
నిందితుడిని చూపిస్తున్న సీఐ రఘు
చేర్యాల(సిద్దిపేట) : గౌరవ్వ హత్య కేసు మిస్టరీ వీడింది. కొమురవెల్లి పోలీసులు కేసును ఛేదించి నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. వివరాలిలా ఉన్నాయి. కొమురవెల్లి మండలం గురువన్నపేటకు చెందిన బండారి గౌరవ్వ(75) ఈ ఏడాది జనవరి 22న అదృశ్యమైంది. మూడు నెలల తర్వాత ఏప్రిల్ 23న అస్థిపంజరంగా దొరికిన ఘటన తెలిసిందే.
మంగళవారం చేర్యాల పోలీస్ స్టేషన్‌లో సీఐ ఎల్. రఘు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఈ కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. గౌరవ్వ అదృశ్యమైన రోజునే పెద్ద కుమారుడు బండారి కొండయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కొమురవెల్లి పోలీస్‌స్టేషన్‌లో మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలు పెట్టినట్లు తెలిపారు. దర్యాప్తు కొనసాగుతున్న క్రమంలో ఏప్రిల్ 23న గ్రామ శివారు చెరువులో గుర్తు తెలియని అస్థిపంజరం లభించిందన్నారు.
దాని సమీపంలోని బట్టల ఆధారంగా మృతదేహం గౌరవ్వదిగా గుర్తించినట్లు తెలిపారు. గౌరవ్వది హత్యా, ఆత్మహత్యా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్న పోలీసులు అనుమానంతో మంగళవారం ఉదయం గౌరవ్వ పెద్ద కొడుకు కొండయ్యను అరెస్ట్ చేశామన్నారు. అతడిని విచారించగా డబ్బులు, బంగారు ఆభరణాల కోసం తానే తల్లిని హత్య చేసినట్లు ఒప్పుకున్నాడని సీఐ తెలిపారు.
కొండయ్య జనవరి 22వ తేదీ రాత్రి తన తల్లి గౌరవ్వ వద్దకు వెళ్లి డబ్బులు, బంగారం ఇవ్వాలని కోరాడు. దానికి ఆమె నిరాకరించడంతో హత్య చేసి ఎవరికీ అనుమానం రాకుండా ఊరు పక్కన ఉన్న చెరువులోని ఒర్రె ఇసుకలో పూడ్చి పెట్టినట్లు చెప్పాడని తెలిపారు. నిందితుడి వద్ద నుంచి రూ.10 వేల నగదు, బంగారు ఏనెలు, పూసల దండ, జత కమ్మలు స్వాధీన పరుచుకున్నామన్నారు. హత్య కేసు నమోదు చేసి నిందితుడిని రిమాండ్‌కు తరలిస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో కొమురవెల్లి ఎస్‌ఐ సతీష్‌కుమార్ ఉన్నారు.

గౌరవ్వ
Comments
Please login to add a commentAdd a comment