
బంజారాహిల్స్ (హైదరాబాద్ సిటీ) : 45 దొంగతనాలు.. 11 పోలీస్ స్టేషన్లు.. 11 నాన్‌బెయిలబుల్ వారెంట్లు.. పదిసార్లు జైలు శిక్ష.. మోస్ట్‌వాంటెడ్ క్రిమినల్‌ను అరెస్ట్ చేయాలంటూ కోర్టు ఆదేశాలతో కూడిన ఎన్‌బిడబ్ల్యూ వారెంట్.. ఎన్నిసార్లు జైలుకెళ్లినా, ఎన్నిసార్లు పోలీసులకు పట్టుబడ్డా తీరుమార్చుకోకుండా జల్సాలకు అలవాటుపడ్డాడు. వరుస దొంగతనాలకు పాల్పడుతూ ల్యాప్‌టాప్ దొంగగా పేర్గాంచిన దొంగను గురువారం జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. గురువారం జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో విలేకరులకు ఇన్‌స్పెక్టర్ పూర్ణచందర్‌రావు, డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్‌ముత్తు, ఎస్‌ఐ డీ శ్రీను నిందితుడి వివరాలు వెల్లడించారు.
కరీంనగర్ జిల్లా గోదావరిఖని ప్రభుత్వ పాఠశాల వెనుకాల నివసించే నిట్టూరి స్నేహిత్‌రాజ్ అలియాస్ అభినవ్‌రాజు అలియాస్ అభిరామ్(28) నల్లకుంట సమీపంలోని తిలక్‌నగర్‌లో నివాసముంటున్నాడు. 2004లో గోదావరిఖనిలో చర్చిలో మైక్‌లు దొంగతనానికి పాల్పడి అప్పటి నుంచి వరుసగా దొంగతనాలు చేస్తూ పలుమార్లు పట్టుబడి జైలుకు వెళ్లాడు. బ్యాచిలర్స్ రూమ్స్ టార్గెట్‌గా చేసుకొని ల్యాప్‌టాప్‌లు దొంగిలించడంలో సిద్దహస్తుడయ్యాడు. ల్యాప్‌టాప్ రిపేర్ వర్కర్ కావడంతో ఆయా ల్యాప్‌టాప్‌లను దొంగిలించి ఏ మాత్రం అనుమానం రాకుండా మార్చి ఓఎల్‌ఎక్స్‌లో పెట్టి విక్రయించేవాడు. గోదావరిఖని, భూపాలపల్లి, హుజూరాబాద్, మంచిర్యాల, గచ్చిబౌళి, కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీ, మీర్‌పేట, మాదాపూర్, ఎస్‌ఆర్‌నగర్, జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ల పరిధిలో దొంగతనాలు చేస్తూ పలుమార్లు పట్టుబడ్డాడు. అతని వద్ద నుంచి 9 ల్యాప్‌టాప్‌లు, ఒక టూ వీలర్, మొబైల్‌ఫోన్‌ను కూడా రికవరీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment