ఘటనా స్థలంలో పోలీస్, రెవెన్యూ అధికారులు
సాక్షి, శిరివెళ్ల(కర్నూలు) : నల్లమల అటవీ ప్రాంతంలోని శ్రీ సర్వ నరసింహస్వామి ఆలయ సమీపంలోని వక్కిలేరు వాగులో పూడ్చిన శవాన్ని శుక్రవారం బయటకు తీశారు. తల నరికి వేయడం.. మృతదేహం పక్కన నిమ్మకాయ ఉండడంతో ఇది నరబలి అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వాగులో వజ్రాల అన్వేషణ కోసం వచ్చిన ఓ వృద్ధుడు..గురువారం పూడ్చిన శవం కాలి వేలు బయట పడడాన్ని గమనించాడు. భయాందోళనకు గురై విషయాన్ని ఆలయ సిబ్బందికి తెలియ చేయగా వారు స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు.
శుక్రవారం డిప్యూటీ తహసీల్దార్ జిలానీ, ఆర్‌ఐ ఉశేనిబాషా సçమక్షంలో సర్కిల్ ఎస్‌ఐలు చంద్రశేఖరరెడ్డి, రామిరెడ్డి ఆధ్వర్యంలో పూడ్చిన శవాన్ని బయటకు తీశారు. 25–30 ఏండ్ల వయస్సున్న వ్యక్తి తల నరికినట్లు ఉంది. అదిగాక గుంతలో శవం పక్కను నిమ్మ కాయ కూడా ఉండడంతో పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. జీన్స్ ఫ్యాంట్, రెడ్ పుల్ షర్టు, ఎర్రని శరీర వర్ణచ్ఛాయతో చేతి వేలికి కాపర్‌తో తయారు చేతిన ఉంగరం ఉంది. మొలతాడు లేదు. నంద్యాల ప్రభుత్వ వైద్యశాల డాక్టర్ రామిరెడ్డి ఘటనా స్థలంలోనే మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు.
తలను దేహం నుంచి నరికినట్లు డాక్టర్ నిర్ధారించారు. కాగా వ్యక్తిని ఘటనా స్థలం నే హత్య చేసి పూడ్చి పెట్టారా ? లేక ఎక్కడో హత్య చేసి ఇక్కడ పూడ్చి పెట్టారన్నది పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది. కాగా వ్యక్తి కాలి వేలికి రింగ్ మాదిరిగా ఉంది. కాలి నొప్పి ఉన్న వారు ఇలా వేయించుకుంటారని స్థానికులు చెబుతున్నారు. మహదేవపురం వీఆర్వో శ్రీకాంత్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. పోస్టు మార్థం అనంతరం మృత దేహాన్ని అక్కడే పూడ్చి వేశారు.
Comments
Please login to add a commentAdd a comment