జోడీల ముసుగులో కేడీలు | Scams in online Swayamvaram Matrimony Websites | Sakshi
Sakshi News home page

జోడీల ముసుగులో కేడీలు

Published Thu, Sep 15 2022 6:30 AM | Last Updated on Thu, Sep 15 2022 8:26 AM

Scams in online Swayamvaram Matrimony Websites - Sakshi

(బీవీ రాఘవరెడ్డి): అప్పట్లో పెళ్లిళ్ల పేరయ్యలు, ఆ మ్యారేజి బ్యూరోలు సంబంధాలు కుదర్చటంలో ముఖ్య పాత్ర పోషించగా టెక్నాలజీ పెరిగాక వెబ్‌సైట్‌లు, యాప్‌లు వచ్చేశాయి. కాలికి బలపం కట్టుకుని తిరిగే పని లేకుండా ఇంట్లో కూర్చుని ఇంటిల్లిపాదీ తిలకించేలా చౌకగా సేవలందిస్తున్నాయి. దేశంలో ప్రముఖ పెళ్లిళ్ల వెబ్‌సైట్‌లను పరిశీలిస్తే భారత్‌ మ్యాట్రిమోనికి కోటి మందికి పైగా వినియోగదారులున్నారు.

మ్యాచ్‌ఫైండర్‌ మ్యాట్రిమోనిలో రెండు వేల ప్రాంతాలకు చెందిన యువతీ యువకులు రిజిస్టర్‌ చేసుకున్నారు. 2002లో ప్రారంభించిన ఫ్రీ వెబ్‌సైట్‌ వివాహ్‌ డాట్‌కామ్‌ ఉచితంగానే సేవలందిస్తోంది. వెబ్‌గేట్‌ డాట్‌కామ్‌ రోజుకు 600 మందికి పైగా ఖాతాదారులకు సేవలు అందిస్తున్నట్లు చెబుతోంది. 1996లో ప్రారంభమైన షాదీ డాట్‌కామ్‌ దేశంలోనే మొదటిదిగా చెబుతారు. కమ్యూనిటీ మ్యాట్రిమోనికి దేశంలో 140 శాఖలున్నాయి.

డైవర్సీ మ్యాట్రిమోని యాప్‌ను 5 లక్షల మంది డౌన్‌లోడ్‌ చేసుకుని ఉపయోగిస్తున్నారు. వెబ్‌సైట్‌ నిర్వాహకుల్లో కొందరు ఉచితంగా సేవలందిస్తుంటే మిగిలిన వారు రూ.500 నుంచి రూ.5,000 వరకు వసూలు చేస్తున్నారు. మొబైల్‌లో యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకుని ఫీజు చెల్లిస్తే సరైన జోడీని వెతికి పెడతామంటున్నారు. విద్యార్హతలు, ఉద్యోగం, ఇష్టాయిష్టాలు, కుల గోత్రాలు, జాతకచక్రాలు, ఆర్థిక స్థితి, కుటుంబ నేపథ్యం లాంటి వివరాలన్నీ ఫొటోలు, ఫోన్‌ నంబర్లతో సహా వెబ్‌సైట్లు అందుబాటులో ఉంచుతున్నాయి. యువతీ యువకుల ప్రాధాన్యతలకు అనుగుణంగా పర్‌ఫెక్ట్‌ మ్యాచ్‌లను సూచిస్తున్నాయి. మ్యాట్రిమోనీ వెబ్‌సైట్స్‌లో అబ్బాయిల కంటే అమ్మాయిలే చురుగ్గా ఉంటున్నారు.  

ఆచి తూచి అడుగేయాల్సిందే... 
ఇదంతా ఒకఎత్తు కాగా పెళ్లిళ్ల వెబ్‌సైట్‌లను ఆసరాగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్న కేసులు పెరుగుతున్నాయి. నకిలీ ప్రొఫైల్స్, ఫొటోలతో రిజిస్టర్‌ చేసుకుని అమాయకులను మోసగిస్తున్నారు. మార్ఫింగ్‌ సర్టిఫికెట్లు అప్‌లోడ్‌ చేసి కొందరు కేటుగాళ్లు టోకరా వేస్తున్నారు. వివరాలు సేకరించి బహుమతులు పంపి ఎర వేస్తుంటారు. లైంగిక దాడులకు పాల్పడుతున్న ఘటనలూ వెలుగు చూస్తున్నాయి. ఇలాంటి వాటి బారిన పడకుండా అప్రమత్తత అవసరం.

సమాచారం కోసమే మ్యాట్రిమోని సైట్లను ఉపయోగించుకోవాలి. పెద్దల ద్వారా ప్రత్యక్షంగా పూర్తి వివరాలు నిర్ధారించుకున్న తర్వాతే ఒక నిర్ణయానికి రావాలి. ఫోన్‌ చేసి డబ్బులు అడగడం, వ్యక్తిగత ఫొటోలు పంపమనటం, హోటళ్లకు రావాలని కోరితే సందేహించాల్సిందే. ట్విట్టర్, ఫేస్‌బుక్‌ లాంటి సోషల్‌ మీడియా ఖాతాలను క్షుణ్నంగా పరిశీలించాలి. 

అమెరికా వెళ్దామని..
పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేటలోని రామిరెడ్డిపేటకు చెందిన రజని (పేరు మార్చాం) భర్తతో మనఃస్పర్థల కారణంగా విడాకులు తీసుకుంది. ఓ మ్యాట్రిమోని వెబ్‌సైట్‌ ద్వారా కొచ్చర్ల శ్రీకాంత్‌ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. పెళ్లి చేసుకుని అమెరికా వెళ్దామని చెప్పడంతో నమ్మింది. వీసా కావాలంటే బ్యాంకు ఖాతాలో పెద్ద మొత్తంలో డబ్బులు ఉండాలంటూ విడతల వారీగా రూ.48 లక్షలు కాజేసి ఫోన్‌ స్విచ్చాఫ్‌ చేశాడు.

బాధితురాలి ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన పోలీసులు నిందితుడు కాకినాడకు చెందిన వంశీకృష్ణగా గుర్తించారు. బీఫార్మసీ చదివి వ్యసనాలకు బానిసై మోసాల బాట పట్టాడు. అతడిపై హైదరాబాద్, రామగుండం, రాజమహేంద్రవరం, విశాఖపట్నం తదితర ప్రాంతాల్లో 2009 నుంచి 16కిపైగా చీటింగ్‌ కేసులు నమోదయ్యాయి. ప్రకాశం జిల్లాకు చెందిన ఓ యువతిని పెళ్లి చేసుకుని అమెరికా పేరుతో రూ.17.5 లక్షలు స్వాహా చేశాడు. ఈ ఏడాది జనవరి 30న పోలీసులు అరెస్టు చేయగా బెయిల్‌పై విడుదలై తిరిగి అదే పంథాలో నరసరావుపేట మహిళను మోసగించి పరారయ్యాడు.  

సంపన్న మహిళలపై వల  
మ్యాట్రిమోనియల్‌ సైట్ల ద్వారా 40 మంది మహిళలను మోసగించిన వ్యక్తిని ముంబై పోలీసులు అరెస్టు చేశారు. షేర్‌ మార్కెట్‌లో పెట్టుబడి పేరుతో తన వద్ద రూ.2.25 లక్షలు కాజేసినట్లు యువతి ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. విశాల్‌ సురేశ్‌ చవాన్‌ అలియాస్‌ అనురాగ్‌ చవాన్‌(34) మ్యాట్రిమోనియల్‌ వెబ్‌సైట్స్‌లో నకిలీ ఖాతాలు సృష్టించి సంపన్న మహిళలపై వల విసిరాడు. ఖరీదైన ఐ ఫోన్లను బహుమతిగా పంపి ఆకట్టుకునేవాడు. పెట్టుబడుల పేరుతో  డబ్బులు కాజేయడంతోపాటు, కొందర్ని హోటళ్లకు రప్పించుకుని లైంగిక దాడికి పాల్పడ్డాడు.  

మత్తుమందు ఇచ్చి.. 
పెళ్లిళ్ల వెబ్‌సైట్ల ద్వారా 12 మంది మహిళలను ఆకర్షించి లైంగిక వేధింపులకు పాల్పడ్డ ఓ మెకానికల్‌ ఇంజనీర్‌ను ముంబై పోలీసులు 2021 జూన్‌ 8న అరెస్టు చేశారు. మహేశ్‌ అలియాస్‌ కరణ్‌ గుప్తా మ్యాట్రిమోనియల్‌ వెబ్‌సైట్లలో నకిలీ ప్రొఫైల్స్‌తో రిజిస్టర్‌ చేసుకున్నాడు. మహిళలతో ఫోన్‌లో మాట్లాడి పబ్‌లు, రెస్టారెంట్లకు ఆహ్వానించేవాడు. మత్తుమందు కలిపిన డ్రింక్‌ తాగించి లైంగిక వేధింపులకు పాల్పడేవాడని వెల్లడైంది. హ్యాకర్‌గా పనిచేసిన అనుభవంతో తెలివిగా నేరాలకు పాల్పడేవాడు.  

గిఫ్ట్‌లు పంపి.. 
విశాఖకు చెందిన మీనాక్షి (పేరు మార్చాం) భర్త చనిపోవడంతో మాట్రిమోనీ డాట్‌కామ్‌ ద్వారా అమెరికాలోని ఓ సా‹ఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌తో పరిచయం పెంచుకుంది. అమెరికా నుంచి పలుసార్లు గిఫ్‌్టలు కూడా ఆమెకు అందాయి. కొన్నాళ్ల తర్వాత అత్యవసరమని చెప్పడంతో బాధితురాలు రూ.50 లక్షలు అతడికి ట్రాన్స్‌ఫర్‌ చేసింది. ఆ తర్వాత నుంచి నిందితుడి ఫోన్‌ పనిచేయలేదు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement