సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై హత్యాయత్నం ఘటన కేసు విచారణలో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) అధికారులు దూకుడు పెంచారు. ముందుగా నిందితుడు శ్రీనివాసరావును కోర్టు అనుమతితో అదుపులోకి తీసుకుని, విశాఖపట్నం విమానాశ్రయంలోని ఘటనా స్థలానికి తీసుకువచ్చి విచారణ చేపట్టిన అధికారులు ఇప్పుడు ఆ కేసులోని సాక్షుల విచారణను ముమ్మరం చేశారు. విశాఖ నగరం కైలాసగిరి పోలీస్ హెడ్‌క్వార్టర్స్ ప్రాంగణంలో నాలుగు రోజులుగా ఎన్‌ఐఏ అధికారులు మకాం వేశారు. అక్కడే తాత్కాలిక కార్యాలయం ఏర్పాటు చేసుకున్నారు. సంక్రాంతి సెలవులు కూడా లేకుండా నిర్విరామంగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
బయటి నుంచి కాఫీ తేవొద్దన్నారు
వైఎస్ జగన్‌పై హత్యాయత్నం జరిగినప్పుడు ఘటనా స్థలంలో ఉన్న వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలను కూడా సాక్షులుగా పేర్కొంటూ విచారణ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు పార్టీ కార్యాలయంలో పనిచేసే కృష్ణకాంత్‌ను మంగళవారం మధ్యాహ్నం ఎన్‌ఐఏ అధికారులు పిలిపించి రెండుగంటలకు పైగా విచారించారు. అదేవిధంగా వైఎస్సార్‌సీపీకి చెందిన మాజీ కార్పొరేటర్ జియ్యాని శ్రీధర్‌ను మంగళవారం సాయంత్రం పిలిపించి విచారించారు. ‘‘ఉత్తరాంధ్రలో ప్రజా సంకల్పయాత్ర నేపథ్యంలో ఎయిర్‌పోర్ట్‌కు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విచ్చేసినప్పుడు మా ఇంటి నుంచి నేనే కాఫీ తీసుకువెళ్లేవాడిని. హత్యాయత్న ఘటనకు సరిగ్గా వారం ముందే బయటి నుంచి కాఫీ వద్దంటూ ఫ్యూజన్ ఫుడ్స్ రెస్టారెంట్ యజమాని హర్షవర్దన్ చౌదరితో చెట్టాపట్టాలు వేసుకుతిరిగే ఎయిర్‌పోర్ట్ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ వేణుగోపాల్ అడ్డుకున్నారు. మా ఇంటి నుంచి తెచ్చిన కాఫీని సర్వ్ చేసిన ఇద్దరు ఎయిర్ ఇండియా సిబ్బందిని వారంపాటు సస్పెండ్ చేశారు. ఫ్యూజన్ ఫుడ్స్ నుంచే తేవాలని షరతు విధించారు. సరిగ్గా ఆ వారమే ప్రతిపక్ష నేతపై శ్రీనివాసరావు కత్తితో దాడి చేశాడు’’ అని శ్రీధర్ ఎన్‌ఐఏ అధికారులకు వివరించారు. ‘‘కేసు దర్యాప్తు చేసిన ‘సిట్’ అధికారులు, విశాఖ పోలీస్ ఉన్నతాధికారులు మాకు ఏమాత్రం సహకరించలేదు. ఆ కేసు గురించి ఒక్క ముక్క కూడా చెప్పలేదు. అందుకే మీరైనా ఏం జరిగిందో చెప్పండి’’ అని ఎన్‌ఐఎ అధికారులు విచారణకు హాజరైన సాక్షులతో అన్నట్టు సమాచారం.
ఆ లేఖపైనా విచారణ
నిందితుడు శ్రీనివాసరావు వద్ద లభ్యమైనట్టు పోలీసులు చెబుతున్న 11 పేజీల లేఖపై కూడా ఎన్‌ఐఏ అధికారులు విచారణ సాగిస్తున్నారు. ఈ క్రమంలోనే లేఖలో 2 పేజీలు రాసినట్టు చెబుతున్న ఫ్యూజన్‌ఫుడ్స్ రెస్టారెంట్‌లో శ్రీనివాసరావు సహోద్యోగి రేవతీ ప్రసాద్‌ను అధికారులు బుధవారం పిలిపించి సుదీర్ఘంగా విచారించారు. ఆ లేఖ ఎవరు రాశారు? నిజంగా నువ్వే రాశావా? వైఎస్ జగన్‌పై హత్యాయత్నం జరిగిన సమయంలో లేఖ శ్రీనివాసరావు వద్దనే ఉందా? లేదా? ఆ తర్వాత పుట్టించారా? ఇలా పలు కోణాల్లో రేవతీ ప్రసాద్‌ను ప్రశ్నించినట్లు సమాచారం.
హర్షవర్దన్ చౌదరికి నోటీసులు
జగన్‌పై హత్యాయత్నం కేసులో కీలకంగా భావిస్తున్న టీడీపీ నాయకుడు. ఫ్యూజన్ ఫుడ్స్ రెస్టారెంట్ యజమాని టి.హర్షవర్దన్ చౌదరి సహా రెస్టారెంట్‌లో పనిచేస్తున్న ఉద్యోగులు, ఇతర సాక్షులు మొత్తం 15మందిని గురు, శుక్రవారాల్లో విచారణకు హాజరు కావాల్సిందిగా ఎన్‌ఐఏ అధికారులు నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తోంది. హర్షవర్దన్ చౌదరిని ప్రశ్నిస్తే కీలక సమాచారం లభ్యమవుతుందని ఎన్‌ఐఏ అధికారులు భావిస్తున్నట్లు సమాచారం.
ఏం జరిగిందో చెప్పండి
Published Thu, Jan 17 2019 4:11 AM | Last Updated on Thu, Jan 17 2019 6:44 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment