వివరాలు వెల్లడిస్తున్న ఏఎస్పీ చౌడేశ్వరి, రూరల్ సీఐ రాము
అనంతపురం, పామిడి: ‘ఎంత తెలివిగా హత్య చేసినా హంతకులు ఏదోక క్లూ వదిలేపోతారు’, ‘తీగ లాగితే డొంక కదులుతుంది’ మిస్టరీగా మారిన కేసులను ఛేదించే పోలీసులు వీటిని దృష్టిలో ఉంచుకునే దర్యాప్తు ప్రారంభిస్తారు. పెద్దవడుగూరు మండలం వీరెపల్లి శివార్లలో గత నెల 21న గుర్తు తెలియని వ్యక్తి హత్య కేసు కూడా ఈ విధంగానే ఛేదించబడింది. హంతకులు తాము ఉపయోగించిన పెట్రోల్ క్యాన్‌ను వదిలేసిపోవడం, దాని ఆధారంగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించి కేసును ఛేదించడం నెల తిరక్కముందే జరిగిపోయాయి. మృతుడు కర్నూలు జిల్లా ఆదోనిలోని రాజీవ్ కాలనీకి చెందిన బోయ ప్రదీప్(18) అని గుర్తించారు. నిందితులు స్వచ్ఛందంగా వచ్చి లొంగిపోయారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను మంగళవారం సాయంత్రం స్థానిక రూరల్ సర్కిల్ పోలీస్‌స్టేషన్‌లో ఏఎస్పీ చౌడేశ్వరి వెల్లడించారు.
బోయ ప్రదీప్ తల్లి రోజా పదేళ్ల క్రితం భర్త పరంజ్యోతితో విడిపోయింది. డోన్ పట్టణానికి చెందిన నాగమద్దిలేటిని 2010 సంవత్సరంలో రెండో పెళ్లి చేసుకుంది. అప్పటికే ఆమెకు ఇద్దరు కుమారులు విజయ్(12), ప్రదీప్(9). ఈ పెళ్లతో తలెత్తిన గొడవల కారణంగా నాగమద్దిలేటి, రోజా విజయ్‌ను, ప్రదీప్‌ను తీసుకుని ఆదోనికి వచ్చి కాపురం పెట్టారు. చిన్న కుమారుడు ప్రదీప్ 10 వతరగతి వరకూ చదివి జల్సాలకు, తాగుడుకు బానిసయ్యాడు. బుల్లెట్ బైకు కావాలంటూ తల్లి రోజాతో నిత్యం గొడవ పడేవాడు. నువ్వంటే అసహ్యమంటూ ఈసడించుకునేవాడు. దీనికితోడు వరుసకు అత్తయిన నాగమద్దిలేటి సొంత చెల్లెలితో ప్రేమాయణం సాగించాడు. ఆమెను విజయవాడ తీసుకెళ్లి పెళ్లి చేసుకుంటానని గత నెల 19న ఇంటికి వెళ్లాడు. నాగమద్దిలేటికి ఆయన చిన్న చెల్లెలు ఈ విషయాన్ని తెలిపింది. అప్పటికే నాగమద్దిలేటి తన స్నేహితుడు గౌస్‌ఖాన్ ఇంట్లో మరో స్నేహితుడు సంపత్‌కుమార్‌తో కలిసి మద్యం సేవిస్తున్నాడు. స్నేహితులు ముగ్గురూ కలిసి ఎలాగైనా ప్రదీప్‌ను అంతమొందించాలనుకున్నారు.
ప్రదీప్‌ను కొట్టి బలవంతంగా వారి బైకులో డోన్‌వైపు తీసుకెళ్లారు. డోన్‌కు కొద్దిదూరంలో గుత్తిరోడ్డు వైపు కంపచెట్లలోకి తీసుకెళ్లి రెండు చేతులూ వెనక్కు కట్టేసి బెల్టుతో గొంతు బిగించి చంపేశారు. అక్కడి నుంచి అనంతపురం జిల్లా వైపు తీసుకెళ్లి పెట్రోలు పోసి కాల్చి ఆనవాలు లేకుండా చేయాలనుకున్నారు. ఇంటి సామాన్లు మార్చాలని చెప్పి కర్నూలుకు చెందిన మధు బొలెరో వాహనాన్ని అద్దెకు పిలిపించుకున్నారు. సామాన్లు లోడ్ చేసేసరికి కాసేపు నిద్రపో అని డ్రైవర్‌గా వచ్చిన వెంకటేష్‌కు చెప్పారు. అతను నిద్రపోగానే వారు ఆ వాహనాన్ని తీసుకుని వెళ్లారు. డోన్ వెలుపల తారకరామనగర్‌లోని రాజు పెట్రోలు బంకుకు వద్దకెళ్లి రూ.800లకు పెట్రోలును క్యాన్‌లో తీసుకుని, ప్రదీప్ మృతదేహాన్ని తీసుకుని వీరెపల్లికి తెచ్చారు. ఆ గ్రామ సమీపంలో ప్రదీప్ మృతదేహంపై పెట్రోలు పోసి అంటించారు. అయితే పెట్రోల్ క్యాన్ అక్కడే వదిలేశారు. తిరుగు ప్రయాణంలో గుత్తి బాటలో సుంకులమ్మ గుడికి వెళ్లారు. వాళ్లు వదిలేసిన పెట్రోలు క్యాన్ ఆధారంగా ఏఎస్పీ చౌడశ్వరి ఆధ్వర్యంలో, పామిడి రూరల్ సీఐ రాము సారథ్యంలో పోలీసులు కేసు విచారణను ముమ్మరం చేశారు. ఈ క్రమంలో వారు పెట్రోలు బంకు, సుంకులమ్మ గుడిలోని సీసీ కెమెరా పుటేజీలను పరిశీలించారు. రెండుచోట్లా కనిపించింది వారే కావడంతో బొలెరో వాహనం నెంబర్ ఆధారంగా నిందితులను గుర్తించారు. ఈ క్రమంలో రోజా సైతం మృతి చెందింది తన కుమారుడు ప్రదీపేనని గుర్తించిం ది. ఈ నేపథ్యంలో నిందితులు స్వచ్ఛందంగా వచ్చి పోలీసులకు లొంగిపోయారు.
రివార్డుకు సిఫారసు చేశాం : ఏఎస్పీ
ఎటువంటి ఆధారాలు లేకపోయినా మిస్టరీగా మారిన కేసును అనతికాలంలో ఛేదించడంలో సీఐ రాముతోపాటు ఎస్‌ఐ రమేష్‌రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ మాణిక్యం, రాజ్‌కుమార్, కానిస్టేబుళ్లు బాలకృష్ణ, చంద్ర, రవి, శ్రీనాథ్, వివేక్ చేసిన కృషిని ఆమె అభినందించారు. వారికి రివార్డు కోసం ప్రతిపాదించామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment