బంగారం అనుకొని దోచేశారు | One Gram Gold Robbery in Rangareddy | Sakshi
Sakshi News home page

బంగారం అనుకొని దోచేశారు

Published Thu, Nov 14 2019 11:49 AM | Last Updated on Thu, Nov 14 2019 11:49 AM

One Gram Gold Robbery in Rangareddy - Sakshi

స్వాధీనం చేసుకున్న వెండి, వన్‌ గ్రామ్‌ గోల్డు నగలు

షాద్‌నగర్‌ రూరర్‌: బీరువాలో ఉంచిన వెండితో పాటు వన్‌గ్రామ్‌ గోల్డ్‌ నగలను అపహరించిన నిందితులను పోలీసులు అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. తాళం వేసిన ఇళ్లను ఎంచుకొని చోరీలకు పాల్పడుతున్న నిందితులను కటకటాల వెనక్కి తరలించినట్లు ఏసీపీ సురేందర్‌ వెల్లడించారు. బుధవారం షాద్‌నగర్‌ పట్టణ ఠాణాలో డీఐ తిరుపతి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలను వెల్లడించారు. హైదరాబాద్‌ బండ్లగూడ పర్వత్‌నగర్‌కు చెందిన దీపక్‌ విశ్వకర్మ, హైదరాబాద్‌లోని ఉప్పుగూడ జెండా రోడ్డుకు చెందిన పండిత్‌ సురాజ్‌ పాండ్యా మిత్రులు. వీరిద్దరు కలిసి సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలోని షాద్‌నగర్, మీర్‌పేటలో పలు దొంగతనాలకు పాల్పడ్డారు. షాద్‌నగర్‌ పట్టణానికి చెందిన నరేందర్‌ ఇంటికి ఈనెల 6న తాళం వేసి ఉండగా పగులగొట్టి దీపక్‌ విశ్వకర్మ, పండిత్‌ సురాజ్‌ పాండ్యా లోపలికి చొరబడ్డారు. బీరువా తలుపులు తెరిచి అందులో ఉన్న కిలోవెండితో పాటుగా బంగారు ఆభరణాలను అపహరించారు. వన్‌గ్రామ్‌ గోల్డును బంగారంగా భావించిన దుండగులు వెండి ఆభరణాలతో పాటుగా వాటిని కూడా దొంగిలించారు. ఈమేరకు నరేందర్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. బుధవారం దీపక్‌ విశ్వకర్మ, సురాజ్‌ పాండ్యాను షాద్‌నగర్‌ పట్టణంలోని వేంకటేశ్వరస్వామి దేవాలయం సమీపంలో అదుపులోకి తీసుకొని విచారించినట్లు తెలిపారు. వారివద్ద ఉన్న సొత్తును స్వాధీనం చేసుకున్నారు. నిందితులు మీర్‌పేటలో ఓ బైక్‌ను కూడా దొంగిలించినట్లు పోలీసుల విచారణలో తేలింది.  

మరో కేసులో..  
మరో కేసులో పోలీసులు బైకులను అపహరించిన వ్యక్తిని రిమాండుకు తరలించారు. శంషాబాద్‌ మండలం పెద్దతూప్రా గ్రామానికి చెందిన చిర్ర యాదయ్య అలియాస్‌ అశోక్‌రెడ్డి కొంతకాలంగా షాద్‌నగర్, కేశంపేట, కడ్తాల్, మైలర్‌దేవ్‌పల్లి, ఆర్‌జీఐఏ పోలీస్‌ స్టేషన్‌ల పరిధిలో బైకులను దొంగిలించాడు. బుధవారం ఆయన షాద్‌నగర్‌ చౌరస్తాలోని బస్టాండ్‌ సమీపంలో అనుమానాస్పదంగా తిరుగుతుండగా అదుపులోకి తీసుకొని విచారించగా బైకుల చోరీలకు పాల్పడ్డాడు. అతడి నుంచి ఐదు బైకులు స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ తెలిపారు. 

సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి
కేసుల దర్యాప్తులో సీసీ కెమెరాలు ఎంతో ఉపయోగపడినట్లు, అందరూ తమ ఇళ్లలో సీసీ కె మెరాలను ఏర్పాటు చేసుకోవాలని ఏసీపీ సు రేందర్‌ సూచించారు. సీసీ కెమెరాల్లో నమోదైన పుటేజీల ఆధారంగా ముగ్గురు నిందితులను పట్టుకున్నట్లు వివరించారు. ఇళ్లకు తాళం వేసి గ్రామాలకు వెళ్తున్న వారు విధిగా పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. ఈ సందర్భంగా కేసులను ఛేజించిన పోలీసు బృందాన్ని ఏసీపీ సురేందర్‌ అభినందించారు. రివార్డుల కోసం ఉన్నతాధికారులకు ప్రతిపాదన పంపుతామన్నారు. సీఐ శ్రీధర్‌కుమార్, ఎస్‌ఐలు దేవ్‌రావ్, విజయభాస్కర్, కృష్ణ, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement