గుడ్ గవర్నెన్స్‌పై సీఎం జగన్‌కు నివేదిక సమర్పిస్తున్న అహ్మదాబాద్ ఐఐఎం ప్రొఫెసర్ సుందరవల్లి నారాయణ స్వామి
పై స్థాయిలో 50 శాతం అవినీతిని నిర్మూలించాం. మిగిలిన స్థాయిల్లో ఉన్న 50 శాతం అవినీతిని నిర్మూలించాలి. ఇందులో భాగంగా ప్రతి ప్రభుత్వ విభాగంలోనూ రివర్స్ టెండరింగ్ నిర్వహించాలి. టీటీడీతో సహా అన్ని విభాగాలు టెండర్ విలువ కోటి రూపాయలు దాటితే రివర్స్ టెండరింగ్‌కు వెళ్లాలి.
– సీఎం వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన కేసుల్లో వెంటనే చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పష్టం చేశారు. ఇందుకోసం దిశ చట్టం తరహాలో అసెంబ్లీలో చట్టం చేసేందుకు వీలుగా బిల్లు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. కొన్ని కేసుల విచారణ 25 ఏళ్లుగా సాగుతోందంటే.. అవినీతి కేసుల విషయంలో సీరియస్‌గా లేమనే సంకేతాలు వెళ్తాయని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లో అవినీతి ఉండకూడదని, కూకటివేళ్లతో సహా పెకిలించాల్సిందేనని స్పష్టం చేశారు. అవినీతి నిరోధానికి తీసుకున్న చర్యలు, 14400 కాల్ సెంటర్, కేబినెట్ సబ్ కమిటీ నివేదిక, ఐఐఎం అహ్మదాబాద్ నివేదిక రివర్స్ టెండరింగ్, జ్యుడిషియల్ ప్రివ్యూ తదితర అంశాలపై సోమవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో సమగ్ర సమీక్ష నిర్వహించారు. ‘గత ఏడాది నవంబర్‌లో అవినీతికి సంబంధించి కాల్ సెంటర్ 14400 ప్రారంభించాం. ఇప్పటి వరకు 44,999 కాల్స్ వచ్చాయి. ఇందులో అవినీతికి సంబంధించిన అంశాలు 1,747 కాగా..1,712 పరిష్కరించాం. 35 పెండింగ్‌లో ఉన్నాయి’ అని అధికారులు వివరించారు. సమీక్ష వివరాలు ఇలా ఉన్నాయి.
ఫిర్యాదుల మానిటరింగ్ బలంగా ఉండాలి
► 1902 నంబర్‌ను ఏసీబీతో (14400) అనుసంధానం చేయాలి. గ్రామ, వార్డు సచివాలయాల స్థాయి నుంచి అవినీతిపై వచ్చే ఫిర్యాదులను కూడా స్వీకరించాలి. ఫిర్యాదులను మానిటరింగ్ చేసే వ్యవస్థ బలంగా ఉండాలి. దీనికి కలెక్టర్ కార్యాలయాలను కూడా అనుసంధానం చేయాలి.
► టౌన్ ప్లానింగ్, సబ్ రిజిస్ట్రార్, ఎమ్మార్వో, ఎంపీడీఓ, టౌన్ ప్లానింగ్ కార్యాలయాల్లో అవినీతి ఆనవాళ్లు ఉండకూడదు. దీనిపై అవినీతికి ఆస్కారం లేని విధానాలతో మనం ఫోకస్‌గా ముందుకు వెళ్లాలి. అవినీతికి పాల్పడాలంటే భయపడే పరిస్థితి రావాలి.
► 14400 నంబర్‌పై మరింత ప్రచారం నిర్వహించాలి. పర్మినెంట్ హోర్డింగ్స్ పెట్టాలి.
గత ప్రభుత్వానికి, మన ప్రభుత్వానికీ ఇదీ తేడా
► కర్నూలు జిల్లా పిన్నాపురం విద్యుత్ ప్రాజెక్టుకు గత ప్రభుత్వం 4,766.28 ఎకరాల భూమిని ఇచ్చింది. అప్పట్లో ఎకరాకు కంపెనీ చెల్లించే మొత్తం రూ.2.5 లక్షలు మాత్రమే. మన ప్రభుత్వం సంప్రదింపులు జరిపి, ఆ మొత్తాన్ని రూ.5 లక్షలకు పెంచింది. దీని వల్ల అదనంగా రూ.119 కోట్ల ఆదాయం వస్తోంది.
► సోలార్/విండ్ కింద ఉత్పత్తి చేసే 1550 మెగావాట్ల ఉత్పత్తికి గాను మెగావాట్‌కు రూ.1 లక్ష చెల్లించేందుకు కంపెనీ అంగీకరించింది. దీని వల్ల ఏడాదికి రూ.15.5 కోట్ల చొప్పున 28 ఏళ్లలో రూ.322 కోట్లు ప్రభుత్వానికి వస్తాయి.
► రివర్స్ పంపింగ్ ద్వారా ఉత్పత్తి చేయనున్న 1680 మెగావాట్ల కరెంట్‌కు సంబంధించి.. మెగావాట్‌కు మొదటి పాతికేళ్లలో రూ.లక్ష, తద్వారా ఏడాదికి రూ.16.8 కోట్లు, 25 ఏళ్ల తర్వాత రూ.2 లక్షలు చొప్పున ఏడాదికి రూ.33.6 కోట్ల మేర ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. దీని వల్ల ప్రభుత్వానికి రూ.2,940 కోట్లు ఆదాయం వస్తుంది. ఈ ప్రభుత్వం వచ్చాక అదే కంపెనీతో సంప్రదింపుల కారణంగా రూ.3,381 కోట్లు ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. ఇందుకు కృషి చేసిన అధికారులను అభినందిస్తున్నా.
► భోగాపురం విమానాశ్రయ ప్రాజెక్టుకు గత ప్రభుత్వం 2703 ఎకరాలను కేటాయిస్తే.. అదే కంపెనీతో ఈ ప్రభుత్వం సంప్రదింపులు జరపగా, 2203 ఎకరాల్లో ఈ ప్రాజెక్టును పూర్తి చేయడానికి ఒప్పుకుంది. తద్వారా 500 ఎకరాల భూమి ప్రభుత్వానికి మిగిలింది. ఎకరాకు రూ.3 కోట్లు వేసుకున్నా రూ.1500 కోట్లు మిగిలినట్లే.
788 పనులకు రివర్స్ టెండరింగ్
► ‘మొత్తంగా 788 పనులకు రివర్స్ టెండరింగ్ నిర్వహించామని, సాధారణ టెండర్ల ప్రక్రియ ద్వారా 7.7 శాతం మిగులు ఉండగా, రివర్స్ టెండరింగ్ ద్వారా 15.01 శాతం మిగులు ఉందని అధికారులు వివరించారు.
► రూ.100 కోట్లు దాటిన ఏ ప్రాజెక్టుకైనా జ్యుడిషియల్ ప్రివ్యూకు వెళ్తున్నాం. 2019 ఆగస్టు నుంచి 2020 ఆగస్టు వరకు రూ.14,285 కోట్ల విలువైన 45 పనులు జ్యుడిషియల్ ప్రివ్యూకు వెళ్లాయి’ అని అధికారులు తెలిపారు.
సీఎంకు అహ్మదాబాద్ ఐఐఎం నివేదిక
► అవినీతిని నిరోధించడానికి సంబంధించి గతంలో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం గుడ్ గవర్నెన్స్‌పై ప్రతిష్టాత్మక సంస్థ అహ్మదాబాద్ ఐఐఎం ప్రొఫెసర్ సుందరవల్లి నారాయణ స్వామి సమీక్షకు ముందు సీఎం జగన్‌కు నివేదిక సమర్పించారు.
► ఎమ్మార్వో, ఎంపీడీఓ, సబ్ రిజిస్టార్, మున్సిపల్, టౌన్ ప్లానింగ్ కార్యాలయాలను యూనిట్‌గా తీసుకుని, సిబ్బంది విధులు, బాధ్యతల్లో స్పష్టత ఇవ్వడంతో పాటు, అవినీతికి ఆస్కారమున్న అంశాలను గుర్తించి ఆ మేరకు తగిన చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ స్పష్టం చేశారు.
► ఈ సమీక్షలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్, ఏసీబీ డీజీ పీ.ఎస్.ఆర్. ఆంజనేయులు, వివిధ శాఖల అధికారులు, ఐఐఎం అహ్మదాబాద్ ప్రతినిధులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment