ప్రతీకాత్మక చిత్రం
అలంపూర్: ఓ మహిళకు పెళ్లి అయింది.. కుమారుడు కూడా ఉన్నాడు. మూడేళ్ల క్రితం ఆమె భర్త అనారోగ్యంతో మృతి చెందాడు. మరో వ్యక్తిని పెళ్లి చేసుకుంటానని చెబితే కుటుంబీకులు అంగీకరించలేదు. అయినా, ఆమె ఆ వ్యక్తినే పెళ్లాడింది. మర్నాడు ఒంటరిగా ఇంటికి వచ్చిన ఆమెను సోదరుడు హత్య చేశాడు. ఆమెపై కిరోసిన్ పోసి నిప్పంటించగా మృతి చెందడంతో ఆత్మహత్యగా చిత్రీకరించాడు. అయితే పోలీసుల విచారణలో కులం కాని వ్యక్తిని పెళ్లాడటం ఇష్టం లేక సోదరుడే ఆమెను హత్య చేసినట్లు తేలింది. ఈ ఘటనకు సంబంధించి సీఐ రజితారెడ్డి, ఎస్‌ఐ జయశంకర్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్‌కు చెందిన ఇందిర (45) అనే మహిళ భర్త మూడేళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు.
ఆ తర్వాత ఆమె కర్నూలులో ఉంటున్న అలంపూర్ వాసి మహేశ్‌తో సాన్నిహిత్యం పెంచుకుంది. అతడిని వివాహం చేసుకోవాలని నిశ్చయించుకుని కుటుంబ సభ్యులకు చెబితే మహేశ్‌ది వేరే కులం కావడంతో ఇంట్లో ఈ వివాహాన్ని నిరాకరించారు. దీంతో ఇందిర ఇంట్లో ఎవరికీ చెప్పకుండా ఈ ఏడాది ఆగస్టు 29వ తేదీన మహేశ్‌ను వివాహం చేసుకుంది. ఆ తర్వాత ఇందిర ఆగస్టు 30వ తేదీన ఇంటికి వచ్చింది. ఇది జీర్ణించుకోలేని ఇందిర తమ్ముడు కాలూరి లోకేశ్, అదే రోజు రాత్రి 3 గంటల సమయంలో అందరూ నిద్రలో ఉండగా ఇందిరపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. కొన ఊపిరితో ఉన్న ఆమె తలపై కట్టెతో బలంగా కొట్టి హత్యకు పాల్పడ్డాడు. ఇంట్లో ఎవరికీ అనుమానం రాకుండా ఆత్మహత్య చేసుకున్నట్లు నమ్మించాడు. ఆత్మహత్య చేసుకున్నట్లుగానే పేర్కొంటూ ఆగస్టు 31వ తేదీన పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కానీ విచారణలో ఇందిరను లోకేశ్ హత్య చేసినట్లు తేలింది. దీంతో శుక్రవారం లోకేశ్‌ను అరెస్టు చేసి అలంపూర్ కోర్టులో హాజరు పర్చినట్లు సీఐ, ఎస్‌ఐ వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment