
రేలంగిలో అదృశ్యమైన రామాంజనేయుల కోసం దీనంగా ఎదురుచూస్తున్న కుటుంబ సభ్యులు అదృశ్యమైన తలాటి రామాంజనేయులు (ఫైల్)
ఇరగవరం : దివ్యాంగుడైనా ఎవరి మీదా ఆధారపడకుండా సొంతంగా వ్యాపారం చేసుకుంటూ తల్లిదండ్రులను, భార్యను కంటికి రెప్పలా కాపాడుకుంటున్న వ్యక్తి అదృశ్యమై రెండు నెలలు కావస్తున్నా ఇంతవరకూ ఆచూకీ లభించ లేదు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఇరగవరం మండలం రేలంగి గ్రామానికి చెందిన తలాటి రామాంజనేయులు గత సంవత్సరం డిసెంబర్‌లో అదృశ్యమయ్యాడు. గాలించినా ఫలితం లేకపోవడంతో కుటుంబ సభ్యులు జనవరి 23న ఇరగవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులో గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులపై తమకు అనుమానం ఉందని పేర్కొన్నారు. అయినా ఇప్పటివరకూ అనుమానితులను విచారించినా ఎటువంటి ప్రయోజనం లేకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తమ బిడ్డ కనిపించకుండా పోయి రెండు నెలలు కావడంతో తల్లిదండ్రులు తలాటి ధనరాజు, కృష్ణవేణి కన్నీటి పర్యంతమవుతున్నారు. తమ బిడ్డ వికలాంగుడైనా సొంతంగా ఫినాయిల్, యాసిడ్ తయారు చేసి షాపులకు విక్రయింగా వచ్చే ఆదాయంతో కుటుంబాన్ని పోషిస్తున్నాడని చెప్పారు. రెండు నెలల క్రితం గ్రామానికి చెందిన ఒక వ్యక్తిని వ్యాపారంలో భాగస్వామిగా చేర్చుకున్నాడని అప్పటినుంచి తమ కుమారుడు ఎంతో కష్టపడి నిర్మించుకున్న వ్యాపారాన్ని వాళ్లు హస్తగతం చేసుకోవాలనే దురుద్దేశంతోనే తమ కుమారుడిని అదృశ్యం చేశారని తల్లిదండ్రులు పేర్కొంటున్నారు. రామాంజనేయులుకు 9 నెలల క్రితం తూర్పు గోదావరి జిల్లా ఆలమూరు మండలం సందికూడి గ్రామానికి చెందిన సురేఖ అనే యువతితో వివాహం జరిగింది. రామాంజనేయులు అదృశ్యమవడంతో ఆమె కన్నీరుమున్నీరవుతోంది.
ఈ కేసును త్వరలోనే ఛేదిస్తాం
రామాంజనేయులు అదృశ్యంపై కేసును నమోదు చేశాం. తెలిపారు. ఫిర్యాదులో పేర్కొన్న అనుమానితులను కూడా విచారించాం. కాల్ డేటా వివరాలు అందితే నేరస్తులు ఎవరో తెలుస్తుంది. త్వరలోనే కేసును ఛేదిస్తాం. – జి.శ్రీనివాస్, ఎస్సై, ఇరగవరం