సాక్షి, రాయ్‌పూర్ : ఛత్తీస్‌గఢ్‌లో మరో రాసలీలల కుంభకోణం వెలుగు చూసింది. ముఖ్యమంత్రి రమణ్‌సింగ్ ప్రభుత్వంలోని మంత్రికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఆ వీడియో తన దగ్గర ఉందని ఆరోపణలు చేసిన సీనియర్ జర్నలిస్ట్ వినోద్ వర్మ అరెస్టయిన కాసేపటికే ఈ వ్యవహారం వెలుగులోకి రావటం విశేషం.
బీబీసీ మాజీ పాత్రికేయుడు, ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా సభ్యుడైన వినోద్ వర్మ గత కొంత కాలంగా తన దగ్గర ఓ ముఖ్యనేతకు సంబంధించిన సెక్స్ క్లిప్ ఉందంటూ చెబుతూ వస్తున్నారు. బీజేపీ ఐటీ సెల్ నేత ప్రకాశ్ బజాజ్ ఆ ఆరోపణలపై వినోద్‌పై ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు శుక్రవారం ఘజియాబాద్‌లో వినోద్‌ను అరెస్ట్ చేశారు. అయితే పోలీసులు ఆయన్ని తీసుకెళ్తున్న సమయంలో ఓ ప్రముఖ జాతీయ మీడియా సంస్థతో మాట్లాడిన ఆయన మంత్రి పేరు వెల్లడించటం విశేషం. ఆ వీడియోలో ఉంది పీడబ్ల్యూ శాఖా మంత్రి రాజేష్ మునత్ అంటూ వ్యాఖ్యానించినట్లు మీడియా సంస్థ ఏఎన్‌ఐ ప్రచురించింది. ఒక మంత్రికి సంబంధించిన స్కాండల్ కావటంతో.. కావాలనే తనని ఇరికించినట్లు ఈ సందర్భంగా వినోద్ పేర్కొన్నట్లు తెలిపింది.
ఇక ఆయన అరెస్ట్‌కు ముందు న్యూఢిల్లీలోని ఓ వీడియోపార్లర్ పై దాడి చేసిన పోలీసులు.. వినోద్ 1000 సీడీలను తయారు చేయాలని కోరినట్లు నిర్వాహకుల నుంచి సమాచారం రాబట్టారు. దీంతో ఆయన ఇంట్లో సోదాలు చేసిన పోలీసులు చివరకు 500 సీడీలు, పెన్ డ్రైవ్‌లు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే అందులో ఉన్న సమాచారం గురించి మాత్రం ఎలాంటి విషయాలు వెల్లడించలేదు. ప్రస్తుతం ఆయన్ని తదుపరి విచారణ కోసం రాయ్‌పూర్‌కి తరలిస్తున్నారు.
కాగా, బీజేపీ ఈ ఆరోపణలను తోసిపుచ్చింది. వినోద్ వర్మ ఛత్తీస్‌గఢ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు భూపేష్ బాఘెల్‌కు అత్యంత సన్నిహితుడని.. గత కొంత కాలం వాళ్లంతా బీజేపీ నేతల సోషల్ మీడియా అకౌంట్లు, వ్యక్తిగత వ్యవహారాలపై కన్నేశారని స్వయంగా ముఖ్యమంత్రి రమణసింగే మీడియాకు చెప్పారు. అయితే తమ పరువు పోకూడదనే బీజేపీ ఇలా అర్థం పర్థం లేని ఆరోపణలు చేస్తోందని కాంగ్రెస్ అంటోంది.
Comments
Please login to add a commentAdd a comment