
సాక్షి, హైదరాబాద్: ‘ఎస్‌బీఐ డెబిట్‌కార్డు xxxxx5005తో 2019 అక్టోబర్ 3న రూ.13,638.52 విలువైన నగదు లావాదేవీ xxxxx1903 ట్రాన్సాక్షన్ నంబర్‌తో ‘డబ్ల్యూపీజీటీఐడీ01’వెండర్ వద్ద చేశారు. ఒక వేళ మీరు ఈ లావాదేవీ చేయకపోతే కార్డును బ్లాక్ చేసేందుకు 9223008333కు ఎస్‌ఎంఎస్ లేదా 9449112211కు కాల్ చేయండి’అని ఫోన్‌లో ఎస్‌ఎంఎస్ అందిన వెంటనే హైదరాబాద్‌కు చెందిన వినయ్‌కుమార్ (పేరుమార్చాం) అవాక్కయ్యాడు. తన డెబిట్ కార్డు తన దగ్గరే ఉన్నా, కార్డు నంబర్లు, వన్ టైమ్ పాస్‌వర్డ్ (ఓటీపీ), పిన్ వంటి రహస్య సమాచారాన్ని ఎవరితో షేర్ చేసుకోకపోయినా, తనకు కనీస సమాచారం లేకుండా తన కార్డుతో ఎలా ఈ లావాదేవీ జరిగింది? ఎవరు చేశారు? అని ఆశ్చర్యపోయాడు. వెంటనే కార్డును బ్లాక్ చేయించి తన బ్యాంకు బ్రాంచి మేనేజర్‌కు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశాడు. బాధితుడి డెబిట్‌కార్డు నంబర్, సీవీవీ నంబర్లను వినియోగించి లండన్ కేంద్రంగా పనిచేస్తున్న ‘ఆలీబాబా డాట్ కామ్’అనే విదేశీ ఈ–కామర్స్ సంస్థ నుంచి గుర్తుతెలియని దుండగులు ఏదో వస్తువు కొనుగోలు చేశారని, ట్రాన్సాక్షన్ స్టేట్‌మెంట్ పరిశీలించిన అనంతరం బ్యాంకు అధికారులు వెల్లడించారు. ఇలాంటి కంపెనీలతో జరిపే విదేశీ (ఓవర్సీస్) ట్రాన్సాక్షన్లకు ఓటీపీ అవసరం ఉండదని, డెబిట్/క్రెడిట్‌కార్డు నంబరు, సీవీవీ నంబర్లను సైబర్ నేరస్తులు హ్యాకింగ్/ఫిషింగ్/ఫేక్ ఫోన్‌కాల్స్ తదితర అక్రమ పద్ధతుల ద్వారా సేకరించి ఇలాంటి మోసాలకు పాల్పడుతున్నారని సైబర్ క్రైం పోలీసులు చెబుతున్నారు. డెబిట్‌కార్డు/క్రెడిట్‌కార్డుతో ఆన్‌లైన్‌లో జరిపే లావాదేవీలకు ఏటీఎం నంబర్, సీవీవీ నంబర్‌తో ఓటీపీ తప్పనిసరి అని, ఓటీపీ లేకుండా ఆన్‌లైన్ లావాదేవీలను ఎట్టి పరిస్థితిలో అనుమతించరాదని ఇప్పటికే ఆర్‌బీఐ అన్ని బ్యాంకులకు మార్గదర్శకాలు జారీ చేసింది. అయినా బ్యాంకులు ఓటీపీ లేకుండా కార్డుల ద్వారా ఓవర్సీస్ లావాదేవీలను పలు బ్యాంకులు అనుమతిస్తున్నాయి. ఒకవేళ మోసం జరిగితే కొన్ని సందర్భాల్లోనే బ్యాంకులు బాధితులకు పూర్తి మొత్తంలో నగదు రీఫండ్ అవుతుండటంతో పెద్ద సంఖ్యలో బాధితులు నష్టపోతున్నారు. నిబంధనల ప్రకారం డబ్బు కోల్పోయిన 3 రోజుల్లోగా ఫిర్యాదు చేస్తేనే 100% రీఫండ్ చేసే అంశాన్ని బ్యాంకులు పరిశీలిస్తాయి. ఇలాంటి కారణాలతో సగం లేదా అంత కంటే తక్కువ నగదునే రీఫండ్ చేస్తున్నాయి.
కార్డు మర్చిపోతే అంతే..
నగదును డ్రా చేసిన తర్వాత కొందరు తమ డెబిట్ కార్డును ఏటీఎం యంత్రం నుంచి తిరిగి తీసుకోకుండా మర్చిపోయి వెళ్తున్నారు. కొన్ని ఏటీఎం యంత్రాల్లో నగదు బయటకు వచ్చిన తర్వాతే కార్డు బయటకు వస్తుంది. దీంతో నగదు తీసుకుని కార్డును అక్కడే మర్చిపోతున్నారు. ఇలా మర్చిపోయిన కార్డులను దుండగులు మిగతా 2వ
దొంగిలించి ఓటీపీ లేకుండానే ఓవర్సీస్ లావాదేవీలు జరిపి బాధితుల బ్యాంకు ఖాతాలను ఖాళీ చేస్తున్నారని ఓ బ్యాంకు ఉన్నతాధికారి పేర్కొన్నారు. ఓవర్సీస్ ట్రాన్సాక్షన్ ద్వారా నేరం జరిగితే నిందితులను పట్టుకునే టెక్నాలజీ సైబర్ క్రైం పోలీసులకే ఉందని, వారి వద్దకే వెళ్లాలని పోలీసు స్టేషన్ అధికారులు ఫిర్యాదు తీసుకోకుండా పంపేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.
దోపిడీకి మార్గాలెన్నో..
సైబర్ క్రైం పోలీస్టేషన్‌కు బాధితుల సంఖ్య భారీగా పెరిగిపోయింది. సైబర్ నేరస్తులు అత్యాధునిక సాంకేతిక నైపుణ్యంతో గుట్టు రట్టు కాకుండా చూసుకుంటున్నారు. డెబిట్, క్రెడిట్‌కార్డులు, ఆన్‌లైన్‌బ్యాకింగ్‌తో పాటు గూగుల్‌పే, ఫోన్‌పే, పేటీఎం వంటి ఆన్‌లైన్ పేమెంట్ యాప్‌ల వినియోగదారులకు టోకరా వేయడం ఇటీవల సర్వసాధరణమై పోయింది. ఇలాంటి వివరాలను ఎవరితో పంచుకోరాదని బ్యాంకులు, పోలీసులు విస్తృతంగా ప్రచారం చేస్తున్నా చాలామంది మోసపోతూనే ఉన్నారు. నేరుగా వినియోగదారులకు ఫోన్ చేసి గిఫ్టులు, లాటరీలు, డిస్కౌంట్ సేల్స్ పేరుతో ఎరవేసి కార్డులు/పేమెంట్ యాప్‌లకు సంబంధించిన రహస్య వివరాలను సైబర్ నేరస్తుల ముఠాలు సేకరిస్తున్నాయి. ఫేస్‌బుక్, ట్విటర్ వంటి సామాజిక మాధ్యమాల్లో పెట్టే వ్యక్తిగత సమాచారాన్ని వినియోగించుకుని.. ‘మీరు పలానా వ్యక్తి.. పలానా బంధువులు/స్నేహితులు మీ నంబర్ ఇచ్చారు.. మీకు ఈ గిఫ్టు ఇవ్వమన్నారు. జీఎస్టీ ట్యాక్సు కడితే మీ అడ్రస్‌కు గిఫ్టు పంపిస్తాం’అని ఫోన్ చేసి చెప్పి నమ్మిస్తున్నారు. బ్యాంకు అధికారుల పేరుతో ఫోన్ చేసి డెబిట్‌కార్డు, ఓటీపీ వివరాలు సేకరించడం వంటి మోసాలు ఇటీవల బాగా పెరిగిపోయాయి. ప్రముఖ ప్రైవేటు, ప్రభుత్వ కంపెనీల పేరుతో కొందరు సైబర్ నేరస్తులు ఫేక్ వెబ్‌సైట్లను సృష్టించి ఉద్యోగావకాశాలు, వస్తువులు/సేవల ఆర్డర్ కోసం ఆన్‌లైన్‌లో ఫీజులు, డబ్బులు కట్టించుకుంటున్నారు.
గొలుసుగట్టుగా వేర్వేరు ఖాతాలకు
బాధితుల ఖాతా నుంచి తమ ఖాతాకు డబ్బులు జమ అయిన వెంటనే సైబర్ నేరస్తులు తెలివిగా ఆ డబ్బును మరో ఖాతాకు అక్కడి నుంచి ఇంకో ఖాతాకు.. ఇలా వారం రోజుల్లోనే పది పదిహేను ఖాతాలకు డబ్బు బదిలీ చేస్తున్నారు. ఒక ఖాతాను బ్లాక్ చేసేలోగా డబ్బు మరో బ్యాంకులు/పేమెంట్ యాప్స్ ఖాతాలోకి వెళ్లిపోతోంది. దీంతో అన్ని బ్యాంకులు/యాప్స్ కంపెనీలతో సంప్రదింపులు జరిపి నిందితుల ఖాతాలను బ్లాక్ చేయిస్తున్నామని సైబర్ క్రైం అధికారులు పేర్కొన్నారు.
బస్సు సీటు పేరుతో మోసం: హఫీజ్ ఖాన్, గాందీనగర్, హైదరాబాద్
హైదరాబాద్ నుంచి చిత్తూరుకు వెళ్లేందుకు కావేరీ ట్రావెల్స్‌కు సంబంధించిన వివరాలు కనిపించాయి. నంబర్‌కు ఫోన్ చేసి సీటు బుక్ చేయాలని కోరాను. ముందుగానే డబ్బులు చెల్లించాలని అడిగారు. బస్సు ఎక్కిన తర్వాత చెల్లిస్తానంటే రూ.10 అయినా బుకింగ్ ఫీజు కింద చెల్లించాలంటూ పేమెంట్ లింక్ ఎస్‌ఎంఎస్ చేశారు. లింక్ ఓపెన్ చేసి అందులో ఫోన్‌పే ఐడీ, ఎం–పిన్ ఎంటర్ చేశాను. నా మొబైల్ నంబర్‌తో ఎస్‌బీఐ, ఎస్‌బీఐ, విజయబ్యాంకు ఖాతాలు అనుసంధానమై ఉన్నాయి. ఫోన్‌పే యాప్‌తో ఎస్‌బీఐ ఖాతా మాత్రమే అనుసంధానమై ఉంది. కొద్ది క్షణాల్లోనే మూడు బ్యాంకు ఖాతాల్లో ఉన్న రూ.30 వేలు సైబర్ నేరస్తుడు కాజేశాడు. కావెరీ ట్రావెల్స్‌ను సంప్రదిస్తే ఆ ఫోన్ నంబర్‌తో తమకు సంబంధం లేదన్నారు.
రీఫండ్ అంటూ కాజేశారు: సింగరాజు సంతోష్, లాయర్, హైదరాబాద్
కోర్టులో క్లర్కుగా పనిచేసే మహిళ గ్రేట్ ఇండియా శారీ డాట్ కాం అనే వెబ్‌సైట్ నుంచి చీర ఆర్డర్ చేసింది. ఆర్డర్ క్యాన్సిల్ చేసుకుని డబ్బు రీఫండ్ చేయాలని కోరగా.. గూగుల్ పే నంబర్‌కు రీఫండ్ చేస్తామని వెబ్‌సైట్ నిర్వాహకులు ఆమెకు చెప్పారని, ఆమె నా దగ్గర గూగుల్ పే ఐడీ తీసుకుంది. వెబ్‌సైట్ నుంచి ఎవరో నాకు కాల్ చేసి నా ఫోన్‌కి ‘రిఫండ్ ఐడీ’ని పంపించామని, తిరిగి వారి ఫోన్‌కు పంపిస్తేనే రీఫండ్ చేస్తామన్నారు. ఎస్‌ఎంఎస్‌ను వారికి ఫార్వర్డ్ చేశాను. తర్వాత నా బ్యాంకు ఖాతా బ్యాలెన్స్ గూగుల్ పేలో చెక్ చేయగా.. డబ్బులు బాగా తగ్గిపోయాయి. వెంటనే బ్యాంకుకు వెళ్లి ఖాతా స్తంభింపజేశాను. అప్పటికే రూ.90 వేలు నష్టపోయాను.
చిక్కరు దొరకరు..
ఈ తరహా సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోతున్న వారి సంఖ్య నానాటికీ పెరుగుతోంది. ఇలాంటి నేరాల్లో మోసపోవడం ఎంత తేలికో నేరగాళ్లు చిక్కడం, డబ్బు రికవరీ కావడం అంతే కష్టం. బ్యాకింగ్ సహా ఇతర ఆర్థిక సంస్థలతో ఇబ్బంది వచి్చనా.. సమస్యలు ఎదురైనా నేరుగా వాటినే సంప్రదించాలి. ఇంటర్‌నెట్‌లో లభించే కాల్‌సెంటర్ల నంబర్లను సమాచారం కోసమే వాడుకోవాలి. ఎట్టిపరిస్థితుల్లోనూ ఎం–పిన్‌ను ఎవరి నంబర్‌కూ పంపొద్దు. గూగుల్‌లో కనిపించేవన్నీ నిజమైన కాల్ సెంటర్లని నమ్మితే నష్టపోతారు. – సైబర్ క్రైమ్ ఇన్‌స్పెక్టర్
పాటించాల్సిన జాగ్రత్తలు
స్మార్ట్‌ఫోన్, డేటా కనెక్షన్ అందుబాటులోకి వచ్చాక ఏ సమాచారం కోసమైనా గూగుల్ సెర్చ్ ఇంజన్‌ను ఆశ్రయిస్తున్నారు. సైబర్ నేరస్తులు దీన్నే అస్త్రంగా వాడుకుంటున్నారు. తమ ఫోన్ నంబర్లను వివిధ కాల్ సెంటర్లకు చెందినవిగా పేర్కొంటూ ఇంటర్‌నెట్‌లో పెడుతున్నారు. బ్యాకింగ్ సహా ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన సంస్థల పేర్లతో ఇవి ఉంటున్నాయి. వీటికి ఫోన్లు చేసిన వారిని నమ్మించి యూపీఐ నంబర్ తీసుకుంటున్నారు. చివరకు వారి బ్యాంకు ఖాతాల నుంచి డబ్బు స్వాహా చేస్తున్నారు.
- నకిలీ పేర్లు, చిరునామాలతో వివిధ సర్వీసు ప్రొవైడర్ల నుంచి సిమ్‌కార్డులు తీసుకుంటున్న సైబర్ నేరగాళ్లు వాటిని ఈ నేరాలకు వాడుతున్నారు. బోగస్ వివరాలతో కొన్ని యాప్స్, బ్యాంకు ఖాతాలు సిద్ధం చేసుకుంటున్నారు.
- మెయిల్ ఐడీలు సృష్టించి గూగుల్‌లో రిజిస్టర్ చేసుకుంటున్నారు. తమకు చెందిన నంబర్లను ఆయా బ్యాంకులకు చెందిన కాల్ సెంటర్లవిగా పేర్కొంటూ అందులో పొందుపరుస్తున్నారు. ట్రూ కాలర్‌లో సైతం వీటిని ‘బ్యాంక్’, ‘బ్యాంక్ మేనేజర్’పేర్లతోనే రిజిస్టర్ చేసుకుంటున్నారు.
- గూగుల్ సెర్చ్‌లో పొందుపరిచిన నంబర్లలో వేటికి వ్యూస్ ఎక్కువగా ఉంటే అది పైకి వచ్చి ముందు కనిపిస్తుంది. తమ నంబర్లు కని్పంచేందుకు సైబర్ నేరగాళ్లు తమ అనుచరుల ద్వారా ఆయా నంబర్లకు వ్యూస్ పెరిగేలా చేసి సెర్చ్‌లో పైకి తీసుకొస్తున్నారు.
- ఇలా కనిపించిన వాటికి ఖాతాదారుడు కాల్ చేస్తే సైబర్ నేరగాడు స్పందిస్తున్నాడు. తాను బ్యాంక్/ఆర్థిక సంస్థ మేనేజర్‌ని అంటూ పరిచయం చేసుకుంటున్నాడు. పోగొట్టుకున్న డబ్బు తిరిగి రావాలన్నా, మీ సమస్య పరిష్కారం కావాలన్నా తాము మరో నంబర్ నుంచి ఎస్సెమ్మెస్ పంపుతామని, దాన్ని మళ్లీ అదే నంబర్‌కు తిప్పి పంపాలని సూచిస్తుంటారు.
- ఎవరైనా సరే తమ బ్యాంకు ఖాతాలను నగదు లావాదేవీలు నెరపే వివిధ రకాలైన యాప్స్‌కు అనుసంధానం చేయాలంటే యూపీఐ కచ్చితంగా ఉండాలి. ఇది కావాలంటే బ్యాంకు ఖాతాతో రిజిస్టరై ఉన్న సెల్‌ఫోన్ నుంచి యూపీఏకు సంబంధించిన ఎంపిన్‌ను బ్యాంకుకు సంబంధించిన నంబర్‌కు పంపాల్సి ఉంటుంది. దీన్నే ఈ సైబర్ నేరగాళ్లు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు.
- తమ ఫోన్లలోకి అప్పటికే కొన్ని యాప్స్‌ను డౌన్‌లోడ్ చేసి ఉంచుకుంటున్న సైబర్ నేరగాళ్లు ఇలా కాల్ వచి్చనప్పుడు ఎంపిన్ క్రియేట్ చేస్తున్నారు. దీన్ని తొలుత తమకు కాల్ చేసిన ఖాతాదారుడికి వేరే నంబర్ నుంచి పంపి తిరిగి పొందుతున్నారు. ఇలా చేయడంతో బాధితుడు తన బ్యాంకు ఖాతాను వారి యాప్‌తో అనుసంధానించడానికి యాక్సెస్ ఇచి్చనట్లు అవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment