అబిడ్స్‌లో భారీ చోరీ | One Crore Things And money Robbery In Abids Hyderabad | Sakshi
Sakshi News home page

అబిడ్స్‌లో భారీ చోరీ

Published Mon, Nov 12 2018 10:56 AM | Last Updated on Mon, Nov 12 2018 10:56 AM

One Crore Things And money Robbery In Abids Hyderabad - Sakshi

దొంగతనం జరిగిన భవనం

అబిడ్స్‌: అబిడ్స్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని మహేష్‌ నగర్‌ కాలనీ ఫతేసుల్తాన్‌లేన్‌లో భారీ చోరీ జరిగింది. రూ. కోటి రూపాయల విలువచేసే నగదు, బంగారు ఆభరణాలు చోరీకి గురయ్యాయి. ఈ భారీ చోరీని ఇంట్లో పనిచేసే వాచ్‌మెన్‌ దంపతులు మరో ఇద్దరితో కలిసి చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఇన్‌స్పెక్టర్‌ రవికుమార్‌ తెలిపిన మేరకు.. మహేష్‌నగర్‌ కాలనీ ఫతేసుల్తాన్‌లేన్‌లో నివాసముండే సునీల్‌ అగర్వాల్‌(54) ట్రావెల్స్, మెటల్‌ వ్యాపారాన్ని నిర్వహిస్తున్నాడు. శనివారం రాత్రి బంధువుల నివాసంలో ఉన్న ఓ శుభకార్యం నిమిత్తం ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులతో కలిసి బంజారాహిల్స్‌కు వెళ్లి అర్థరాత్రి 12 గంటల సమయంలో వచ్చారు. ఇంటి గేటు తాళం వేసి ఉండగా ఇంటి ప్రధాన ద్వారం తాళాలను పగులగొట్టి ఉండడంతో సునీల్‌ అగర్వాల్‌ ఇంట్లోకి వెళ్లి పరిశీలించాడు.

కోటి రూపాయల నగదుతో పాటు బంగారు ఆభరణాలు కనిపించలేదు. వాచ్‌మెన్‌ దంపతులు కూడా కనిపించకుండా పోవడంతో ఈ చోరీ వారే చేసి ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తంచేశారు. ఇదిలా ఉండగా మరో గదిలో ఉన్న రూ. 50 లక్షలు మాత్రం దొంగతనం కాలేదని పోలీసులు తెలిపారు. అయితే దొంగతనానికి పాల్పడిన వారు సీసీ పుటేజీల రికార్డులు నమోదయ్యే డీవీఆర్‌ను కూడా దొంగిలించి తీసుకువెళ్లారు. యజమాని సునీల్‌ అగర్వాల్‌ అబిడ్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. క్లూస్‌ టీం, డాగ్‌స్క్వాడ్‌ను రంగంలోకి దింపి వేలి ముద్రలను సేకరించారు. సమాచారం అందుకున్న సెంట్రల్‌ జోన్‌ డీసీపీ విశ్వప్రసాద్, అదనపు డీసీపీ గంగారెడ్డి, అబిడ్స్‌ ఏసీపీ భిక్షంరెడ్డిలు పోలీస్‌ స్టేషన్‌లో సమావేశమై దొంగతనం జరిగిన తీరును తెలుసుకొని కేసు మిస్టరీని చేధించేందుకు గాను అధికారులకు సూచనలు చేశారు.

నేపాల్‌కు చెందిన వికాస్‌ ఆయన భార్య సునీల్‌ అగర్వాల్‌ నివాసంలో వాచ్‌మెన్‌గా రెండు నెలల క్రితం చేశారు. గతంలో ఇక్కడ పనిచేసిన వ్యక్తి వీరిని నిమమించినట్లు తెలిసింది. అయితే వారితో పాటు మరో ఇద్దరు ఈ దొంగతనానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. సీసీ ఫుటేజీలను పరిశీలించగా వాచ్‌మెన్‌ దంపతులు ఓ దారి వెంట, మరో ఇద్దరు మరో దారిలో వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. పోలీసులు విచారణను వేగవంతం చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement