యశవంతపుర: ఒక మరణం.. రెండు ఆత్మహత్యల్ని ప్రేరేపించింది. అనారోగ్యంతో భర్త మృతిని తట్టుకోలేక భార్య, తల్లీ ఆత్యహత్య చేసుకున్న ఘటన బెంగళూరులోని యశవంతపుర పోలీసుస్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ముత్యాలనగరలో శేషశయన అలియాస్ శేషపాణి (44) అనే టైలర్ కుటుంబం నివాసం ఉంటుంది. ఆయనతో పాటు భార్య ఉషానందిని (42), శేషపాణి తల్లి సుధా అలియాస్ లక్ష్మీదేవి (65)లు ఉంటున్నారు. వీరు చాలా ఏళ్ల కిందటే ఏపీ నుంచి వచ్చి స్థిరపడ్డారు. కుటుంబానికి ఆయనే ఆధారం. టైలరింగ్ ద్వారా వచ్చే డబ్బుతో కుటుంబం గడిచేది. అయితే తీవ్ర ఆనార్యోగంతో బాధపడుతున్న శేషపాణి అనేక ఆస్పత్రులలో చికిత్సలు పొందుతూ నాలుగు రోజుల క్రితం మృతి చెందినట్లు తెలిసింది. ఆయన మృతిని భార్య, తల్లి బంధువులకు ఎవరికీ చెప్పకుండా మృతదేహాన్ని ఇంట్లోనే పెట్టుకున్నారు. ఉన్న ఆధారం పోయాడు, తమ జీవితమెలా అనే బాధను తట్టుకోలేక భార్య, తల్లి ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నారు.
దుర్వాసనతో స్థానికుల ఫిర్యాదుల
శనివారం రాత్రి ఇంట్లో నుండి దుర్వాసన రావటంతో చుట్టుపక్కలవారు యశవంతపుర పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి తాళం బద్ధలుకొట్టి చూడగా కుళ్లిన స్థితిలో ముగ్గురి మృతదేహాలు బయటపడ్డాయి. శేషపాణి ఆనారోగ్యంతో మరణించడంతో విరక్తి కలిగి భార్య, తల్లీ ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని వీరి బంధువులకు పోలీసులు సమాచారం అందించారు. కుళ్లిన మృతదేహలను బయటకు తీయటానికి పోలీసులు నానా తంటాలు పడ్డారు. పోస్టుమార్టం నిమిత్తం ఎంఎస్ రామయ్య ఆస్పత్రికి తరలించారు. యశవంతపుర పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment