
జమ్ము: కాల్పుల విరమణ ఒప్పందానికి పాకిస్తాన్ సైనిక బలగాలు పదేపదే తూట్లు పొడుస్తున్నాయి. సరిహద్దులో నియంత్రణ రేఖ వెంబడి కవ్వింపులకు దిగుతూ కయ్యానికి కాలుదువ్వుతున్నాయి. జమ్మూకశ్మీర్‌లోని పూంచ్, భింబెర్‌గలి సెక్టార్లలో పాక్ సైన్యం మరోసారి కాల్పులకు తెగబడింది. బుధవారం తెల్లవారుజాము నుంచి పాక్ రేంజర్లు మోటర్లతో కాల్పులకు పాల్పడుతున్నారు. సైనిక స్థావరాలతో పాటు, పౌర నివాసాలను లక్ష్యంగా చేసుకొని కాల్పులు జరిపారు. దీంతో అప్రమత్తమైన భారత సైన్యం వారికి ధీటుగా బదులిస్తోంది.
ప్రస్తుతం ఇంకా కాల్పులు కొనసాగుతున్నాయని ఓ ఉన్నతాధికారి తెలిపారు. పాక్ సైనిక దళాలు జరిపిన దాడిలో 50 ఏళ్ల మహిళ గాయపడిందని చెప్పారు. ఈ నెల 24న పూంచ్ జిల్లాలోని బాలకొటె ప్రాంతంలో పాకిస్తాన్ బలగాలు జరిపిన కాల్పుల్లో ఇద్దరు భారత సైనికులు గాయపడిన విషయం తెలిసిందే.