
దసరా సెలవులకు ఇంటికొచ్చిన చిన్నారులు.. తమ ఇంటి దగ్గర అందరూ ఎందుకు ఏడుస్తున్నారో అర్థం కాక బిత్తరచూపులు చూడటం చూపరులను కలచివేశాయి. రోడ్డు ప్రమాద రూపంలో మృత్యువు తన తండ్రిని తిరిగిరాని లోకాలకు తీసుకెళ్లిందని తెలియని పిల్లలను చూసి ప్రతి ఒక్కరూ చలించిపోయారు. ఎంత పనిచేశావయ్యా.. ఇక నా బిడ్డలకు దిక్కెవరు దేవుడా.. అంటూ మృతుని భార్య రోదించిన తీరు అందరినీ కంటతడి పెట్టించింది.
అమడగూరు: అమడగూరు మండలం పూలకుంటకు చెందిన సింగిల్‌విండో మాజీ అధ్యక్షుడు మహేష్‌రెడ్డి (38) సోమవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందాడు. వివరాలిలా ఉన్నాయి. రాజారెడ్డి, చిన్నరెడ్డెమ్మ దంపతుల కుమారుడు మహేష్‌రెడ్డికి తనకల్లు మండలం ఈతోడు గ్రామానికి చెందిన నాగమణితో పదమూడేళ్ల క్రితం వివాహమైంది. వీరికి 11 ఏళ్ల కూతురు అఖిల, 9 ఏళ్ల కుమారుడు యశ్వంత్‌రెడ్డి ఉన్నారు. వీరు అనంతపురంలో చదువుకుంటున్నారు. దసరా సెలవులు రావడంతో స్వగ్రామానికి వచ్చారు. మహేష్ సోమవారం ఉదయం సొంతపనిమీద ద్విచక్రవాహనంలో కొక్కంటిక్రాస్‌కు వెళ్లాడు. పని ముగించుకుని రాత్రి 11 గంటల సమయంలో ఇంటికి బయల్దేరాడు. మరో ఐదు నిమిషాల్లో ఇంటికి చేరుకోవాల్సిన ఆయన తనకల్లు మెయిన్‌రోడ్డులోని గోపాల్‌నాయక్ తండా బస్‌స్టాప్ వద్ద అదుపుతప్పి కిందపడ్డాడు. తల వెనుక బలమైన గాయమైంది. చెవులు, ముక్కులో రక్తం వచ్చి అపస్మారకస్థితిలో పడిపోయాడు. అదే సమయంలో అటువచ్చిన పూలకుంటపల్లికి చెందిన వ్యక్తులు గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించి, ఆయన్ని తనకల్లు ఆస్పత్రికి తరలించారు.
అయితే అప్పటికే మహేష్‌రెడ్డి మృతి చెందినట్లు వైద్యులు పేర్కొన్నారు. మంగళవారం కదిరి ప్రభుత్వాస్పత్రిలో మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి, కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఎస్‌ఐ చలపతి కేసు నమోదు చేసుకుని దర్యాప్తును ప్రారంభించారు. మహేష్‌రెడ్డి మృతితో పూలకుంటపల్లిలో విషాదఛాయలు అలుముకున్నాయి. పలువురు నాయకుల పరామర్శ మహేష్‌రెడ్డి కుటుంబ సభ్యులకు వైఎస్సార్‌సీపీ పుట్టపర్తి సమన్వయకర్త దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి ఫోన్‌లో పరామర్శించారు. మాజీ ఎమ్యెల్యే, సీఈసీ సభ్యుడు డాక్టర్ కడపల మోహన్‌రెడ్డి, జిల్లా కార్యదర్శి దుద్దుకుంట సుధాకర్‌రెడ్డి, బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు విష్ణువర్దన్‌రెడ్డి కదిరి ప్రభుత్వాస్పత్రికి చేరుకుని మృతదేహానికి నివాళులర్పించారు. మండలానికి చెందిన వివిధ పార్టీ నాయకులు అంత్యక్రియల్లో పాల్గొన్నారు.