
అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) వలలో భారీ తిమింగలం పట్టుబడింది. మహిళా, శిశు సంక్షేమశాఖ పెనుకొండ ప్రాజెక్టు కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న కె.వెంకటనారాయణరెడ్డి అలియాస్ నారాయణరెడ్డి ఆస్తులపై ఏసీబీ అధికారులు బుధవారం ఏకకాలంలో ఎనిమిది చోట్ల దాడులు నిర్వహించారు. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినట్లు తనిఖీల్లో బయటపడింది. దాదాపు రూ. 50 కోట్లకు పైగా ఆస్తులుంటాయని గుర్తించారు. కిలోన్నర బంగారు ఆభరణాలు, అరకిలోకు పైగా వెండి వస్తువులు, ఆస్తుల పత్రాలను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
అనంతపురం సెంట్రల్: పెనుకొండ ఐసీడీఎస్ ప్రాజెక్ట్ కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ నారాయణరెడ్డి ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినట్లు ఫిర్యాదు అందడంతో అనంతపురం ఏసీబీ ఇన్‌చార్జ్ డీఎస్పీ జయరామరాజు నేతృత్వంలో బుధవారం దాడులు నిర్వహించారు. అనంతపురంలోని కోవూరునగర్‌లో నారాయణరెడ్డి నివాసంలో డీఎస్పీ ఆధ్వర్యంలో తనిఖీలు జరిగాయి. నగరంలోనే మరో మూడు చోట్ల ఆయన ఆస్తులపై సోదాలు నిర్వహించారు. నార్పల మండలం నడిమిదొడ్డి గ్రామంలోని నారాయణరెడ్డి మామ, మాజీ ఉపసర్పంచు పుట్లూరు రామకృష్ణారెడ్డి ఇంట్లోను, ధర్మవరంలోని నివాసంలోనూ సోదాలు చేశారు. ప్రస్తుతం పనిచేస్తున్న పెనుకొండ ప్రాజెక్టు కార్యాలయం, స్వగ్రామం చిత్తూరు జిల్లా పాకాల మండలం దామచెర్ల గ్రామంలోనూ మొత్తం ఎనిమిది చోట్ల ఏసీబీ అధికారులు ఏకకాలంలో ఈ సోదాలు నిర్వహించారు.
అటెండర్‌గా మొదలై..
మహిళా శిశు సంక్షేమశాఖలో నారాయణరెడ్డి తొలుత అటెండర్‌గా నియమితులయ్యారు. జిల్లా కేంద్రంలోని శిశుగృహలో పనిచేశారు. అనంతరం కొన్నాళ్లకు సీనియర్ అసిస్టెంట్‌గా పదోన్నతి పొందారు. కూడేరు, గుత్తి, కంబదూరు, అనంతపురం, కదిరిలోనూ పనిచేశారు. ప్రస్తుతం పెనుకొండ ప్రాజెక్టుకార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. జిల్లా కేంద్రంలోని ప్రాజెక్టు డైరెక్టర్ కార్యాలయంలో దాదాపు 7 సంవత్సరాలు పైగా పనిచేశారు. కీలకమైన విభాగాలకు సూపరింటెండెంట్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. అంగన్‌వాడీ కేంద్రాలకు కోడిగుడ్లు, పౌష్టికాహారం పంపిణీ, ఎస్టాబ్లిష్‌మెంట్ సెక్షన్ బాధ్యతలు చూశారు. ఈ సమయంలోనే భారీగా ఆస్తులు కూడబెట్టారని అభియోగాలు ఎదుర్కొంటున్నారు.
ఆదాయానికి మించి ఆస్తులు
సీనియర్ అసిస్టెంట్ నారాయణరెడ్డి ఆదాయానికి మించి భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు ఏసీబీ అధికారుల సోదాల్లో బయటపడింది. అనంతపురం జిల్లాతో పాటు స్వస్థలం చిత్తూరు జిల్లా పాకాల మండలం దామచెర్లలోనూ ఆస్తులు బయటపడ్డాయి. అనంతపురంలో మూడు భవంతులున్నాయి. ధర్మవరంలో ఓ రెండంతస్తుల భవనం ఉంది. వీటి విలువలో రూ.కోట్లలో ఉంటుంది. బుక్కరాయసముద్రం మండలంతోపాటు గార్లదిన్నె మండలం ఇల్లూరులో ఆయన పేరిట వ్యవసాయభూములు ఉన్నట్లు తేలింది. బ్యాంకుల్లో దాచినది కాకుండా కేవలం అనంతపురం, స్వగ్రామం దామచెర్లలో కలిపి కిలోన్నర బంగారు అభరణాలు బయటపడ్డాయి. నూతన మారుతీ ఎస్‌క్రాస్ కారు, రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్, మరో రెండు ద్విచక్రవాహనాలు ఉన్నాయి. వీటన్నింటినీ స్వాధీనం చేసుకుంటున్నట్లు అవినీతి నిరోధకశాఖ డీఎస్పీ జయరామరాజు తెలిపారు. ఆస్తుల విలువ లెక్క కట్టాల్సి ఉందన్నారు. పూర్తిగా విచారించిన అనంతరం నారాయణరెడ్డిని కస్టడీలోకి తీసుకొని కోర్టు ముందు హాజరుపరుస్తామని వివరించారు.
‘ఆ ఆస్తులన్నీ పూర్వం నుంచి సంక్రమించినవే’
తన తండ్రి, అత్తమామల నుంచి సంక్రమించిన ఆస్తులు ఇవి అని సీనియర్ అసిస్టెంట్ నారాయణరెడ్డి మీడియాకు తెలిపారు. పూర్వం నుంచి సంక్రమించిన ఆస్తుల కింద రెండు ఇళ్లు ఉన్నాయని, మరో ఇల్లు బ్యాంకు లోన్ తీసుకొని ఇటీవల నిర్మించుకున్నానని చెప్పారు. ఇవి తప్ప తనకు రూ. 50 కోట్ల ఆస్తులు ఎక్కడా లేవు. అన్ని ఆస్తులకూ ఆధారాలు, రికార్డులు ఉన్నాయన్నారు. ఇన్‌కం ట్యాక్సులు కూడా సక్రమంగా చెల్లిస్తున్నామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment