నిందితులు మహేశ్, లింగమ్మ
కుత్బుల్లాపూర్: ఈజీ మనీకి అలవాటు పడి మోసాలకు పాల్పడుతున్న తల్లీకొడుకులను బాలానగర్ పోలీసులు సోమవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. బాలానగర్ డీసీపీ కార్యాలయంలో సోమవారం డీసీపీ పద్మజారెడ్డి వివరాలు వెల్లడించారు. సూర్యాపేట జిల్లా, కోదాడకు చెందిన బట్ట మహేశ్ డిగ్రీ మధ్యలోనే చదువుకు స్వస్తి చెప్పాడు. అనంతరం హైదరాబాద్‌కు మకాం మార్చిన ఇతను రియల్ ఎస్టేట్, పెట్రోల్ బంక్, పాఠశాలల ఏర్పాటు చేద్దామంటూ పలువురిని నమ్మించి రూ. కోట్లలో వసూలు చేశాడు. స్థానిక ఏపీజే అబ్దుల్ కలామ్ జూనియర్ కళాశాలలో లెక్చరర్‌గా పని చేస్తున్న రాజేశ్వరి ఇంట్లో అద్దెకు ఉన్న మహేష్ ఆమె నమ్మకాన్ని సంపాదించుకున్నాడు. ప్రైవేట్ పాఠశాల ఏర్పాటు చేస్తే లాభాలు వస్తాయని ఆమెను నమ్మించాడు. ఇందుకు రూ.25 లక్షలు అవసరమవుతాయని చెప్పడంతో రాజేశ్వరి రూ.16.80 లక్షలు మహేశ్ తల్లి బట్ట లింగమ్మ బ్యాంక్ ఖాతాకు బదిలీ చేసింది. మిగిలిన రూ.8.2 లక్షలు ఆమె చేతికి ఇచ్చింది. ఇదే తరహాలో మహేశ్ పలువురు ఫైనాన్సియర్ల నుంచి పెట్టుబడి పేరుతో రూ. కోట్లు వసూలు చేశాడు. ఇందుకు అతడి తల్లి లింగమ్మ, సోదరుడు శేఖర్ సహకరించారు. డబ్బుల విషయమై రాజేశ్వరి, ఆమె భర్త శ్రీనివాస్‌గౌడ్ పలుమార్లు మహేశ్ ను అడిగినా సమాధానం రాకపోవడంతో జీడిమెట్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన జీడిమెట్ల డీఐ సుమన్ నిందితులు మహేశ్, లింగమ్మ లను అరెస్టు చేశారు. నిందితులు దాదాపు రూ. 5 కోట్ల మేర మోసాలకు పాల్పడినట్లు గుర్తించామని, వాటిని రికవరీ చేసేందుకు చర్యలు తీసుకోనున్నట్లు డీసీపీ తెలిపారు.
ప్రియుడితో కలిసి భర్త హత్య..
వివాహేతర సంబంధంపై నిలదీసినందుకు ప్రియుడితో కలిసి భర్తను హత్య చేయించిన భార్యతో పాటు, ఆమె ప్రియుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. శ్రీకాకుళం జిల్లా కు చెందిన నక్కా రామారావు, శ్రీదేవి దంపతులు శామీర్ పేట్ మండలం, తూంకుంట గ్రామంలోని బిట్స్ కాలనీలో ఉంటూ కూలీ పని చేస్తున్నారు. అదే ప్రాంతంలో పని చేస్తున్న ఒడిశాకు చెందిన దామండ్ల శివతో వీరికి పరిచయం ఏర్పడింది. తరచూ రామారావు ఇంటికి వచ్చే శివ అతని భార్య శ్రీదేవితో సన్నిహితంగా ఉండేవాడు. దీనిని గుర్తించిన రామారావు పలుమార్లు భార్యను హెచ్చరించాడు. దీంతో అతడిపై కోపం పెంచుకున్న శ్రీదేవి తన భర్తను హత్య చేయాల్సిందిగా ప్రియుడు శివను పురమాయించింది. ఇందుకు రూ. 5 వేలు ఇచ్చింది. పథకం ప్రకారం శివ రామారావుతో మద్యం తాగింది బైక్‌పై సమీపంలోని సురభి వెంఛర్‌లోకి తీసుకు వెళ్లి మద్యం సీసాతో పొడిచి హత్య చేశాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు శ్రీదేవి, ఆమె ప్రియుడు శివ హత్యకు పాల్పడినట్లుగా గుర్తించారు. నిందితులను సోమవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment