
సాక్షి, కృష్ణరాజపురం: ఆస్తి వివాదం నేపథ్యంలో ఓ వ్యక్తి తన అన్న భార్యను కొడవలితో నరికి హత్య చేశాడు. ఈ ఘటన మంగళవారం రాత్రి బెంగుళూరులోని కె.ఆర్. పురం చిక్కదేవసంద్రలో చోటుచేసుకుంది. వివరాలివి.. చిత్తూరు జిల్లాకు చెందిన మనోహర్ రెడ్డి, సుమతి(30) దంపతులు కొద్ది కాలం క్రితం చిక్కదేవసంద్రకు చేరుకొని కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. అదే ప్రాంతంలో మనోహర్ రెడ్డి సోదరుడు వినాయకరెడ్డి నివాసం ఉంటున్నాడు. ఆస్తి విషయంలో అన్నదమ్ముల మధ్య విభేదాలు ఏర్పడ్డాయి.
ఈ క్రమంలో మంగళవారం రాత్రి కూడా ఇదే విషయమై అన్నదమ్ముల మధ్య గొడవ చోటుచేసుకుంది. కొద్దిసేపటి తర్వాత మనోహర్ రెడ్డి ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. ఆ సమయంలో వినాయకరెడ్డి వదిన సుమతితో గొడవ పడ్డాడు. ఓ దశలో కోపంతో కొడవలి తీసుకుని ఆమెను విచక్షణా రహితంగా నరికి ఉడాయించాడు. తీవ్ర గాయాలతో సుమతి అక్కడిక్కడే మృతి చెందింది. కె.ఆర్.పురం పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. నిందితుడి కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.