ప్రమాదానికి కారణమైన ట్రాక్టర్
పాయకరావుపేట: రెక్కాడితేగాని డొక్కాడని నిరుపేద కుటుంబాల్లో ట్రాక్టర్ ప్రమాదం పెను విషాదాన్ని నింపింది. కుటుంబ యజమానులు దుర్మరణం చెందడంతో ఇక తమకు దిక్కెవరంటూ ఆ కుటుంబాల సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. జాతీయ రహదారిపై నామవరం సమీపంలో సోమవారం జరిగిన రోడ్డుప్రమాదంలో ఇద్దరు కూలీలు దుర్మరణం చెందారు. దీంతో వారి కుటుంబాలు వీధిన పడ్డాయి. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. తూర్పుగోదావరి జిల్లా తుని మండలం హంసవరం నుంచి విశాఖ జిల్లా ఎస్.రాయవరం మండలం అడ్డురోడ్డు వద్దకు సిమెంటు ఇటుకలు తీసుకు వెళ్తున్న ట్రాక్టర్ నామరం వద్ద ప్రమాదానికి గురైంది.
వెనుక వస్తున్న బస్సుకు సైడు ఇచ్చేందుకు ట్రాక్టర్‌ను డ్రైవరు రోడ్డు పక్కకు దింపాడు. బస్సు వెళ్లిన తర్వాత తిరిగి ట్రాక్టర్‌ను రోడ్డు ఎక్కించే సమయంలో అదుపు తప్పి బోల్తాపడింది. తొట్టెలో సిమెంట్ ఇటుకలపై కూర్చొన్న హంసవరానికి చెందిన కూలీలు నట్టే వీరభద్రరావు(40),చిట్టుమూరి అప్పన్న(34) ఇటుకల కిందపడి తీవ్రగాయాలపాలయ్యారు. వెంటనే వీరిని స్థానికులు, పోలీసులు తుని ఏరియా ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరణించిన వీరభద్రరావుకు భార్య ఇద్దరు పిల్లలు, అప్పన్నకు భార్య,ఇద్దరు కుమారులు ఉన్నారు. ప్రమాదం విషయం తెసుకున్న బంధువులంతా తుని ఏరియా ఆస్పత్రికి అధిక సంఖ్యలో చేరుకున్నారు. వీరి ఆర్తనాదాలతో ఆస్పత్రి ప్రాంగణం మార్మోగింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ లొడ్డు రామకృష్ణ తెలిపారు.
స్థానికంగా సిమెంటు ఇటుకలు తయారీ పరిశ్రమ ఉండడంతో ఉపాధి కోసం అప్పన్న, వీరభద్రరావు పనుల్లోకి వెళ్తున్నారు. వీరు సంపాదిస్తేనే కుటుంబ పోషణ జరిగేది. వీరిద్దరి పిల్లలు బాగా చిన్నవారే. మృతదేహాల వద్ద ఆ పిల్లలు రోదిస్తున్న తీరు స్థానికులను కంటతడిపెట్టించింది. ఇటుకల లోడు దించేసి మధ్యాహ్ననానికల్లా ఇళ్లకు భోజనానికి వచ్చేస్తామని చెప్పారని, రెండుగంటలకు పిడుగులాంటి వార్త వినవలసివచ్చిందని బంధువులు కన్నీరు మున్నీరయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment