వరలక్ష్మి మృతదేహం వద్ద రోదిస్తున్న కుటుంబ సభ్యులు
సాక్షి, కర్నూలు : అమ్మతోటే వారి లోకం..ఏ అవసరమొచ్చినా తల్లినే అడిగేవారు.. ఆకలేసినా..ఆపదొచ్చినా..అమ్మ ఉందనే ధైర్యం వారిలో ఉండేది. తండ్రి మద్యానికి బానిసై ఇంటిని పట్టించుకునే వాడు కాదు.. తల్లే పిల్లల ఆలనాపాలనా చూస్తుండేది. అయితే మద్యం పెట్టిన చిచ్చు ఆ ఇంట్లో ఇల్లాలిని బలితీసుకుంది. నలుగురు పిల్లలను దిక్కులేని వారిని చేసింది. ‘‘నాన్నా..అమ్మ ఎక్కడుంది’’ అంటూ చిన్నారులు రోదిస్తున్న తీరు ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టించింది. వివరాలు ఇవీ.. డోన్ పట్టణం ఎన్టీఆర్ నగర్‌కు చెందిన ఈరన్నకు సమీపంలోని అబ్బిరెడ్డి పల్లె గ్రామానికి చెందిన వరలక్ష్మికి 2004లో వివాహమైంది. ఈరన్న గతంలో గౌండా పని చేసుకుని జీవనం సాగించేవాడు. ప్రస్తుతం సెంట్రింగ్ పనికి సంబంధించిన రేకులు బాడుగకు ఇస్తూ జీవనం సాగిస్తున్నాడు. భార్య వరలక్ష్మి(30) ఇళ్లకు పెయింటింగ్ వేసే పనికి వెళ్లేది. వీరికి కుమారుడు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. అన్యోన్యంగా సాగుతున్న వీరి కాపురంలో మద్యం చిచ్చుపెట్టింది. సరదాగా ప్రారంభమైన మద్యం అలవాటుకు ఈరన్న క్రమంగా బానిసయ్యాడు. చీకటి పడగానే పని నుంచి ఇంటికి వచ్చే భర్త తాగి రావడం భార్య వరలక్ష్మికి నచ్చలేదు.
మద్యం మానాలని పలుమార్లు చెప్పి చూసింది. మద్యం వల్ల కలిగే అనర్థాలు, చుట్టుపక్కల జరిగిన ఘటనల గురించి భర్తకు చెప్పేది. రోజూ మద్యం మానతానని చెప్పి తిరిగి తాగి రావడంతో వరలక్ష్మికి విసుగు పుట్టింది. ఈ విషయమై ఆదివారం రాత్రి భర్తతో గొడవ పడింది. ఈ క్రమంలో ఇరువురి మధ్యా వాగ్వాదం తీవ్రస్థాయికి చేరడంతో చేయి చేసుకున్నాడు. దీంతో వరలక్ష్మి మనస్తాపానికి గురై సోమవారం ఉదయం భర్త ఇంట్లో లేని సమయంలో టీలో పేల నివారణకు ఉపయోగించే మందును కలిపి ముందుగా పిల్లలకు ఇచ్చింది. ఆ తర్వాత తానూ తాగింది. కాసేపటికి భర్త ఇంటికి వచ్చి నోట్లో నురగలు కక్కుతున్న వారిని గమనించి వెంటనే చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు తరలించాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వరలక్ష్మి కొద్దిసేపటికే మృతిచెందింది. పిల్లలు ఇందు(12), ఉమాదేవి(10), ఉదయ్‌కుమార్(6), ఐశ్వర్య(4)చికిత్స పొందుతున్నారు. వారి పరిస్థితి కాస్త మెరుగ్గా ఉందని వైద్యులు తెలిపారు.
వీధిలో ఎవరైనా ఆత్మహత్య చేసుకున్నా, ఆత్మహత్యాయత్నం చేసినా ఎందుకిలా చేశారంటూ ధైర్యం చెప్పే తన భార్య ఇంత పని చేస్తుందనుకోలేదని భర్త ఈరన్న కన్నీరుమున్నీరయ్యాడు. కాగా తల్లి మరణ విషయం తెలియక అమ్మ ఎక్కడుందని పిల్లలు అడుగుతుండటం చూసి పలువురు కంట తడిపెట్టారు. డోన్ టౌన్ ఎస్‌ఐ చంద్రశేఖర్ రెడ్డి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారిణి శంషాద్ బేగం డోన్‌లోని మృతురాలి ఇంటి వద్దకు చేరుకొని ఇరుగు పొరుగును విచారించారు. అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలు వారి వారి పరిధుల్లోని ప్రజల జీవన పరిస్థితులను గమనిస్తూ ఉండాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment