హైదరాబాద్: సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో నర్సుపై ఓ గర్భిణీ బంధువులు దాడిచేసిన ఘటన గురువారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. నాగారంనకు చెందిన ఆసియాబేగంను ప్రసవం కోసం గాంధీ ఆస్పత్రికి తీసుకొచ్చారు. అయితే ఆ వార్డులో రద్దీ ఎక్కువ కావడంతో ఒకే మంచాన్ని ఇద్దరు రోగులకు కేటాయించాల్సి వచ్చింది. దీంతో ఆగ్రహం చెందిన ఆమె బంధువులు అక్కడ డ్యూటీలో ఉన్న నర్సుపై అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో దాడి చేశారు.
తెల్లవారాక తనపై జరిగిన దాడిపై ఆ నర్సు అధికారులకు ఫిర్యాదు చేసింది. దాడికి నిరసనగా నర్సులందరూ విధులు బహిష్కరించి ధర్నాకు దిగారు. ఈ సంఘటనకు సంబంధించి నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా, నర్సుపై దాడిచేసిన వారిపై చర్యలు తీసుకుంటామని సూపరింటెండెంట్ నర్సులకు హామీ ఇవ్వడంతో వారు ధర్నాను విరమించారు.