
సాక్షి, విజయవాడ: బెజవాడ కిడ్నాప్ కేసుకు పోలీసుల తెర దించారు. స్థానిక సింగ్‌నగర్ వద్ద జరిగిన కిడ్నాప్ కేసుకు సంబంధించి పోలీసులు ఆరుగురు నిందితులను అరెస్టు చేశారు. ఆర్థిక వ్యవహారాలే ఈ కిడ్నాప్‌కు కారణమని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. వివరాలివి.. గుంటూరు జిల్లా చిలకలూరి పేటకు చెందిన నర్సింగ్, విజయవాడకు చెందిన ఓ వ్యక్తితో కలిసి బాజీ అనే వ్యక్తి కలిసి పంచలోహ విగ్రహాల వ్యాపారం చేశాడు. బెంగళూరు చెందిన వ్యక్తికి విగ్రహాల కోసం లక్షల్లో డబ్బు చెల్లించి మోసపోయారు. అయితే, తన తండ్రిని మోసం చేశాడని బాజీపై నర్సింగ్ కొడుకు కళ్యాణ్ కక్ష గట్టాడు.
ఈ నేపథ్యంలోనే తన తండ్రి ఇచ్చిన సొమ్మును చెల్లించాలంటూ బాజీని కళ్యాణ్ పలుసార్లు హెచ్చరించాడు. అయినా అతను పట్టించుకోక పోవడంతో కళ్యాణ్ గత రాత్రి ఏడుగురితో కలిసి కిడ్నాప్ చేసేందుకు సిద్దపడ్డాడు. బాజీ తన స్నేహితుడు అన్వర్‌తో కలిసి ఆంధ్రప్రభ కాలనీ నుంచి సింగ్ నగర్ వెళ్లుతున్న సమయంలో ఇన్నోవా కారులో వచ్చి వారి బైక్‌ను అడ్డగించారు. వెంటనే బాజీ, అన్వర్‌లను కారులో ఎక్కించుకుని గుంటూరు వైపు వెళ్ళిపోయారు.
స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. కిడ్నాప్ చేసిన వారిని దారి మధ్యలో నిందితులు డబ్బు కోసం చితకబాదారు. బాకీ ఉన్న రూ. 60 లక్షలు చెల్లించాలని డిమాండ్ చేశారు. తెల్లవారుజాము 5గంటల ప్రాంతంలో చిలకలూరిపేటలో కిడ్నాపర్లను పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. వారి చెర నుంచి బాధితులను విడిపించారు. కిడ్నాప్ కేసులో మరో ఇద్దరు పరారీలో ఉన్నారని, వారిని త్వరలో అరెస్టు చేస్తామని విజయవాడ నార్త్ ఏసీపీ వీవీ నాయుడు తెలిపారు.