
మాట్లాడుతున్న డీజీపీ ఆర్.పి.ఠాకూర్, పక్కన సీపీ మహేష్‌చంద్రలడ్డా, ఇతర పోలీస్ అధికారులు
ద్వారకానగర్(విశాఖ దక్షిణ): రేవ్ పార్టీ నిర్వహణ వెనుక రాజకీయ పార్టీల నాయకులు ఎవరైనా ఉన్నారా..? అని మీడియా ప్రశ్నించగానే... ఎవరూ లేరు అని డీజీపీ ఆర్పీ ఠాకూర్ తేల్చిచెప్పేశారు. ఒకవైపు రేవ్ పార్టీ వెనుక ఎవరున్నా వదిలేది లేదని చెబుతూనే... ఇలా అసలు పెద్దలకు సంబంధం లేదని చెప్పడంపై అందరూ విస్మయానికి గురయ్యారు. వాస్తవానికి ఆ పార్టీ వెనుక టీడీపీ నాయకులు, వారి కుమారులు ఉన్నారన్నది బహిరంగ రహస్యమే. అయితే అందుకు విరుద్ధంగా డీజీపీ మాట్లాడుతుండడం గమనార్హం. నగర పర్యటనలో భాగంగా గురువారం మీడియా సమావేశంలో ఠాకూర్ మాట్లాడారు.
ప్రశాంతమైన విశాఖ నగరంలో డ్రగ్స్ విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రేవ్ పార్టీలో ఇప్పటి వరకు ఆరుగురుని అరెస్ట్ చేశామని, ఆ ఘటన వెనుక ఎంతటి వారున్నా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. విశాఖ ప్రశాంతమైన నగరమని, డ్రగ్స్‌తో కలుషితం చేస్తే చర్యలు చాలా కఠినంగా ఉంటాయన్నారు. రేవ్ పార్టీతో ఇంకా ఎవరెవరికి సంబంధం ఉందనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. స్టార్ హోటల్స్, పబ్‌లలో డ్రగ్స్ విక్రయిస్తే స్టార్‌హోటల్ లైసెన్స్ రద్దు చేసి, విక్రయించే వారిని అరెస్ట్ చేస్తున్నట్లు తెలిపారు. అలాగే యాజమాన్యంపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేస్తామని స్పష్టం చేశారు. రేవ్ పార్టీ, డ్రగ్స్‌పై అధికారులతో రివ్యూ చేసినట్లు తెలిపారు. నగరంలోని డ్రగ్స్ వ్యవహరంపై ప్రత్యేక నిఘా పెట్టినట్లు తెలిపారు.
డ్రగ్స్ విక్రయించే వారిపై ప్రతి పోలీస్ స్టేషన్‌లో హిస్టరీ షీట్ తెరుస్తామని చెప్పారు. బెంగళూరు, గోవా నుంచి డ్రగ్స్ నగరంలోకి వస్తున్నట్లు సమాచారం ఉందని, అడ్డుకట్ట వేసేందుకు ఇప్పటికే ఒక ప్రణాళిక తయారు చేసినట్లు తెలిపారు. నగరంలోని విద్యా సంస్థలలో అవగహన సదస్సులు పెడతామని తెలిపారు. విద్యా సంస్థలో డ్రగ్స్ వాడితే సమాచారం ఇవ్వాలని, దీని కోసం ఒక అధికారి నియమిస్తుండడంతోపాటు ఓ ఫోన్ నంబర్ కూడా కేటాయిస్తామని తెలిపారు. రేవ్ పార్టీ రోజు మద్యం విక్రయాలకు అనుమతిచ్చిన ఎక్సైజ్ అధికారిపై ఇప్పటికే ఆ డిపార్టుమెంట్ చర్యలు తీసుకుంటుందన్నారు. సమావేశంలో సీపీ మహేష్‌చంద్ర లడ్డా, డీసీపీలు రవీంద్రబాబు, నయిమ్ హస్మీ తదితరులు పాల్గొన్నారు.
జర్నలిస్టులపై దాడులు చేస్తే చర్యలు
జర్నలిస్టులపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీజీపీ ఆర్పీ.ఠాకూర్ స్పష్టం చేశారు. ఎక్కడైనా జర్నలిస్టులపై దాడులు జరిగితే నేరుగా ఫోన్ చేయాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment