
చంద్రశేఖర్‌రెడ్డి మృతదేహాన్ని పరిశీలిస్తున్న జిల్లా ఎస్పీ బాబూజీ అట్టాడ
విధుల నుంచి ఇంటికి విశ్రాంతి కోసం వచ్చాడు. ఈ క్రమంలోనే తన దగ్గర ఉన్న పిస్టల్‌ను శుభ్రం చేస్తుండగా దురదృష్టం వెంటాడింది. ప్రమాదవశాత్తు అది పేలింది. గన్‌మెన్ నిండుప్రాణాలు గాలిలో కలిశాయి. ఈ సంఘటన గురువారం జిల్లా వ్యాప్తంగా సంచలనం కలిగించింది. విజయదశమి పండుగకు రెండు రోజుల ముందు జరిగిన ఈ ఘటన కుటుంబంలో పెను విషాదాన్ని నింపింది.
కడప అర్బన్ : జిల్లాలోని వల్లూరు మండలం అంబవరానికి చెందిన బసిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి (45) 1992 బ్యాచ్‌లో ఏఆర్ కానిస్టేబుల్ (ఏఆర్ పిసి– 1245)గా పోలీసు శాఖలో చేరారు. గతంలో ఎమ్మెల్సీ దేవగుడి నారాయణ రెడ్డికి గన్‌మెన్‌గా పని చేశారు. ప్రస్తుతం రాష్ట్ర మంత్రి ఆదినారాయణ రెడ్డికి గన్‌మెన్‌గా విధులు నిర్వహిస్తున్నారు. బుధవారం వరకు పనిచేసిన ఆయన గురువారం విశ్రాంతి తీసుకునేందుకు ఉదయం కడప తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న రవీంద్రనగర్ రామాలయం వీధిలో నివసిస్తున్న తన ఇంటికి వచ్చారు. ఈ క్రమంలో తనకు భద్రత విధులకు తీసుకుని వెళ్లే ‘పిస్టల్’ను శుభ్రం చేస్తుండగా ప్రమాదవశాత్తు పేలింది. ఈ సంఘటనలో పిస్టల్ బుల్లెట్ చంద్రశేఖర్‌రెడ్డి శరీరంలో ఛాతీకి కింద భాగం నుంచి వెనుక వైపునకు దూసుకుని వెళ్లింది. తీవ్రంగా గాయపడిన చంద్రశేఖర్ రెడ్డిని మొదట రైల్వేస్టేషన్ రోడ్డులో ఉన్న హిమాలయ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌కు తరలించారు. పరిస్థితి విషమించడంతో రిమ్స్‌కు తరలించారు. క్యాజువాలిటీలో వైద్యులు పరీక్షలు చేసి మృతి చెందాడని నిర్ధారించారు.
ఈ సంఘటనతో చంద్రశేఖర్ రెడ్డి కుటుంబ సభ్యులు విషాదంలో పడ్డారు. భార్య స్వర్ణలత, కుమారులు నితిన్‌రెడ్డి ఇంటర్మీడియేట్, ధనుష్‌రెడ్డి ఏడవ తరగతి చదువుతున్నారు. విధుల నుంచి ఇంటికి వచ్చిన తండ్రి తమతోపాటు పండుగ జరుపుకుంటాడని సంతోషంతో ఉండగా, అకస్మాత్తుగా ఈ సంఘటన జరిగేసరికి బోరున విలపించారు.
కుటుంబాన్ని ఆదుకుంటాం:ఎస్పీ
చంద్రశేఖర్‌రెడ్డి మృతి చెందాడన్న వార్త తెలియగానే ఎస్పీ బాబూజీ అట్టాడ తమ సిబ్బందితో హుటాహుటిన రిమ్స్ ఆస్పత్రికి చేరుకున్నారు. అక్కడ చంద్రశేఖర్‌రెడ్డి మృతదేహాన్ని పరిశీలించారు. కుటుంబ సభ్యులు, బంధువులను ఓదార్చారు.అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రశేఖర్‌రెడ్డి మరణం దురదృష్టవశాత్తు జరిగిందన్నారు. అతని కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ (అడ్మిన్) ఎ.శ్రీనివాసరెడ్డి, ఏఆర్ అదనపు ఎస్పీ రుషికేశవరెడ్డి, కడప డీఎస్పీ షేక్ మాసుంబాష, ఫ్యాక్షన్ జోన్ డీఎస్పీ బి.శ్రీనివాసులు, ఎస్‌బీ డీఎస్పీ రాజగోపాల్‌రెడ్డి, సీఐలు దారెడ్డి భాస్కర్‌రెడ్డి, టీవీ సత్యనారాయణ, రామకృష్ణ, పురుషోత్తంరాజు, సిబ్బంది పాల్గొన్నారు.