ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, హైదరాబాద్: నీ ప్రొఫైల్ నాకు నచ్చింది... నిన్నే పెళ్లాడుతానంటూ మ్యాట్రీమోనీ సైట్‌లో నగరానికి చెందిన యువతి ప్రొఫైల్ చూసి పరిచయం పెంచుకున్న ఓ సైబర్ నేరగాడు ఏకంగా రూ.ఏడు లక్షల వరకు మోసం చేశాడు. సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపిన మేరకు.. నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రి లో మేనేజర్‌గా పనిచేస్తున్న బాధితురాలు జీవన్‌సాతి మ్యాట్రీమోనీ వెబ్‌సైట్‌లో ప్రొఫైల్‌ను ఆప్‌లోడ్ చేసింది.
బాగా నచ్చారంటూ ట్రాప్
ఆమె ప్రొఫైల్ చూసిన ఓ వ్యక్తి తాను ఐక్యరాజ్యసమితి తరపున యమన్ దేశంలో డాక్టర్‌గా పనిచేస్తున్నానని పరిచయం పెంచుకున్నాడు. మీరు బాగా నచ్చారని, పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. తాను పుట్టింది భారతదేశంలోనే అయినా విదేశాలలో చదువుకొని ఉద్యోగం చేస్తున్నానంటూ నమ్మించాడు. అయితే తనకు ఇక్కడ ఉండాలని లేదని ఉద్యోగం వదులుకొని వస్తానంటూ నమ్మించడంతో బాధితురాలు పెళ్లికి అంగీకరించింది. కొన్నాళ్లపాటు చాటింగ్ చేసి తరువాత ఫోన్ నెంబర్లను మార్చుకొని వాట్సాప్ చాటింగ్‌లు, ఫోన్లలో పరిచయం పెంచుకున్నారు.
మోసం చేశారిలా..
♦ తాను ఉద్యోగ పదవీ విరమణ చేశానని, నాకు రావల్సిన బకాయిలు, జమ చేసుకున్న మొత్తం కలిపితే 4.5 లక్షల డాలర్లు ఉన్నాయని చెప్పాడు. వీటిని ముందుగానే తాను ఇండియాకు పంపించేస్తానంటూ నమ్మించాడు. డాలర్లను సేఫ్‌లాకర్లో ఉంచి తాళం చెవులతో పాటు మా స్నేహితుడైన రోజర్ బెకరీతో ఇండియాకు పంపిస్తానంటూ ఫోన్‌చేసి చెప్పాడు.
♦ రెండు రోజుల తరువాత ఢిల్లీ ఎయిర్‌పోర్టు నుంచి తాను రోజర్ మాట్లాడుతున్నానంటూ బాధితురాలికి ఫోన్‌కాల్ వచ్చింది. తనను ఢిల్లీ ఎయిర్‌పోర్టులో కస్టమ్స్ అధికారులు పట్టుకొని కస్టమ్స్ డ్యూటీ కట్టాలంటూ ఒత్తిడి చేస్తున్నారని, నా బ్యాంకు ఖాతాలో రూ.1.3 లక్షలు జమచేస్తే నేను బయటకు వచ్చి మీకు లాకర్‌ను అప్పగిస్తానని చెప్పాడు. దీంతో ఆమె ఆ డబ్బును డిపాజిట్ చేసింది.
♦ కొంతసేపటికి ఫోన్‌కాల్ చేసి తిరిగి స్కానింగ్‌లో డాలర్లు, డబ్బులు లాకర్లో ఉండడాన్ని కస్టమ్స్ అధికారులు గుర్తించారని, డాలర్లు ఇలా నేరుగా పంపించకూడదని చెబుతున్నారని చెప్పుకొచ్చాడు. రూ. 3.75 లక్ష లు ఇస్తే వదిలేస్తామంటున్నారంటూ చెప్పడంతో ఆ డబ్బును కూడా జమ చేసింది.
♦ యాంటీ టెర్రరిస్ట్ సర్టిఫికెట్ లేదంటూ మళ్లీ కస్టమ్స్‌లో తిరకాసు పెడుతున్నారని, ఈసారి రూ. 3.5 లక్షల ఇవ్వాలంటూ ఫోన్ చేశాడు. తన వద్ద అంత డబ్బు లేదంటూ బాధితురాలు చేతులెత్తేసే ప్రయత్నం చేసింది. రూ.2 లక్షలు ఏర్పాటు చేస్తే మిగతాది నేను సమకూర్చి ఇక్కడి నుంచి బయటపడుతానంటూ ఆ డబ్బును లాగేశాడు.
♦ ఎయిర్‌పోర్టు నుంచి బయటకు వచ్చానని, అయితే లాకర్‌లో నిండుగా డాలర్లు ఉన్నాయని, వాటిని హైదరాబాద్‌కు వచ్చి అందిస్తానని చెప్పాడు. అయితే ప్రస్తుతానికి విమాన టిక్కెట్లు, భోజనం ఖర్చుల కోసం రూ. 25 వేలు ఇవ్వాలంటూ కోరడంతో వాటిని కూడా ఆమె బ్యాంకులో డిపాజిట్ చేసింది.
♦ ఆ తర్వాత సైబర్‌చీటర్లు సెల్‌ఫోన్లు స్విచ్ ఆఫ్ చేశారు. మోసపోయానని గుర్తించిన బాధితురాలు సీసీఎస్ సైబర్‌క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. ఇన్‌స్పెక్టర్ కేవీఎం ప్రసాద్ కేసు దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment