కోడుమూరు: సివిల్ పంచాయితీలు, సెటిల్‌మెంట్లలో కోడుమూరు పోలీసులు బిజీగా ఉన్నారని దొంగలకు కూడా తెలిసినట్లు ఉంది. అందుకే ఈ ప్రాంతాన్ని అడ్డా్డగా మార్చుకుని చెలరేగి పోతున్నారు. వరుస చోరీలు ఇందుకు బలం చేకూరుస్తు న్నాయి. కోడుమూరు స్టేషన్ పరిధిలో ప్రజలకు భద్రత కరువైంది. దొంగలు పడిన ఆర్నెల్లకు కూడా సొత్తు రికవరీ కావడం లేదు. అసలు కేసులే నమోదు చేయడం లేదనే విమర్శలు ఉన్నాయి. కేసు నమోదు.. దర్యాప్తు.. విచారణ.. అరెస్ట్.. కోర్టులు ఇవన్నీ ఎందుకు అనుకున్నారేమో.. స్టేషన్‌కు వచ్చిన బాధితులకు చూద్దాం.. చేద్దామంటూ హామీ ఇచ్చి పంపుతున్నట్లు తెలుస్తోంది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కేసు నమోదు చేసినా పెద్దగా ప్రయోజనం ఉండటం లేదు.
పోలీసులు వెతకరు.. దొంగలు దొరకరు అన్నట్లుగా మారింది. కోడుమూరు మండలంలో దొంగలు తమ చేతివాటానికి వేగం పెంచారు. స్టేషన్ పరిధిలో చోరీల సంఖ్య పెరుగుతున్నా పోలీసులు నిర్లక్ష్యం వీడటం లేదు. దొంగలను పట్టుకునే ప్రయత్నం చేయడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. పెండింగ్ చోరీ కేసుల స్థానంలో ఈ స్టేషన్ జిల్లాలో నాలుగు స్థానంలో ఉంది. ఇప్పటి వరకు 28 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. వర్కూరు గ్రామంలో 4 నెలల వ్యవధిలో ఆరు చోరీలు జరిగాయి. ఇవన్నీ ఒకే తరహాలో జరిగినా ఇప్పటి వరకు పోలీసులు ఈ కేసులను చేధించడంలో ఘోరంగా విఫలమయ్యారు. వర్కూరు గ్రామంలో రామాంజినేయులు ఇంట్లో 8 తులాల బంగారు ఆభరణాలు, 40 తులాల వెండి, రూ.70 వేల నగదును దొంగలు దోచుకుపోయారు. అయితే కేవలం 5 తులాల బంగారం చోరీకి గురైనట్లు పోలీసులు కేసు నమోదు చేశారు.
కేసుల్లేవు.. దర్యాప్తు లేదు
♦ గత ఏడాది సెప్టెంబరు 23వ తేదీన వల్లెలాంబ గుడి దగ్గర ఫ్యాషన్ ప్రొ ద్విచక్ర వాహనాన్ని దొంగలు ఎత్తుకెళ్లారు. బాధితుడు గొల్ల నాగరాజు కేసు నమోదు చేసుకోవాలంటూ నాలుగు నెలలుగా పోలీసులను కోరుతున్నా ఇప్పటి వరకు కేసు నమోదు చేయలేదు.
♦ కోడుమూరు పట్టణంలోని శ్రీరాములవారి దేవాలయం వద్ద నిలిపిన ఆటోను గతేడాది అక్టోబర్ నెలలో దొంగలు ఎత్తుకెళ్లారు. బాధితుడు వెంకటస్వామి ఆటో ఎత్తుకెళ్లారని ఫిర్యాదు చేస్తే పోలీసులు పట్టించుకోలేదు. నెలన్నర రోజులుగా బాధితుడు ఆటో కోసం గాలించి గూడూరులో ఓ రహస్య ప్రాంతంలో దాచిపెట్టిన ఆటోను గుర్తించి తెచ్చుకున్నాడు.
♦ గత ఏడాది డిసెంబర్ 28వ తేదీన కోడుమూరు పట్టణంలోని కొండపేటలో నివాసముంటున్న లక్ష్మీదేవి ఇంటికి ఓ గుర్తు తెలియని మహిళ ఇల్లు అద్దెకు కావాలంటూ మాటలు కలిపింది. లక్ష్మీదేవికి మత్తు మందు ఇచ్చి ఇంట్లో బంగారు ఆభరణాలు, నగదును దోచుకెళ్లింది. బాధితురాలు మత్తులో నుంచి 48 గంటల తర్వాత సృహలోకొచ్చింది. ఈ విషయం సంచలనం అయినప్పటికీ పోలీసులు కేసు నమోదు చేయలేదు. బాధితులంతా డీఎస్పీ దగ్గరకు వెళ్లడంతో కోడుమూరు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
ఎస్పీ మందలింపు
ఇటీవల జరిగిన సెట్ కాన్ఫరెన్స్‌లో కోడుమూరు పోలీసులను ఎస్పీ గోపినాథ్‌జెట్టి తీవ్రంగా మందలించారు. ప్రైవేట్ పంచాయతీల జోరు తగ్గించండంటూ ఎస్పీ హెచ్చరించినా వీరి తీరు మారలేదనే విమర్శలు ఉన్నాయి. దోపిడీల్లో నగదు, బంగారు, వెండి ఆభరణాలు పొగొట్టుకొని నష్టపోయిన బాధితులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తే కానీ కోడుమూరు పోలీసులు కేసులు నమోదు చేయడం లేదని ఎస్పీకి సమాచారం అందింది. ఈ మేరకు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment