టిప్పర్‌ లారీ రూపంలో దూసుకొచ్చిన మృత్యువు | Nine Members Died In Auto Accident Visakhapatnam | Sakshi
Sakshi News home page

Published Tue, Oct 23 2018 7:06 AM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM

Nine Members Died In Auto Accident Visakhapatnam - Sakshi

వంట్లమామిడి వద్ద బోల్తాపడి నుజ్జయిన ఆటో ,మృతులను ఆస్పత్రికి తరలించిన దృశ్యం

9మంది విశాఖ జిల్లావాసుల దుర్మరణం

విశాఖపట్నం, పిఠాపురం, గొల్లప్రోలు: ‘‘మా ఇంటి వీరభద్రుని సంబరం.. మీరందరూ తప్పని సరిగా రావాలి’’ అని చెప్పగానే వారందరూ ఎంతో సంతోషపడ్డారు.  ఓ వాహనాన్ని పురమాయించుకుని మరీ బయల్దేరారు. ఇక బంధువుల ఇంట సంబరం వేడుకలో ఆనందంగా గడిపారు. భోజనాలు పూర్తి చేసుకుని వెళ్లొస్తామంటూ వీడ్కోలు చెప్పారు. అయితే అవే వారి చివరి వీడ్కోలని ఎవరూ ఊహించలేదు. వేగంగా దూసుకొచ్చిన టిప్పర్‌ లారీ వారు ప్రయాణిస్తున్న వాహనాన్ని ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ఆరుగురు మృతి చెందగా.. తీవ్రంగా గాయపడిన ఇద్దరు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మరో ఇద్దరు మరణించారు. మరో ఎనిమిది మంది గాయాలతో ఆసుపత్రిలో చికిత్సపొందుతున్నారు. తీవ్ర విషాదాన్ని నింపిన ఈ ఘటన గొల్లప్రోలు మండలం చేబ్రోలు కోటలంక చెరువు దగ్గర కొత్తగా నిర్మించిన 216 హైవే బైపాస్‌లో సోమవారం మధ్యాహ్నం మూడు గంటలకు జరిగింది. కాకినాడకు చెందిన కె.అప్పారావుకు విశాఖ జిల్లా మాకవరపాలెం మండలం జి.వెంకటాపురానికి చెందిన సత్యవతితో వివాహమైంది. వారు కాకినాడలో ఉంటున్నారు. రెండు రోజుల క్రితం నూతన గృహ ప్రవేశం చేసుకున్నారు. అప్పారావు తన భార్య తరఫు బంధువులను శుభకార్యానికి భోజనాలకు పిలిచారు. దీంతో ఆమె బంధువులు 18 మంది టాటా మేజిక్‌ వాహనాన్ని పురమాయించుకుని అక్కడి నుంచి బయల్దేరి కాకినాడ చేరుకున్నారు. వీరందరూ కూలీలే. చాలా కాలం తర్వాత తమ ఇంటి ఆడపడుచును చూస్తున్నామనే సంతోషంలో వారందరూ ఉన్నారు. వీరభద్రుని సంబరాన్ని తిలకించారు. భోజనాలు కూడా పూర్తి చేశారు. కార్యక్రమం పూర్తయిన అనంతరం 16 మంది తిరిగి అదే వాహనంలో బయల్దేరారు. వారు వెళుతున్న వాహనాన్ని సోమవారం మధ్యాహ్నం మూడు గంటలకు గొల్లప్రోలు మండలం చేబ్రోలు కోటలంక చెరువు దగ్గర కొత్తగా నిర్మించిన 216 హైవే బైపాస్‌లో ఓ టిప్పర్‌ ఢీకొట్టింది. మట్టి లోడుతో వెళుతున్న ఈ టిప్పర్‌ రాంగ్‌రూట్‌లో అతివేగంగా వచ్చి అదే దారిలో వెళుతున్న మేజిక్‌ వ్యాన్‌ను ఢీకొట్టడంతో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఇద్దరు ఆసుపత్రికి తరలిస్తుండగా ప్రాణాలు విడిచారు. మరో ఎనిమిది మంది తీవ్రగాయాలపాలయ్యారు.


ఆ ఇద్దరూ మృత్యుంజయులు
బంధువుల ఇంటికి వ్యాన్‌లో బయలు దేరింది 18 మంది అయితే కాకినాడలో బంధువుల ఇంటి వద్ద కార్యక్రమం పూర్తయ్యాక బయల్దేరిన వారు 16 మందే. మిగిలిన ఇద్దరూ తాము కాకినాడలో ఉన్న తమ బంధువుల ఇంటికి వెళుతున్నామని చెప్పి వారు ఆగిపోయారు. ఆ ఇద్దరు అక్కడ ఆగకుండా వ్యాన్‌లో ఎక్కి ఉంటే వారు కూడా ప్రమాదానికి గురయ్యేవారని క్షతగాత్రులు చెబుతున్నారు.

కదిలిన పోలీసు యంత్రాంగం
కాకినాడ డీఎస్పీ రవి వర్మ, పిఠాపురం సీఐ అప్పారావు, పిఠాపురం పట్టణ, గొల్లప్రోలు, పిఠాపురం రూరల్, కొత్తపల్లి ఎస్సైలు శోభన్‌కుమార్, శివకృష్ణ, మూర్తి, కృష్ణమాచారి ఇతర పోలీసు సిబ్బంది క్షతగాత్రులను తమ పోలీసు వాహనాలలో పిఠాపురం ఆస్పత్రికి తరలించి అనంతరం 108 వాహనాల్లో  కాకినాడ తరలించారు. జిల్లా ఎస్పీ విశాల్‌గున్ని సంఘటన స్థలాన్ని పరిశీలించి 216 జాతీయ రహదారి కాంట్రాక్ట సంస్థపై కేసు నమోదు చేయాలని స్థానిక పోలీసులను ఆదేశించారు. ఎస్‌బీ డీఎస్పీ మురళీమోహన్, త్రీటౌన్‌ సీఐ దుర్గారావుతో పాటు డీటీసీ సిరి ఆనంద్‌ సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.
 

ఇలా వచ్చి.. అలా మృత్యుఒడికి!
కాకినాడ: ఇంట్లో జరిగే వేడుకకు పది మందిని పిలిచి ఎంతో సంతోషంతో ఉన్న ఆ కుటుంబానికి ఆ ఆనందం ఎంతోసేపు నిలవలేదు. నిమిషాల వ్యవధిలోనే తమ ఇంట జరిగిన శుభకార్యక్రమానికి వచ్చివారు మృత్యు ఒడికి చేరారన్న సమాచారం ఆ ఇంటిలో పెనువిషాదాన్ని నింపింది. గొల్లప్రోలు మండలం చేబ్రోలు వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తొమ్మిది మంది దుర్మరణం పాలైన ఘటన కాకినాడ డ్రైవర్స్‌ కాలనీలోని కుంచే అప్పారావు   కుటుంబ సభ్యులను శోకసంద్రంలో ముంచింది. అప్పారావు కొత్తగా నిర్మించుకున్న ఇంటిని రెండు రోజుల క్రితం గృహప్రవేశం చేసుకున్నారు. సోమవారం వీరభద్రుని సంబరం, భోజనాలు ఏర్పాటు చేసుకుని కొంత మంది బంధువులను పిలుచుకున్నారు. ఇందు కోసం తన అత్తగారి వైపు బంధువులైన విశాఖ జిల్లా నర్సీపట్నం సమీపంలోని జి.వెంకటాపురం ప్రాంతానికి చెందిన వారిని ఆహ్వానించారు. వారందరూ ఉదయం 10.30 గంటల సమయంలో కాకినాడ చేరుకుని పట్టుమని అర్ధగంట కూడా గడవకముందే అంతే వేగంగా తిరుగు ప్రయాణమై.. గమ్యం చేరకుండా మృత్యుఒడికి చేరారన్న సమాచారం ఆ ఇంట ఆవేదనను మిగిల్చింది. వచ్చినంత వేగంగా తిరుగు ప్రయాణమై మృత్యుఒడికి చేరారంటూ కుంచే అప్పారావు ‘సాక్షి’ వద్ద తన ఆవేదన వెళ్లగక్కారు. ఇదే వాహనంలో వెళ్లాల్సిన మరో ఇద్దరు ఇక్కడ ఉన్న బంధువుల ఇళ్లకు వెళ్లాలనే ఉద్దేశంతో ఆ వాహనంలో ప్రయాణించకపోవడంతో వారు ప్రమాదం నుంచి బయటపడ్డారని బంధువులు చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement