లెంక గిరీష్‌కుమార్ (ఫైల్‌ఫొటో)
రాజాం సిటీ/ రూరల్/ కాకినాడ: ఆ కుటుంబంతో పాటు పొరుగున ఉన్న ఏ ఒక్క గ్రామంలోనూ ‘డాక్టర్’ చదువు చదివినోళ్లు లేరు. నిరుపేద కుటుంబమైనా తమ కుమారుడిని డాక్టర్ చేయాలనే లక్ష్యంతో ఆ తల్లిదండ్రులు ఎంతో కష్టపడ్డారు. అతడిపైనే ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అయితే ఆ యువకుడు ప్రస్తుత విద్యావిధానంలో నెలకొన్న మానసిక ఒత్తిడిని జయించలేక.. ప్రాణాలు తీసుకున్నాడు. కుటుంబసభ్యులు, బంధువులు, స్నేహితులు, ఆ ఊరి ప్రజల ఆశల ను అడియాసలు చేస్తూ అనంతలోకాలకు వెళ్లిపోయాడు. కాకినాడ రంగరాయ వైద్య కళాశాల ద్వితీయ సంవత్సరం విద్యార్థి లెంకా గిరీష్‌నాయుడు(21) హాస్టల్‌పై నుంచి దూకి గురువారం రాత్రి ఆత్మహత్య చేసుకున్న సంఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. నిత్యం నవ్వుతూ సరదాగా, ఉత్సాహంగా ఉండే గిరీష్‌నాయుడు తమ మధ్య లేడన్న నిజాన్ని జీర్ణించుకోలేని విద్యార్థులు తీవ్ర విషాదంలో పడిపోయారు.
వ్యవసాయ కుటుంబం నుంచి...
శ్రీకాకుళం జిల్లా రాజాం మండలం అంతకాపల్లి పంచాయతీ మొగలి వలస గ్రామానికి చెందిన లెంక వెంకటరమణ, రాజేశ్వరి సాధారణ వ్యవసాయ కుటుంబానికి చెందినవారు. వీరి పెద్దకుమారుడు శ్రీధర్ విశాఖలో ఇంజినీరింగ్ చదువుతుండగా, రెండో కుమారుడు గిరీష్‌నాయుడు కాకినాడలో వైద్య విద్యనభ్యసిస్తున్నాడు. చిన్నప్పటి నుంచి విద్యపై మక్కువతో బాగా రాణించేవాడని, పదో తరగతిలో అత్యుత్తమ మార్కులతోపాటు, ఏపీఆర్‌జేసీకి ఎంపికై విజయవాడలో ఇంటర్ చదివాడు. అక్కడ కూడా మంచి ర్యాంకులు సాధించి మెడిసిన్‌లో 200లోపు ర్యాంకు సాధించి ప్రభుత్వ కోటాలో కాకినాడ ఆర్‌ఎంసీలో వైద్య విద్యార్థిగా చేరాడు.
ప్రాణం తీసిన సెమిస్టర్ పరీక్ష
వైద్య విద్య ద్వితీయ సంవత్సరంలోని సెమిస్టర్ పరీక్ష గిరీష్‌నాయుడు ఆత్మహత్యకు కారణమైందని తోటి విద్యార్థులంటున్నారు. వాస్తవానికి ద్వితీయ సంవత్సరం సెమిస్టర్ విధానంలో ప్రతీ ఆరు నెలలకు రెండేసి సెమిస్టర్లు ఉండేవని, అయితే ఈసారి నాలుగు సెమిస్టర్ పరీక్షలు ఒకేసారి నిర్వహించాలన్న నిర్ణయంతో గిరీష్‌నాయుడు తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనైనట్టు తెలిసింది. శుక్రవారం మైక్రో బయాలజీ పరీక్ష రాయాల్సి ఉందని, ఒక అంశంపై ఎన్నిసార్లు కసరత్తు చేసినా ఫలితంలేకపోతుందంటూ ఆత్మహత్యకు ముందు తోటి విద్యార్థుల వాపోయినట్టు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో సాయంత్రం 6–7 గంటల సమయంలో హాస్టల్‌లోని టెర్రస్‌పైకి ఎక్కి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.
క్రీడల్లో రాణింపు: చదువుతోపాటు క్రీడల్లో కూడా గిరీష్ బాగా రాణించేవాడని తోటి విద్యార్థులు చెప్పారు. గత ఏడాది డిసెంబర్‌లో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నిర్వహించిన క్రీడాపోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి జాతీయస్థాయిలో ప్రతిభ చాటాడని చెబుతున్నారు. స్పోర్ట్స్ సెక్రటరీగా కూడా గిరీష్ వ్యవహరించే వాడని చెప్పారు.
అలుముకున్న విషాదం
గిరీష్ ఆత్మహత్య చేసుకున్నాడన్న వాస్తవాన్ని తోటి విద్యార్థులు జీర్ణించుకోలేకపోతున్నారు. సంఘటన స్థలంలో, ఆ తరువాత కాకినాడ మార్చురీ వద్ద గిరీష్ స్నేహితులు విలపించారు. కాకినాడలోని ఐడీబీఐ బ్యాంక్‌లో ఉద్యోగం చేస్తున్న గిరీష్ మామయ్య వరహాలనాయుడు సమాచారం తెలుసుకుని సంఘటన స్థలానికి చేరుకుని తల్లిదండ్రులకు సమాచారం అందించారు.
ఆర్‌ఎంసీలో ఇది రెండో ఘటన
విద్యలో ఎదురయ్యే మానసిక ఒత్తిడితో కాకినాడ ఆర్‌ఎంసీలో ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం రెండోసారని విద్యార్థుల ద్వారా తెలిసింది. సుమారు ఎనిమిదేళ్ల క్రితం ఒక విద్యార్థిని ఇదే తరహాలో ఆత్మహత్యకు పాల్పడిందని, ఇప్పుడు ఇది రెండో సంఘటన అని చెబుతున్నారు.
మెడికో మరణంతో స్వగ్రామంలో విషాదం
రాజాం సిటీ: లెంక గిరీష్‌కుమార్ (20) కాకినాడ రంగరాయ మెడికల్ కళాశాల భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడనే సమాచారంతో గ్రామంలో విషాదం నెలకొంది. లెంక వెంకటరమణ, రాజేశ్వరమ్మలు వ్యవసాయం చేసుకుంటూ తన ఇద్దరు కుమారులను ఉన్నతులుగా చూడాలన్న కోరికతో ఉన్నత చదువులు చదివిస్తున్నారు. గిరీష్ వైద్యవిద్యలో చేరి గ్రామానికి మంచిపేరు తెస్తాడనుకున్న తరుణంలో ఈ మృతివార్త విషాదాన్ని నింపింది. గిరిష్ మృతిచెందాడన్న సమాచారంతో తండ్రి కుప్పకూలిపోయాడు. చదువులో ముందుండే గిరీష్ ఎందుకు ఇంత అఘాయిత్యానికి పాల్పడ్డాడోనని బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆత్మహత్య చేసుకునేటంత పిరికివాడు కాదని, ఎంసెట్‌లో మంచి ర్యాంకు సాధించి సీటు సంపాదించాడని కన్నవారు తెలిపారు. గిరీష్ మృతిచెందిన విషయం గుండెకు సంబంధించి వ్యాధితో బాదపడుతున్న తన తల్లి రాజేశ్వరికి తెలియకుండా ఈ విషయాన్ని దాచిపెట్టేందుకు ఎంత ప్రయత్నిస్తున్నప్పటికీ గ్రామస్థులు ఆందోళన తీవ్రతరం కావడంతో ఆమె పరిస్థితి ఎలా ఉంటుందోనన్న ఆందోళన పలువురిలో వ్యక్తమౌతుంది. విషయం తెలిసిన వెంటనే తండ్రి వెంకటరమణతోపాటు సోదరుడు శ్రీధర్, బంధువుల హుటాహుటిన కాకినాడకు బయలుదేరి వెళ్లారు.
Comments
Please login to add a commentAdd a comment