మ్యాట్రిమోనిలో నకిలీ ప్రొఫైల్స్‌తో మోసం
ఇద్దరిని అరెస్టు చేసిన రాచకొండ సైబర్ కాప్స్
సాక్షి, హైదరాబాద్: వాయిస్ ఛేంజ్ ఫీచర్ సాంకేతికతతో అమ్మాయిల గొంతులాగా మాట్లాడుతూ మోసాలకు పాల్పడుతున్న ఇద్దరు సైబర్ నేరస్తులను రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు పట్టుకున్నారు. ఇన్‌స్పెక్టర్ కాశీ విశ్వనాథ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని తూర్పు గోదావరి జిల్లా కాకినాడకు చెందిన కోమలి సూర్య ప్రకాశ్, శెట్టి సతీష్‌లు ఇంటర్నెట్ నుంచి అమ్మాయిల ఫొటోలను డౌన్‌లోడ్ చేసి నకిలీ పేరు, ఇతరత్రా వివరాలతో మ్యాట్రిమోనీ సైట్లలో తమ పేర్లను నమోదు చేసుకున్నారు.
నకిలీ ప్రొఫైల్స్‌ను మ్యాట్రిమోనిలో అబ్బాయిలకు పంపించేవారు. తీయని మాటలతో వాట్సాప్ చాట్‌లు, ఫోన్లు మాట్లాడుతుండేవారు. కొద్ది రోజుల తర్వాత పెళ్లి ప్రస్తావన తీసుకొస్తుంటారు. బాధితుల కుటుంబ వివరాలు, ఫొటోలను వాట్సాప్ ద్వారా సేకరించేవారు. తల్లిదండ్రులకు అనారోగ్యం, చదువుల ఫీజులు, వ్యాపారంలో నష్టాలు అంటూ రకరకాల కారణాలు చెప్పి డబ్బులు వసూలు చేసేవారు.
ఈ క్రమంలో రూ.13.27 లక్షలు మోసపోయిన బాధితులు రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు శుక్రవారం ఇద్దరు నిందితులు సూర్య ప్రకాశ్, సతీష్‌లను అరెస్టు చేశారు. ఇప్పటివరకు ఈ నిందితులు రామగుండం ఎన్‌టీపీసీ, సైబరాబాద్, రాచకొండ సైబర్ క్రైమ్ ఠాణాల పరిధిలోని పలువురు బాధితుల నుంచి ఇదే తరహాలో రూ.33.68 లక్షలు మోసం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment