సాక్షి, అమరావతి/సాక్షి,హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై హత్యాయత్నం కేసులో నిందితుడు శ్రీనివాసరావును జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) విచారించింది. విశాఖ విమానాశ్రయంలో గతేడాది అక్టోబర్ 25న హత్యాయత్నం చేసిన శ్రీనివాసరావును కస్టడీకి తీసుకున్న ఎన్‌ఐఏ మూడో రోజు పలు కీలక అంశాలపై ప్రశ్నించినట్టు సమాచారం. తొలుత హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో వైద్య పరీక్షలు నిర్వహించాక విచారణ కొనసాగించారు. మాదాపూర్‌లోని ఎన్‌ఐఏ కార్యాలయంలో శ్రీనివాస్‌రావును అతని న్యాయవాది సమక్షంలోనే ఎన్‌ఐఏ అధికారులు ప్రశ్నించారు. జగన్‌పై హత్యాయత్నం ఎందుకు చేశావు.. వెనుక ఎవరున్నారనే దానిపై విచారించారు. శ్రీనివాసరావు కాల్ డేటాను పరిశీలించి, వాటికి సంబంధించిన వివరాలు సేకరించేందుకు పలు ప్రశ్నలు సంధించినట్టు సమాచారం. ఒక్క సంవత్సరంలో వందలాది సిమ్ కార్డులు, పదుల సంఖ్యలో సెల్‌ఫోన్లు మార్చడం వెనకున్న ఆంతర్యమేంటని ప్రశ్నించినట్టు తెలిసింది.
టీడీపీ నేతతో శ్రీనివాసరావు ఫోన్ కాల్స్‌పై దృష్టి: జగన్‌పై హత్యాయత్నం చేయడానికి ముందుగా జరిగిన బ్యాంకు లావాదేవీలపై ఆరా తీసినట్టు తెలిసింది. ఎయిర్ పోర్టులో ఫ్యూజన్‌ఫుడ్స్ యజమాని వద్ద పనికి కుదిర్చిందెవరు? సంబంధిత టీడీపీ నేతతో శ్రీనివాస్‌రావుకు జరిగినట్టు భావిస్తున్న ఫోన్ కాల్స్ సంభాషణలపైనా దర్యాప్తు అధికారులు దృష్టి సారించినట్టు తెలుస్తోంది. ఎయిర్‌పోర్టు లోపలికి వెళ్లేందుకు ఇచ్చే అనుమతి పాస్ తాత్కాలికమైనా క్రిమినల్ కేసులున్న వ్యక్తికి ఎలా ఇచ్చారు? తాత్కాలిక పాస్ ఇప్పించిందెవరన్న అంశాలపై లోతుగా దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తోంది.
ఆ పాస్‌కు సిఫారసు లేఖతో పాటు పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్ ఇచ్చిన అధికారులు ఎవరన్నది ఎన్‌ఐఏ అధికారులు ఆరా తీసినట్టు సమాచారం. హత్యాయత్నం చేయడానికి ఎవరైనా పురిగొల్పారా? అనే కోణంపై దృష్టి సారించినట్టు తెలిసింది. విచారణలో భాగంగా నిందితుడు చెప్పిన వివరాలను రికార్డు చేశారు. శ్రీనివాసరావు కస్టడీలో నాల్గో రోజైన మంగళవారం మరోసారి విశాఖ ఎయిర్‌పోర్టుకు తీసుకెళ్లేందుకు ఎన్‌ఐఏ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. విశాఖ విమానాశ్రయంలో మరోసారి సీన్ రీకన్‌స్ట్రక్షన్ కోసం శ్రీనివాసరావును తీసుకెళ్లనున్నట్టు తెలుస్తోంది. నేర స్థలంలో మరికొన్ని అదనపు వివరాలు సేకరించే విషయంపై ఎన్‌ఐఏ అధికారులు దృష్టిసారించారు. ఎన్‌ఐఏ డీఐజీ ప్రవీణ్ కుమార్ నేతృత్వంలో విచారణ కొనసాగింది.
వైఎస్ జగన్‌పై హత్యాయత్నం వెనుక ఎవరున్నారు?
Published Tue, Jan 15 2019 4:22 AM | Last Updated on Tue, Jan 15 2019 4:22 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment