత్తం రెండువేల విశ్వవిద్యాలయాలకు సీడబ్ల్యూయూఆర్–2024 ఎడిషన్‌లో ర్యాంకులు ప్రకటించింది. గతేడాదితో పోలిస్తే భారత్‌కు చెందిన 32 ఉన్నత విద్యా సంస్థల ర్యాంకులు మెరుగవ్వగా.. మరో 33 సంస్థల ర్యాంకులు స్వల్పంగా క్షీణించాయి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్–అహ్మదాబాద్ (ఐఐఎం–ఏ) దేశంలోనే అగ్రశేణి విద్యా సంస్థగా నిలిచింది. అంతర్జాతీయంగా గతేడాది 419వ ర్యాంకు నుంచి ప్రస్తుతం 410కి చేరుకోవడం విశేషం. తగ్గిన ర్యాంకులు..20,966 విద్యా సంస్థల నుంచి అత్యుత్తమ విద్యా సేవలందించే రెండువేల వర్సిటీలను గుర్తించి సీడబ్ల్యూయూఆర్ ర్యాంకులు ప్రకటించింది. టాటా ఇన్స్టిట్యూట్తో సహా దేశంలోని టాప్–10 ఇన్స్టిట్యూట్లలో ఏడింటి ర్యాంకులు క్షీణించాయి. ఐఐఎం–అహ్మదాబాద్ తర్వాత ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ) నిలిచింది. గతేడాది 494వ ర్యాంకు నుంచి 501కు, ఐఐటీ–ముంబై 554 నుంచి 568వ ర్యాంకు, ఐఐటీ–మద్రాస్ 570 నుంచి 582, టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ వర్సిటీ 580 నుంచి 606కు, ఐఐటీ–ఢిల్లీ 607 నుంచి 616, ఢిల్లీ వర్సిటీ 621 నుంచి 622, పంజాబ్ వర్సిటీ 759 నుంచి 823కు క్షీణించాయి. మరోవైపు.. ఐఐటీ–ఖరగ్‌పూర్ తన స్థానాన్ని 721 నుంచి 704కు, అకాడమీ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇన్నోవేటివ్ రీసెర్చ్ 866 నుంచి 798కు మెరుగుపర్చుకుంది.టాప్‌లో అమెరికా వర్సిటీలు..సెంటర్ ఫర్ వరల్డ్ వర్సిటీ ర్యాంకింగ్స్‌లో టాప్–10లో అన్నీ అమెరికా విశ్వవిద్యాలయాలే నిలిచాయి. అమెరికాకు చెందిన 90 విద్యా సంస్థలు ర్యాంకుల్లో మెరుగుదలను సాధించగా 23 స్థిరంగా, 216 వర్సిటీల ర్యాంకులు క్షీణించాయి. అలాగే, యూకేలో కేవలం 28 సంస్థలు మాత్రమే స్థానాలను మెరుగుపర్చుకోగా, 57 సంస్థల ర్యాంకులు పడిపోయాయి. జర్మనీకి చెందిన మ్యూనిచ్ విశ్వవిద్యాలయం 46వ స్థానంలో ఉన్నా జర్మనీలోని 55 వర్సిటీల ర్యాంకులు దిగజారాయి. వీటికి విరుద్ధంగా చైనాలో 95% వర్సిటీలు గతేడాది కంటే మెరుగైన ప్రదర్శన కనబర్చాయి. సింఘువా వర్సిటీ 43వ స్థానంలో నిలిచింది. వెయ్యిలోపు భారత్‌లోని వర్సిటీల ర్యాంకులు..పంజాబ్ వర్సిటీ (823), ఐఐటీ–కాన్పూర్ (842), ఎయిమ్స్–ఢిల్లీ (874), ఐఐటీ–రూర్కీ (880), బెనారస్ హిందూ వర్సిటీ (891), హోమీబాబా నేషనల్ ఇన్స్టిట్యూట్ (903), జవహర్లాల్ నెహ్రూ సెంటర్ ఫర్ అడ్వాన్స్ సైంటిఫిక్ రీసెర్చ్ (927), జవహర్లాల్ నెహ్రూ వర్సిటీ (951), ఐఐటీ–గౌహతి (966) ర్యాంకులు సాధించాయి. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌కు 1,299, ఐఐటీ–హైదరాబాద్‌కు 1,327 ర్యాంకులు వచ్చాయి.టాప్–10 వర్సిటీలు అమెరికావే.. » హార్వర్డ్ వర్సిటీ » మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ» స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయం» యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జి» యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫర్డ్» ప్రిన్స్టన్ వర్సిటీ» కొలంబియా విశ్వవిద్యాలయం» యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా» యేల్ వర్సిటీ» కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ -
ఓ పక్క అద్భుతమైన మోడల్‌గా..మరోవైపు క్యాట్‌లోనూ సత్తా చాటింది
అందం, అద్బుతమైన తెలివితేటలు ఆమె సొంతం. ఒక పక్క తనకు ఇష్టమైన అభిరుచిలో రాణిస్తూనే మరోవైపు చదువులోనూ సత్తా చాటి ..తనకు తానే సాటి అని నిరూపించుకుంచి. 'బ్యూటీ విత్ బ్రెయిన్'కి ఉదాహరణగా నిలిచింది. ఓ మనిషి రెండింటింలోనూ రాణించగలడని నిరూపించించి మోడల్ ఆకాంక్ష చౌదరి. ఆకాంక్ష చౌదరి పేరుకు తగ్గట్టుగానే తన ఆకాంక్షలని నెరవేర్చుకుని అందర్ని మంత్రముగ్దుల్ని చేసింది. ఆమె 2016లో మిస్ ఇండియా ఎలైట్ విజేత. ఆమెకు మోడలింగ్ అంటే చాలా ఇష్టం. ఆమెకు అదోక ప్యాషన్ కూడా. ఒకపక్క మోడలింగ్‌పై దృష్టి పెడుతూనే తన కెరియర్ని మంచి గాడిలో పెట్టుకుంది. ఆమె క్యాట్‌లో 98.12 పర్సంటేజ్‌తో ఉత్తీర్ణత సాధించి ఆశ్చర్యపరిచింది. ఆమె మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్కి దరఖాస్తు చేస్తున్నప్పుడే మిస్ ఇండియా ఎలైట్ పోటీకి ఎంపికైంది. అతన అభిరుచిని అనుసరించి అందాల పోటీలో విజేతగా నిలిచింది. అదే సమయంలో క్యాట్ ఎగ్జామ్‌కి ప్రిపేర్ అయ్యింది. ఆమె ఐఐఎం అహ్మాదాబాద్‌లో 2017-2019 బ్యాచ్ ఎంబీఏ గ్రాడ్యుయేట్ . ప్రస్తుతం ఆమె మెకిన్సేలో కన్సల్టెంట్‌గా పనిచేస్తున్నారు. ఈ మేరకు ఆకాంక్ష ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..తాను మోడల్‌గా ఈ టైటిల్ గెలిచినందుకు చాలా సంతోషంగా ఉంది. గెలుస్తానని అనుకోలేదు. మోడలింగ్ మారబోతున్నాను. మోడలింగ్ నన్ను ఫిట్‌గా ఉండేలా ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించేలా చేసింది. చదువు తోపాటు మోడలింగ్‌లోనూ రాణించేందుకు తాను టైం షెడ్యూలను చాలచక్యంగా నిర్వహించాల్సి వచ్చేదని చెబుతోంది ఆకాంక్ష. నిజానికి ఆకాంక్ష మోడలింగ్, కాంపిటీటవ్ ఎగ్జామ్ రెండింటికి ఏకాకాలంలో సన్నద్ధమైంది. చక్కగా బ్యాలెన్స్ చేసి అనుకున్నది సాధించింది. ఒక వ్యక్తి తన అభిరుచిని అనుసరిస్తూనే బిజినెస్ రంగంలో కూడా రాణించగలడిని నిరూపించింది. అందరికీ ఆదర్శంగా నిలిచింది. (చదవండి: రష్యాలో వాగ్నర్ గ్రూప్ మాదిరిగా..చరిత్రలో వెన్నుపోటు పొడిచిన నాయకులు వీరే!) -
ఫైబర్ హెల్మెట్: క్షేమంగా... లాభంగా.. సవాళ్లను ఎదుర్కొనే సాహసం ఉంటేనే!
బ్రాండ్ అండ్ మార్కెటింగ్ ఎక్స్పర్ట్ ఆల్పన పరీదా రైడర్ సెంట్రిక్ స్టార్టప్‌తో కొత్త ప్రయాణం మొదలు పెట్టింది. ‘యువత మనసుతో ఆలోచిస్తాను’ అని చెప్పే పరీదా తన స్నేహితురాలు, వ్యాపార దిగ్గజం ఫల్గుణీ నాయర్ చెప్పిన మాటను శిరోధార్యంగా భావిస్తుంది. ‘ఆసక్తి మాత్రమే కాదు. సవాళ్లను ఎదుర్కొనే సాహసం ఉండాలి’ అంటూ ముందుకు సాగుతోంది. బ్రాండ్ డిజైన్, డిజైన్ థింకింగ్ ఏజెన్సీ ‘డివై వర్క్స్’లో పనిచేయడానికి ఆల్పన పరీదా బెంగళూరు నుంచి ముంబైకి వెళుతున్నప్పుడు తన మదిలో ఎన్నో ఆలోచనలు. అందులో అనుకూలమైన వాటితోపాటు ప్రతికూలమైన ఆలోచనలు కూడా ఉన్నాయి. అయితే ‘డివై వర్క్స్’లో చేరిన తరువాత తాను ఉద్యోగి మాత్రమే కాలేదు. విద్యార్థి కూడా అయింది. ‘డిజైన్ అనేది కస్టమర్‌ను ఎలా ఆకట్టుకుంటుంది, ప్రాడక్ట్ వైపు వచ్చేలా ఎలా చేస్తుంది...మొదలైన విషయాలను ప్రత్యక్షంగా తెలుసుకోగలిగాను’ అంటుంది పరీదా. ఫ్రానెస్కో ముట్టి అనే పాస్తా, పిజ్జా సాస్ తయారీ కంపెనీ కోసం తాను పని చేయాల్సి వచ్చింది. దీనికోసం క్షేత్రస్థాయిలో ఎంతోమందిని కలిసి వారి అభిప్రాయాలు తెలుసుకుంది. చాలామంది కస్టమర్స్ గ్లాస్ జార్స్‌ను ఉపయోగించడాన్ని ఇష్టపడడం లేదని అర్థం చేసుకున్న ఆ కంపెనీ గ్లాస్ బాటిల్స్‌లో సాస్ అమ్మడం మొదలుపెట్టింది. ఇది సత్ఫలితాన్నిచ్చింది. సొంతంగా కంపెనీ ఐఐఎం, అహ్మదాబాద్‌లో పీజీడిఎం(పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్) చేసింది పరీదా. ‘ఉద్యోగం చేయకుండా ఇంట్లో ఉన్నప్పుడు, ఉద్యోగం చేయలేకపోతున్నాననే బాధ మహిళల్లో ఉంటుంది. ఉద్యోగం చేస్తున్నప్పుడేమో, కుటుంబానికి న్యాయం చేయలేకపోతున్నాను అనిపిస్తుంది. అందుకే ఉద్యోగ జీవితాన్ని, కుటుంబ జీవితాన్ని సమన్వయం చేసుకుంటే ఎలాంటి సమస్యా ఉండదు’ అంటుంది పరీదా. మార్కెటింగ్ రంగంలో ఎన్నో విజయాలు సాధించిన పరీదాకు సొంతంగా కంపెనీ మొదలుపెట్టాలనే ఆలోచన వచ్చింది. ఆ సమయంలో తాను నేర్చుకున్న విషయం గుర్తొచ్చింది. ‘ఎక్కడ అవసరం, ఎవరికి అవసరం, ఎందుకు అవసరం అనేవి ప్రాడక్ట్ విషయంలో ప్రధానంగా దృష్టిలో పెట్టుకోవాల్సిన విషయాలు. ఆ తరువాతే... విజువల్ ఐడెంటిటీ, బ్రాండ్ గురించి ఆలోచించాలి’ ఆ సమయంలో తన దృష్టి హెల్మెట్లపై పడింది. మన దేశం టూ–వీలర్స్ రైడర్స్‌కు పెట్టింది పేరు. హెల్మెట్ ధరించడం తప్పనిసరి. కానీ బైక్‌లతో పోల్చితే హెల్మెట్ల డిజైన్‌లో పెద్దగా మార్పు లేదు. ‘టీవ్ర’కు శ్రీకారం తన ప్రాజెక్ట్‌లో భాగంగా ఎంతోమంది రైడర్స్‌తో మాట్లాడి హెల్మెట్ల విషయంలో వారి అభిప్రాయాలు తెలుసుకుంది. ‘ప్లాస్టిక్ అనేది బకెట్స్కు బాగుంటుంది. మన తలను రక్షించడానికి కాదు. అందుకే ట్రాక్రైడర్స్ అందరూ కాంపోజిట్ ఫైబర్ హెల్మెట్లనే వాడతారు’ అంటున్న పరీదా టూ–వీలర్స్ కోసం ‘టీవ్ర’కు శ్రీకారం చుట్టింది. గ్లాస్ ఫైబర్ అండ్ కార్బన్ ఫైబర్ హెల్మెట్ల తయారీ కంపెనీ ఇది. తక్కువ బరువు ఉండడం ఈ హెల్మెట్ల ప్రత్యేకత. సౌందర్య ఉత్పత్తుల సంస్థ ‘నైకా’ వ్యవస్థాకురాలు ఫల్గుణీ నాయర్ పరీదాకు ఐఐఎం–అహ్మదాబాద్‌లో క్లాస్మేట్. ఒక విధంగా చెప్పాలంటే పరీదాకు స్ఫూర్తిని ఇచ్చింది నాయరే. పరీదా సాధించిన విజయాలను బట్టి, ఆమెలో ఉత్సాహం మాత్రమే లేదని, సవాళ్లను ఎదుర్కొనే సాహసం మెండుగా ఉందని, ఆ సాహసమే తన వ్యాపారాన్ని ముందుకు నడిపించే ఇంధనమని అర్థం అవుతుంది. చదవండి: SOMA BANIK: ఆరోగ్యమే ఆత్మవిశ్వాసం జాబ్ మానేయ్!.. నిజమే కదా! అనుకుని త్యాగం.. డిప్రెషన్లోకి వెళ్లి.. -
ఆటోడ్రైవర్ కుమారుడికి ఐఐఎంలో సీటు
సాక్షి, పెద్దపల్లి: ఆటోడ్రైవర్ కుమారుడు ఐఐఎంలో సీటు సాధించాడు. నిత్యం పిల్లలను పాఠశాలకు ఆటోలో తీసుకెళ్లి వస్తూ తన పిల్లలను సైతం ఎలాగైనా ఇదే పాఠశాలలో చదివించాలని వారికి మంచి భవిష్యత్ అందించాలని అందుకు ఎంతకష్టమైనా భరించేందుకు సిద్ధపడ్డాడు. అనుకున్నదే తడవుగా ఎన్టీపీసీలోని సెయింట్ క్లెయిర్ పాఠశాలలో సీటు సాధించాడు. తన కొడుకు 8 నుంచి 10వ తరగతి వరకూ చదివి, అందరి పిల్లల ముందు బెస్ట్ అవార్డు అందుకోవడంతో తండ్రి ఆనందానికి అవదులు లేకుండాపోయాయి. గోదావరిఖని ద్వారకానగర్‌కు చెందిన ఎమిరెడ్డి రాజిరెడ్డి ఆటో నడుపుతూ తన కుమారుడు లక్ష్మికాంత్‌రెడ్డిని సెయింట్క్లెయిర్ పాఠశాలలో చేర్పించాడు. 8,9,10వ తరగతి వరకు అక్కడే చదివిన లక్ష్మికాంత్‌రెడ్డి టెన్త్‌లో బెస్ట్ స్టూడెంట్‌గా ఎంపికై నిత్యం తన తండ్రి ఆటోలో వచ్చే పిల్లల ముందే అవార్డు అందుకున్నాడు. ఇదేస్ఫూర్తితో ముందుకు సాగి కరీంనగర్లో ఇంటర్లో చేరి స్కాలర్‌షిప్‌తో చదువు పూర్తిచేశాడు. ఇంజినీరింగ్ ఎంట్రెన్స్‌లో 6వేల ర్యాంకు సాధించి హైదరాబాద్‌లో మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తిచేశాడు. తండ్రికి పక్షవాతం... లక్ష్మికాంత్‌రెడ్డి చదువు కొనసాగిస్తుండగా తండ్రికి పక్షవాతం వచ్చింది. దీంతో ఆర్థికంగా గడ్డు పరిస్థితులు ఎదురయ్యాయి. అయినప్పటికీ బెదరకుండా ఇంజినీరింగ్ చేస్తూ రెడ్డిహాస్టల్లో ఉండేవాడు. చదువుకు డబ్బులు సరిపోకపోవడంతో ట్యూషన్ చెప్పి ఆర్థికంగా నిలదొక్కుకున్నాడు. ఇంజినీరింగ్ పూర్తవుతున్న క్రమంలో క్యాంపస్ సెలక్షన్స్‌లోనే సాఫ్ట్వేర్ ఉద్యోగానికి ఎంపికై 2016 నుంచి ఉద్యోగం చేస్తూ కుటుంబానికి సహకారం అందించాడు. ఈక్రమంలో గతేడాది సెప్టెంబర్‌లో ఐఐఎం ఎంట్రన్స్ పరీక్ష రాసి 610 మార్కులు సాధించాడు. మంచి మార్కులు రావడంతో అహ్మదాబాద్ ఐఐఎంలో సీటు లభించింది. ఇదే కళాశాల ఆవరణలోని బ్యాంకులో లోన్ తీసుకుని పేమెంట్ సీటు పొందాడు. ఏడాదిలో చదవు పూర్తిచేసి మంచి ఉద్యోగం సాధిస్తాడని కుటుంబ సభ్యులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. నాన్న కృషితో ఈ స్థాయికి ఎదిగా.. నా చదువుకోసం నాన్న చాలా కష్టపడ్డాడు. ఆటోలో వెళ్లే పిల్లల ముందు ఉత్తమ విద్యార్థిగా అవార్డు సాధించడం ఆనందంగా ఉంది. స్కాలర్‌షిప్‌తో ఇంటర్ పూర్తి చేశా. పట్టుదలతో హైదరాబాద్‌లో ఇంజినీరింగ్ చదువు కొనసాగించా. రెడ్డీస్ హాస్టల్ వారందించిన సహకారంతో ఇంజినీరింగ్ పూర్తిచేశా. క్యాంపస్ సెలక్షన్స్‌లో కొన్నాళ్లు ఉద్యోగం చేశా. అహ్మ దాబాద్ ఐఐఎంలో సీటు లభించడం చాలా సంతోషంగా ఉంది. – లక్ష్మికాంతరెడ్డి, విద్యార్థి -
Cryptocurrency: క్రిప్టోకి అనుమతులు వచ్చేనా ? కేంద్రం వరుస సమావేశాలు!
Crypto Finance: క్రిప్టో కరెన్సీపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకోనుందా ? క్రిప్టో కరెన్సీకి అనుమతులు జారీ చేస్తూనే చట్టబద్ద నియంత్రణ ఉండేలా ఏర్పాట్టు చేయబోతుందా ? అంటే అవుననే సమాధానం వస్తోంది. చాపకింద నీరులా విస్తరిస్తున్న క్రిప్టోపై ప్రభుత్వ పరంగా విధానపరమైన నిర్ణయం తీసుకునేందుకు కేంద్రం రెడీ అవుతోంది. జయంత్‌సిన్హా నేతృత్వంలో క్రిప్టో కరెన్సీపై ప్రభుత్వ పరంగా నిర్ణయం ప్రకటించే ముందు ఇందులో భాగస్వాములగా ఉన్న అన్ని పక్షాలతో చర్చలు జరపాలని కేంద్రం నిర్ణయించింది. అందులో భాగంగా క్రిప్టో ఎక్సేంజీ ప్రతినిధులు, బ్లాక్ చెయిన్ అండ్ క్రిప్టో అసెట్స్ కౌన్సిల్ (బీఏసీసీ), ఇండస్ట్రీ బాడీస్‌తో పాటు ఈ లావాదేవీలతో సంబంధం ఉండే ఇతర వర్గాలతో పార్లమెంటరీ ప్యానెల్ సోమవారం సమావేశం కానుంది. దీనికి మాజీ ఆర్థిక మంత్రి, పార్లమెంట్ సభ్యుడు జయంత సిన్హా నేతృత్వం వహించనున్నారు. ఐఐఎం అహ్మదాబాద్ సమీక్ష ఈ సమావేశంలో చర్చించిన విషయాలపై మరోసారి ఇండియన్ ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్ (అహ్మదాబాద్) కమిటీ సమీక్షిస్తుంది. అనంతరం క్రిప్టోకి సంబంధించిన అంశం పార్లమెంటు స్టాండింగ్ కమిటీ పరిశీలనకు వెళ్లనుంది. అక్కడ క్రిప్టో కరెన్సీకి అనుమతి ఇవ్వాలా ? ఇస్తే ఎలాంటి చట్టపరమైన షరతులు విధించాలనే అంశంపై చర్చించి నిర్ణయం తీసుకుంటారు. నలువైపులా ఒత్తిడి ప్రపంచంలోనే అతి పెద్ద ఆర్థిక వ్యవస్థలలో ఒక్కటైన ఇండియాలో క్రిప్టో కరెన్సీకి అనుమతులు ఇవ్వాలంటూ ప్రప్రంచ దేశాల నుంచి ఒత్తిడి వస్తోంది. మరోవైపు చట్టపరమైన అనుమతులు లేకపోయినా దేశంలో క్రిప్టో లావాదేవీలు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన క్రిప్టో భవిష్యత్తుపై చర్చించేందుకు ఇప్పటికే ఓ దఫా మంత్రులు, ఆర్బీలతో చర్చలు పూర్తయ్యాయి. ఆ సమావేశంలో చర్చించినట్టుగా క్రిప్టో కరెన్సీలో భాగస్వామ్య పక్షాలు, మేనేజ్మెంట్ సంస్థల అభిప్రాయాలను క్రోడీకరిస్తోంది ప్రభుత్వం. ఆర్బీఐ నుంచి క్రిప్టోకరెన్సీపై సుప్రీం కోర్టు నిషేధం కొనసాగుతోంది. అయితే మరోవైపు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియానే నేరుగా డిజిటల్ కరెన్సీ విడుదల చేస్తే ఎలా ఉంటుందనే అంశంపై కూడా గతంలో అనేక చర్చలు జరిగాయి. అయితే దీనిపై ఇంత వరకు ఓ నిర్ణయం తీసుకోలేదు. కాగా ప్రస్తుతం క్రిప్టోపై విధానపరమైన నిర్ణయం తీసుకునేందుకు ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. చదవండి:క్రిప్టో కరెన్సీపై ఏం చేద్దాం? ప్రధాని మోదీ అధ్యక్షతన సమావేశం -
అవినీతిపై బ్రహ్మాస్త్రం
పై స్థాయిలో 50 శాతం అవినీతిని నిర్మూలించాం. మిగిలిన స్థాయిల్లో ఉన్న 50 శాతం అవినీతిని నిర్మూలించాలి. ఇందులో భాగంగా ప్రతి ప్రభుత్వ విభాగంలోనూ రివర్స్ టెండరింగ్ నిర్వహించాలి. టీటీడీతో సహా అన్ని విభాగాలు టెండర్ విలువ కోటి రూపాయలు దాటితే రివర్స్ టెండరింగ్‌కు వెళ్లాలి. – సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన కేసుల్లో వెంటనే చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పష్టం చేశారు. ఇందుకోసం దిశ చట్టం తరహాలో అసెంబ్లీలో చట్టం చేసేందుకు వీలుగా బిల్లు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. కొన్ని కేసుల విచారణ 25 ఏళ్లుగా సాగుతోందంటే.. అవినీతి కేసుల విషయంలో సీరియస్‌గా లేమనే సంకేతాలు వెళ్తాయని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లో అవినీతి ఉండకూడదని, కూకటివేళ్లతో సహా పెకిలించాల్సిందేనని స్పష్టం చేశారు. అవినీతి నిరోధానికి తీసుకున్న చర్యలు, 14400 కాల్ సెంటర్, కేబినెట్ సబ్ కమిటీ నివేదిక, ఐఐఎం అహ్మదాబాద్ నివేదిక రివర్స్ టెండరింగ్, జ్యుడిషియల్ ప్రివ్యూ తదితర అంశాలపై సోమవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో సమగ్ర సమీక్ష నిర్వహించారు. ‘గత ఏడాది నవంబర్‌లో అవినీతికి సంబంధించి కాల్ సెంటర్ 14400 ప్రారంభించాం. ఇప్పటి వరకు 44,999 కాల్స్ వచ్చాయి. ఇందులో అవినీతికి సంబంధించిన అంశాలు 1,747 కాగా..1,712 పరిష్కరించాం. 35 పెండింగ్‌లో ఉన్నాయి’ అని అధికారులు వివరించారు. సమీక్ష వివరాలు ఇలా ఉన్నాయి. ఫిర్యాదుల మానిటరింగ్ బలంగా ఉండాలి ► 1902 నంబర్‌ను ఏసీబీతో (14400) అనుసంధానం చేయాలి. గ్రామ, వార్డు సచివాలయాల స్థాయి నుంచి అవినీతిపై వచ్చే ఫిర్యాదులను కూడా స్వీకరించాలి. ఫిర్యాదులను మానిటరింగ్ చేసే వ్యవస్థ బలంగా ఉండాలి. దీనికి కలెక్టర్ కార్యాలయాలను కూడా అనుసంధానం చేయాలి. ► టౌన్ ప్లానింగ్, సబ్ రిజిస్ట్రార్, ఎమ్మార్వో, ఎంపీడీఓ, టౌన్ ప్లానింగ్ కార్యాలయాల్లో అవినీతి ఆనవాళ్లు ఉండకూడదు. దీనిపై అవినీతికి ఆస్కారం లేని విధానాలతో మనం ఫోకస్‌గా ముందుకు వెళ్లాలి. అవినీతికి పాల్పడాలంటే భయపడే పరిస్థితి రావాలి. ► 14400 నంబర్‌పై మరింత ప్రచారం నిర్వహించాలి. పర్మినెంట్ హోర్డింగ్స్ పెట్టాలి. గత ప్రభుత్వానికి, మన ప్రభుత్వానికీ ఇదీ తేడా ► కర్నూలు జిల్లా పిన్నాపురం విద్యుత్ ప్రాజెక్టుకు గత ప్రభుత్వం 4,766.28 ఎకరాల భూమిని ఇచ్చింది. అప్పట్లో ఎకరాకు కంపెనీ చెల్లించే మొత్తం రూ.2.5 లక్షలు మాత్రమే. మన ప్రభుత్వం సంప్రదింపులు జరిపి, ఆ మొత్తాన్ని రూ.5 లక్షలకు పెంచింది. దీని వల్ల అదనంగా రూ.119 కోట్ల ఆదాయం వస్తోంది. ► సోలార్/విండ్ కింద ఉత్పత్తి చేసే 1550 మెగావాట్ల ఉత్పత్తికి గాను మెగావాట్‌కు రూ.1 లక్ష చెల్లించేందుకు కంపెనీ అంగీకరించింది. దీని వల్ల ఏడాదికి రూ.15.5 కోట్ల చొప్పున 28 ఏళ్లలో రూ.322 కోట్లు ప్రభుత్వానికి వస్తాయి. ► రివర్స్ పంపింగ్ ద్వారా ఉత్పత్తి చేయనున్న 1680 మెగావాట్ల కరెంట్‌కు సంబంధించి.. మెగావాట్‌కు మొదటి పాతికేళ్లలో రూ.లక్ష, తద్వారా ఏడాదికి రూ.16.8 కోట్లు, 25 ఏళ్ల తర్వాత రూ.2 లక్షలు చొప్పున ఏడాదికి రూ.33.6 కోట్ల మేర ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. దీని వల్ల ప్రభుత్వానికి రూ.2,940 కోట్లు ఆదాయం వస్తుంది. ఈ ప్రభుత్వం వచ్చాక అదే కంపెనీతో సంప్రదింపుల కారణంగా రూ.3,381 కోట్లు ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. ఇందుకు కృషి చేసిన అధికారులను అభినందిస్తున్నా. ► భోగాపురం విమానాశ్రయ ప్రాజెక్టుకు గత ప్రభుత్వం 2703 ఎకరాలను కేటాయిస్తే.. అదే కంపెనీతో ఈ ప్రభుత్వం సంప్రదింపులు జరపగా, 2203 ఎకరాల్లో ఈ ప్రాజెక్టును పూర్తి చేయడానికి ఒప్పుకుంది. తద్వారా 500 ఎకరాల భూమి ప్రభుత్వానికి మిగిలింది. ఎకరాకు రూ.3 కోట్లు వేసుకున్నా రూ.1500 కోట్లు మిగిలినట్లే. 788 పనులకు రివర్స్ టెండరింగ్ ► ‘మొత్తంగా 788 పనులకు రివర్స్ టెండరింగ్ నిర్వహించామని, సాధారణ టెండర్ల ప్రక్రియ ద్వారా 7.7 శాతం మిగులు ఉండగా, రివర్స్ టెండరింగ్ ద్వారా 15.01 శాతం మిగులు ఉందని అధికారులు వివరించారు. ► రూ.100 కోట్లు దాటిన ఏ ప్రాజెక్టుకైనా జ్యుడిషియల్ ప్రివ్యూకు వెళ్తున్నాం. 2019 ఆగస్టు నుంచి 2020 ఆగస్టు వరకు రూ.14,285 కోట్ల విలువైన 45 పనులు జ్యుడిషియల్ ప్రివ్యూకు వెళ్లాయి’ అని అధికారులు తెలిపారు. సీఎంకు అహ్మదాబాద్ ఐఐఎం నివేదిక ► అవినీతిని నిరోధించడానికి సంబంధించి గతంలో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం గుడ్ గవర్నెన్స్‌పై ప్రతిష్టాత్మక సంస్థ అహ్మదాబాద్ ఐఐఎం ప్రొఫెసర్ సుందరవల్లి నారాయణ స్వామి సమీక్షకు ముందు సీఎం జగన్‌కు నివేదిక సమర్పించారు. ► ఎమ్మార్వో, ఎంపీడీఓ, సబ్ రిజిస్టార్, మున్సిపల్, టౌన్ ప్లానింగ్ కార్యాలయాలను యూనిట్‌గా తీసుకుని, సిబ్బంది విధులు, బాధ్యతల్లో స్పష్టత ఇవ్వడంతో పాటు, అవినీతికి ఆస్కారమున్న అంశాలను గుర్తించి ఆ మేరకు తగిన చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ స్పష్టం చేశారు. ► ఈ సమీక్షలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్, ఏసీబీ డీజీ పీ.ఎస్.ఆర్. ఆంజనేయులు, వివిధ శాఖల అధికారులు, ఐఐఎం అహ్మదాబాద్ ప్రతినిధులు పాల్గొన్నారు. -
ఐఐఎంకు వలస కార్మికుల లీగల్ నోటీసు
అహ్మదాబాద్ : ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనెజ్మెంట్ అహ్మదాబాద్‌కు(ఐఐఎంఏ) వలస కార్మికులు లీగల్ నోటీసులు పంపించారు. ఐఐఎంఏలో ఓ భవన నిర్మాణ పనుల్లో పాల్గొన్న వలస కార్మికులు.. లాక్డౌన్ సమయంలో సంస్థ తమకు రెండు నెలల కాలానికి వేతనం చెల్లించలేదని ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలు ఐఐఎంఏ అధికారులు ఖండించారు. వివరాల్లోకి వెళ్తే.. ఐఐఎంఏ నిర్మాణ పనుల్లో పాల్గొన్న దాదాపు 100 మంది వలస కార్మికులు ఇటీవల అక్కడికి సమీపంలోని రద్దీగా ఉండే రోడ్డుపైకి చేరుకుని నిరసన తెలిపారు. పోలీసులపై, అటుగా వెళ్లే వాహనాలపై రాళ్లు రువ్వారు. తమను స్వస్థలాకు పంపేందుకు ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేశారు. దీంతో పోలీసులు వలస కార్మికులపై టియర్ గ్యాస్ షెల్స్‌ను ప్రయోగించి.. వారిని అక్కడి నుంచి తరలించారు. వారు చాలా కాలంగా తమను స్వస్థలాకు పంపించాలని స్థానిక అధికారులను కోరినప్పటికీ.. ఫలితం లేకపోవడంతో వలసకూలీలు ఈ విధమైన నిరసన చేపట్టినట్టుగా తెలుస్తోంది. అయితే ఆ మరుసటి రోజు ఐఐఎంఏ డైరెక్టర్, గుజరాత్ చీఫ్ సెక్రటరీ, అడిషనల్ చీఫ్ సెక్రటరీ, డిప్యూటీ లేబర్ కమిషనర్లకు వలస కార్మికులు ఒక లాయర్ ద్వారా లీగల్ నోటీసులు పంపించారు. ‘వలస కార్మికుల్లో పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొందరిని దారుణంగా కొట్టారు. పోలీసులు అదుపులోకి తీసుకున్నవారిలో ఇద్దరికి కరోనా పాజిటివ్‌గా తేలింది. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు విరుద్దంగా.. ఇక్కడ వలస కూలీలకు ప్రధాన యజమానిగా ఉన్న ఐఐఎంఏ వారికి రెండు నెలలుగా వేతనాలు చెల్లించడం లేదు. వలస కూలీల కుటుంబాల్లో దాదాపు 20 మంది చిన్నారులు, 30 మంది మహిళలు ఉన్నారు. వారికి కార్మిక చట్టాల ప్రకారం నిర్మాణం జరిగే ప్రదేశాల్లో వసతి కల్పించడం లేదు’ అని నోటీసుల్లో పేర్కొన్నారు. (చదవండి : కూలీల ఇక్కట్లపై నేడు ప్రతిపక్షాల భేటీ) దీనిపై స్పందించిన ఐఐఎంఏ డైరెక్టర్.. కార్మికుల అందరికి వారి బాకీలను చెల్లించామని తెలిపారు. స్వస్థలాకు వెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వం రవాణా సదుపాయం కల్పించాలనే డిమాండ్‌తోనే కార్మికులు నిరసన చేపట్టారని అన్నారు. -
ఐఐఎంతో ఏపీప్రభుత్వం ఒప్పందం
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో అవినీతి నిర్మూలన దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. ప్రభుత్వ శాఖల్లో అవినీతి జరగడానికి ఆస్కారం ఉన్న అంశాలను అధ్యయనం చేసి, తగిన సూచనలు ఇవ్వడానికి ప్రతిష్టాత్మక ఐఐఎం (అహ్మదాబాద్)తో ఒప్పందం కుదుర్చుకుంది. గురువారం సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో ఐఐఎం ప్రొఫెసర్ సుందరవల్లి నారాయణ స్వామి, ఏసీబీ చీఫ్ విశ్వజీత్‌లు ఒప్పందంపై సంతకాలు చేశారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి మూడో వారానికి నివేదిక సమర్పించాలని గడువు విధించారు. ఈ సందర్భంగా పరిపాలనలో పారదర్శకత, అవినీతి రహిత విధానాల కోసం ప్రభుత్వం ఇటీవల తీసుకున్న చర్యలను సీఎం ఈ సందర్భంగా ఐఐఎం ప్రతినిధులకు వివరించారు. గతంలో ఏపని కావాలన్నా ప్రజలు మండల కార్యాలయానికి వెళ్లేవారని, అక్కడ సకాలంలో పనులు కాకపోవడంతో అవినీతికి ఆస్కారం ఏర్పడిందన్నారు. దీనికి పరిష్కారంగా అధికార వికేంద్రీకరణ, పరిపాలనను గ్రామాలకు అందుబాటులో ఉంచడం, ప్రభుత్వ పథకాలను నేరుగా లబ్దిదారుల గడపకే చేర్చడం వంటి లక్ష్యాలను సాధించడానికి గ్రామ, వార్డు సచివాలయను ఏర్పాటు చేశామని వివరించారు. గతంలో మండలంలో జరిగే పనులు ఇప్పుడు గ్రామ స్థాయిలోనే జరుగుతాయని వెల్లడించారు. జనవరి 1 నుంచి ఇవి పూర్తి స్థాయిలో పనిచేస్తాయని, అందుకు కావాల్సిన కంప్యూటర్లు, ఇతరత్రా సామాగ్రి చేరుకుంటుందని పేర్కొన్నారు. గ్రామ సచివాలయాలతో ఎమ్మార్వో కార్యాలయం, కలెక్టరేట్, రాష్ట్ర స్థాయిలో సెక్రటేరియట్లు ఒక్క బటన్‌తో అనుసంధానం అవుతాయని వివరించారు. దీని కోసం ఐటీ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేస్తున్నామని, ఈ అంశం కూడా పరిశీలించాలని ప్రతినిధులకు విజ్ఞప్తి చేశారు. పేదలకు మంచి జరగాలనే ఉద్దేశ్యంతో అనర్హులు లబ్దిపొందకుండా ఇదంతా చేస్తున్నామని పునరుద్ఘాటించారు. ఐఐఎం ప్రొఫెసర్ సుబ్రమణ్యం మాట్లాడుతూ.. అవినీతి నిర్మూలనకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల్లో తమ పాత్ర ఉన్నందుకు సంతోషం వెలిబుచ్చారు. ఈ ఒప్పందం చేసుకోవడం తమ సంస్థకు లభిస్తున్న గౌరవంగా భావిస్తున్నామని వ్యాఖ్యానించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
బెస్ట్ బిజినెస్ స్కూల్ ఐఐఎం అహ్మదాబాద్
ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అహ్మదాబాద్ దేశంలోనే నంబర్ వన్ బిజినెస్ స్కూల్ గా స్థానం సంపాదించుకుంది. ఆ తరువాతి స్థానాల్లో ఐఐఎం కలకత్తా, ఐఐఎం బెంగుళూరు ఉన్నాయి. ఫైనాన్షియల్ టైమ్స్ మాస్టర్స్ ఇన్ మేనేజ్మెంట్ ర్యాంకింగ్‌లో ఐఐఎం అహ్మదాబాద్, ఐఐఎం కలకత్తాలు ఆసియాలోనే ద్వితీయ, తృతీయస్థానాల్లో నిలిచాయి. ప్రపంచ వ్యాప్తంగా ఈ యేడాది సర్వేలో మొత్తం 104 బిజినెస్ స్కూల్స్ పాల్గొన్నాయి. గత యేడాది అంతర్జాతీయంగా 28వ స్థానంలో ఉన్న ఇండియన్ బిజినెస్ స్కూల్స్ ఈ యేడాది కొంత మెరుగై ఐఐఎం అహ్మదాబాద్ 21వ ర్యాంకులోనూ, ఐఐఎం కలకత్తా 23 ర్యాంకులోనూ నిలిచాయి. ఎఫ్‌టి ర్యాంకింగ్ 2018 ఆసియాలోనే టాప్ టెన్ బిజినెస్ స్కూల్స్... 1. షాంఘై జియాఓ టాంగ్ యూనివర్సిటీ, ఆంటాయ్ – చైనా 2. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అహ్మదాబాద్ – ఇండియా 3. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ కలకత్తా – ఇండియా 4.స్కేమ బిజినెస్ స్కూల్ – చైనా 5. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ బెంగుళూరు – ఇండియా 6. టోంగ్జీ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్ అండ్ మనేజ్మెంట్ – చైనా 7. గ్రేనోబెల్ ఎకోల్ డి మేనేజ్మెంట్ – సింగపూర్ 8. ఐక్యూఎస్–ఎఫ్జెయు–యుఎస్ఎఫ్ – తైవాన్ 9. హల్ట్ ఇంటర్నేషనల్ బిజినెస్ స్కూల్ – చైనా 10. సింగపూర్ మేనేజ్మెంట్ యూనివర్సిటీ, లీ కాంగ్ చైనా– సింగపూర్. రెండు వేర్వేరు అధ్యయనాలను అనుసరించి బిజినెస్ స్కూల్స్‌కి ఈ ర్యాంకులు ఇచ్చారు. ఒకటి బిజినెస్ స్కూల్స్ నిర్వహించే అధ్యయనం అయితే, మరొకటి 2015లో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన పూర్వ విద్యార్థుల అధ్యయనం ద్వారా కేటాయించే ర్యాంకులు. 2015 పూర్వ విద్యార్థుల సర్వే ప్రకారం వివిధ బిజినెస్ స్కూల్స్‌లో బోధించే సబ్జెక్టులఅనుసారం ఎకనామిక్స్ బోధనలో నంబర్ వన్ ర్యాంకునీ, ఫైనాన్స్ సబ్జెక్టు బోధనలో ఏడవ ర్యాంకునీ ఐఐఎం కలకత్తా కైవసం చేసుకుంది. టాప్ టెన్ బిజినెస్ స్కూల్స్‌లో బోధించే వివిధ సబ్జెక్టుల ఆధారంగా ఈ ర్యాంకులు ఇస్తారు. విద్యాబోధన, వసతులు, స్పోర్ట్స్ తదితర అంశాల్లో అంతర్జాతీయ ప్రమాణాలు పాటించడం వల్ల అత్యధిక మంది విదేశీ విద్యార్థులను ఈ యూనివర్సిటీలు ఆకర్షిస్తున్నాయి. అంతర్జాతీయ ప్రమాణాల కోసం (సెమ్స్, ఐఎస్‌సిపి(యూరప్)తో సంయుక్తంగా నిర్వహిస్తోన్న డబుల్ డిగ్రీ కార్యక్రమాలు విద్యాప్రమాణాలు పెంచడానికి దోహదపడుతున్నాయి. దీంతో పాటు ప్రపంచప్రసిద్ధ యూనివర్సిటీలతో కలిసి చేస్తోన్న స్టూడెంట్స్ ఎక్సేంజ్ ప్రోగ్రాం కూడా ఈ విజయానికి కారణం. ప్రస్తుతం ఐఐఎం కలకత్తా మరో 100 బిజినెస్ స్కూల్స్‌తో కలిసి స్టుడెంట్ ఎక్చేంజ్ కార్యక్రమం ప్రతియేటా నిర్వహిస్తోంది. 2017–18లో ఐఐఎం కలకత్తా నుంచి 133 మంది విద్యార్థులు స్టూడెంట్ ఎక్చేంచ్ కార్యక్రమంలో భాగమయ్యారు. భాగస్వామ్య స్కూల్స్ నుంచి 87 మంది విద్యార్థులు ఐఐఎం కలకత్తా లో అధ్యయనం చేసినట్టు వెల్లడించారు. -
హెచ్ఐవీ రోగులకు ‘ఆన్లైన్ వివాహ వేదిక’
తోడు కోసం వెతుక్కుంటున్న హెచ్ఐవీ/ఎయిడ్స్ రోగులకు ఆన్లైన్ వివాహ వేదికలు ఇప్పుడు అందుబాటులోకి వస్తున్నాయి.. సూరత్ కేంద్రంగా పనిచేసే గుజరాత్ స్టేట్ నెట్వర్క్ ఆఫ్ పీపుల్ సంస్థ(జీఎస్‌ఎన్‌పీ+) అహ్మదాబాద్ ఐఐఎం సాంకేతిక సహకారంతో తాజాగా ఆన్లైన్ వివాహ వేదికను ప్రారంభించింది. ఈ వ్యాధితో బాధపడుతున్న రోగులు తమ సమస్యను కుటుంబ సభ్యులకు కూడా చెప్పడానికి ఇష్టపడరు. చాలా గోప్యంగా వైద్యులను కలిసి అవసరమైన మందులు వాడుతుంటారు. ఇలాంటి వారికి అదే సమస్యతో బాధపడుతున్న వారు తోడుంటే, మానసిక స్థైరం కల్పిస్తే మెరుగైన జీవితాన్ని గడిపే అవకాశం ఉందన్న లక్ష్యంతో ఈ సంస్థ ఆన్లైన్ వివాహ సేవలు అందించేందుకు ముందుకు వచ్చింది. ఇప్పటికే ఈ రోగుల సమస్యలపై గుజరాత్ కేంద్రంగా ఈ సంస్థ పనిచేస్తోంది. గుజరాత్‌లోనే 68 వేల మంది ఏఆర్టీ సెంటర్‌కు వెళ్తున్నారని జీఎస్‌ఎన్‌పీ వ్యవస్థాపకురాలు దక్షా పటేల్ తెలిపారు. పెళ్లి చేసుకోవాలనే ఆసక్తి ఉన్న హెచ్ఐవీ పాజిటివ్ రోగులతో ఇప్పటికే జీఎస్‌ఎన్‌పీ+ ఆరు వివాహ వేదికలను నిర్వహించింది. గత పదేళ్లలో ఈ వేదికల ద్వారా 245 మంది వివాహం చేసుకున్నారు. వివాహ వేదికలో 1900 మంది రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. మ్యాట్రీమోనీ సర్వీసును ప్రారంభించాలని అనేక మంది ఒత్తిడి తేవడంతో ఆన్లైన్ సేవలు ప్రారంభించినట్లు నిర్వాహకులు తెలిపారు. పెళ్లి చేసుకోవాలనుకుంటున్న వారి ఇరువురి కుటుంబాల్లోని పెద్దలను ముందు కలిసి ఈ విషయం చెబుతాం..భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఇటువంటి జాగ్రత్తలు తీసుకుంటామని తెలిపారు. ఆసక్తి ఉన్న వారు www.gsnpplus.orgలో రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశాన్ని త్వరలో కల్పిస్తున్నారు. ఇలా మొదలైంది రాసిక్ భువా అనే యువకుడికి వివాహం నిశ్చయం అయిన తర్వాత హెచ్ఐవీ ఉన్నట్లు పరీక్షల్లో తేలింది. దీంతో ఆ వివాహాన్ని రద్దు చేసుకున్నాడు. హెచ్ఐవీ రోగులకు భువా అప్పటి నుంచి కౌన్సిలింగ్ మొదలు పెట్టాడు. నవశ్రీ అనే యువతి అతడ్ని కలిసింది. తర్వాత ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. మ్యాట్రీమోనియల్ సర్వీసు, తర్వాత ఆన్లైన్ వివాహ వేదిక ప్రారంభించడానికి ఈ సంఘటనే తమకు ప్రేరణ అని జీఎస్‌ఎన్‌పీ+ నిర్వాహకులు తెలిపారు. -
బాహుబలి.. ఓ పాఠం!
‘బాహుబలి’ సినిమా ఖాతాలో మరో రికార్డు చేరింది. అదేంటంటే.. ‘బాహుబలి’ సినిమా సక్సెస్‌ను పాఠంగా చెప్పబోతున్నారు. ఈ చిత్ర విజయాన్ని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అహ్మదాబాద్ (ఐఐఎమ్ఎ) ఓ కేస్ స్టడీగా తీసుకుని, పరిశోధన చేయనున్నట్లు అక్కడి ప్రొఫెసర్ భరతన్ కందస్వామి పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ– ‘‘సీక్వెల్‌గా వచ్చిన ‘బాహుబలి’ చక్కని మార్కెటింగ్ స్ట్రాటజీతో మంచి వసూళ్లు రాబట్టింది. సీక్వెల్స్ తీస్తున్నప్పుడు ఫస్ట్ పార్ట్ సక్సెస్ అయితే రెండో పార్ట్‌కి పబ్లిసిటీ ఈజీగా వస్తుంది. మార్కెటింగ్ సులువు అవుతుంది. ప్రధానంగా నేను సీక్వెల్స్ నిర్మాణం, మార్కెటింగ్ మంత్ర, కలెక్షన్స్ మీద దృష్టి పెట్టబోతున్నాను. ఈ విషయాల్లో అవగాహన కల్పించడంతో పాటు విద్యార్థులకు డిజిటల్ మార్కెట్ గురించి కూడా చెబుతాం. సినిమా ఇండస్ట్రీ గురించి అన్ని కోణాల నుంచి విద్యార్థులకు తెలియజేయనున్నాం.అందుకే సక్సెస్ సాధించిన ‘బాహుబలి’ సినిమాను ఓ కేస్ స్టడీగా తీసుకోవాలని నిర్ణయించుకున్నాం’’ అన్నారు. రాజమౌళి దర్శకత్వంలో శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మించిన ‘బాహుబలి’ బాక్సాఫీస్ దగ్గర ఎంతటి ప్రభంజనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ, నాజర్, సత్యరాజ్ ముఖ్య తారలుగా నటించిన ఈ సినిమా తెలుగు ఇండస్ట్రీకి గర్వకారణంగా నిలిచింది. -
ఐఐఎం–ఏ డైరెక్టర్ ఇన్చార్జ్గా డిసౌజా
అహ్మదాబాద్: ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్–అహ్మదాబాద్(ఐఐఎం–ఏ) నూతన డైరెక్టర్ ఇన్చార్జ్గా ప్రొఫెసర్ ఎరోల్ డిసౌజా నియమితులయ్యారు. ఈయన నియామకం సెప్టెంబర్ 2 నుంచి అమల్లోకి రానుంది. ప్రస్తుతం ఈయన అదే విద్యాసంస్థలో ఎకనమిక్స్ విభాగాధిపతిగా విధులు నిర్వర్తిస్తున్నారు. ముంబై యూనివర్సిటీలో ఎకనమిక్స్, స్టాటిస్టిక్స్ పూర్తిచేసిన ఈయన అక్కడ ఎంఏ (ఎకనమిక్స్)లో గోల్డ్ మెడల్ సాధించారు. ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్డీ పట్టా పొందారు. ముంబై వర్సిటీ, పారిస్‌లోని యూనివర్సిటీ సైన్సెస్‌లో చైర్ ప్రొఫెసర్‌గా పనిచేశారు. సిమ్లాలోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీస్‌లో విజిటింగ్ ప్రొఫెసర్‌గా చేశారు. -
ఐఐఎం-ఎలో టాప్ రిక్రూటర్‌గా అమెజాన్
న్యూఢిల్లీ: ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఐఐఎం అహమ్మదాబాద్‌లో టాప్ రిక్రూటర్‌గా నిలిచింది. ఫైనల్ ఇయర్ పోస్ట్-గ్రాడ్యుయేట్ విద్యార్థులకు 18 ఉద్యోగాలు ఆఫర్ చేసిన అమెజాన్ ఈ ఏడాది టాప్ ప్లేస్‌లో నిలిచింది. ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ సంస్థలో పీజీ ప్రోగ్రాం 2017 విద్యార్థులు 18మందిని టాప్ ఉద్యోగాలకు ఎంపిక చేసింది. మరోవైపు మెకిన్సే & కో 15 ఆఫర్లతో రెండవ స్థానంలో నిలిచింది. 100కు పైగా సంస్థలు ఐఐఎం-ఏ వద్ద ఆఖరి రౌండ్ నియామకాల్లో పాల్గొన్నాయి. యాక్సెంచర్ స్ట్రాటజీ, , బైన్ & కంపెనీ, మెకిన్సే & కంపెనీ, బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ లాంటి కన్సల్టింగ్ సంస్థలు ఇక్కడి విద్యార్థులను ఎంపిక చేశాయి. గోల్డ్‌మన్ సాచ్స్, 9, హెచ్‌యూఎల్ 7 ఆఫర్లు అందించగా, ప్రోక్టర్ & గాంబుల్, ఎస్సీ జాన్సన్ , శామ్సంగ్ 6 గురు ఐఐఎంలకు అవకాశాలను ఆఫర్ చేశాయి. -
మనోళ్లు మెరిశారు
* ‘క్యాట్’లో ముగ్గురికి 100 పర్సంటైల్ * ఐఐఎం అహ్మదాబాద్‌లో ఎంబీఏ చేయాలనుకుంటున్న తేజ, కృష్ణ సాక్షి, హైదరాబాద్, కాకినాడ/సామర్లకోట, న్యూస్‌లైన్: ప్రతిష్టాత్మక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్(ఐఐఎం)లలో ప్రవేశం కోసం గత ఏడాది నిర్వహించిన ఉమ్మడి ప్రవేశ పరీక్ష (క్యాట్- 2013) ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. ఐఐఎం ఇండోర్ విడుదల చేసిన ఈ ఫలితాల్లో రాష్ట్రానికి చెందిన ముగ్గురికి 100 పర్సంటైల్ లభించింది. తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట యువకుడు తోటకూర శివసూర్యతేజ, హైదరాబాద్ నుంచి పిల్లుట్ల కృష్ణ కౌండిన్య, విజయవాడకు చెందిన ఇమనేని కార్తీక్ కుమార్ 100 పర్సంటైల్‌తో టాపర్లుగా నిలిచారు. వీరితో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన మరో ఐదుగురు 100 పర్సంటైల్ సాధించారు. అహ్మదాబాద్ ఐఐఎంలో ఎంబీఏలో చేరుతానని శివసూర్య తేజ తెలిపాడు. తేజ ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఇన్ఫోసిస్‌లో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పని చేస్తున్నాడు. తేజ తండ్రి సాయిరామకృష్ణ గణిత ఉపాధ్యాయుడు. మరో టాపర్ కృష్ణ కౌండిన్య ఐఐటీ ముంబైలో బీటెక్(కంప్యూటర్ సైన్స్) ఫైనలియర్ చదువుతున్నాడు. వీరితో పాటు కాకినాడ జేఎన్టీయూలో కంప్యూటర్ సైన్సు డిగ్రీ ఆఖరి సంవత్సరం చదువుతున్న రాజమండ్రి యువకుడు ద్వారంపూడి యశ్వంత్‌రెడ్డి 99.7 పర్సంటైల్ సాధించగా, కృష్ణా జిల్లా నూజివీడు మండలం గొల్లపల్లికి చెందిన అవిర్నేని సాహితి 99.36 పర్సంటైల్ సాధించింది. దేశవ్యాప్తంగా ఐఐఎంలలో ఉన్న 3,335 ఎంబీఏ సీట్లలో ప్రవేశాల కోసం గత ఏడాది అక్టోబర్ 16 నుంచి నవంబర్ 11 వరకు 40 పట్టణాల్లో నిర్వహించిన క్యాట్ పరీక్షకు 1.94 లక్షల మంది హాజర య్యారు. వివేకానందుడే స్ఫూర్తి ‘ఎటువంటి శిక్షణ లేకుండా, ఆన్లైన్లో కాకినాడలోని టైమ్ ఇనిస్టిట్యూట్ పెట్టిన టెస్టుల సహకారంతో, పట్టుదలతో ఈ విజయం సాధించాను. గతంలో 99 పర్సంటైల్ సాధించినప్పటికీ, అహ్మదాబాద్ ఐఐఎంలో సీటు కోసం మళ్లీ క్యాట్ రాశాను. రాష్ట్రానికి ఆర్థిక సలహాదారు కావాలన్నది నా ఆశయం. అహ్మదాబాద్ ఐఐఎంలో ఎంబీఏ చదవడం ద్వారా ఆర్థిక, రాజకీయ అంశాలతో పాటు దేశ ప్రతిష్టకు సంబంధించిన అంశాలు తెలుస్తాయి. ఆర్థిక సలహాదారు కావడానికి అవసరమైన అంశాలు నేర్చుకోవచ్చు. తరువాత సులభంగా ఐఏఎస్ పూర్తి చేయొచ్చు. మా నాన్న నాకు చదువులో పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. వివేకానందుని సూక్తులు ఎంతో స్ఫూర్తినిచ్చాయి. మంచి పుస్తకాలతో పాటు ఆన్లైన్లో లభించే సమాచారం తెలుసుకోవడం ద్వారా మంచి ఫలితాలు వస్తాయి. ప్రతి అంశాన్నీ విశ్లేషించి, అధ్యయనం చేయడం ద్వారా విజయం సాధించవచ్చు. మా నాన్న గణిత ఉపాధ్యాయుడు కావడంతో ఇంట్లో అనేక రకాల పుస్తకాలు ఉన్నాయి. నా విజయం వెనుక నా తల్లి సహకారం ఎంతో ఉంది. వారితో పాటు పినతండ్రి గంగాధర్, తమ్ముడి ప్రోత్సాహం ఉంది’ - తోటకూర శివసూర్యతేజ ఇంతకంటే ఆనందమేముంటుంది? ‘తేజ సాధించిన విజయాన్ని మాటల్లో వర్ణించలేను. చిన్నతనం నుంచీ మంచి మార్కులతో పాస్ కావడం వల్ల తేజ చదువుకు ఎక్కువ ఖర్చు చేయవలసిన అవసరం కలగలేదు. పదో తరగతిలో మంచి మార్కులు రావడంతో కాకినాడ ‘ఆదిత్య’లో ఉచితంగా సీటు వచ్చింది. అదేవిధంగా ఇంటర్లో మంచి మార్కులు సాధించడంతో ప్రభుత్వ కోటాలో ఇంజనీరింగ్ సీటు వచ్చింది. అలా తేజ చదువుకు ఎక్కువ ఖర్చు చేయవలసిన అవసరం కలగలేదు. నా అభిప్రాయాలను ఎప్పుడూ నా కుమారులపై రుద్దలేదు. వారి ఇష్టం మేరకు చదువు కోవాలని సూచించాను. వారి చదువుకోసం అవసరమైన వాతావరణం కల్పించాం. ఇంట్లో చిన్న గంథాలయం ఉండటం తేజకు బాగా ఉపయోగపడింది’ - తోటకూర సాయిరామకృష్ణ ఐఐఎం అహ్మదాబాద్‌లోనే ‘క్యాట్ 2013లో టాపర్‌గా 100 పర్సంటైల్ సాధించడం చాలా సంతోషంగా ఉంది. ఐఐఎం అహ్మదాబాద్‌లో ఎంబీఏ చేయాలనుకుంటున్నాను’ - కృష్ణ కౌండిన్య