ఉచ్చుకు చిరుత బలి | Police Possession Leopard Claw In Adilabad | Sakshi
Sakshi News home page

ఉచ్చుకు చిరుత బలి

Published Thu, Dec 12 2019 8:06 AM | Last Updated on Thu, Dec 12 2019 8:06 AM

Police Possession Leopard Claw In Adilabad - Sakshi

చిరుతపులిని కాల్చిన ప్రదేశం, అధికారులు స్వాధీనం చేసుకున్న చిరుతపులి పంజా

సాక్షి, బజార్‌హత్నూర్‌(ఆదిలాబాద్‌) : అడవి పందుల కోసం పంట చేను చుట్టూ అమర్చిన విద్యుత్‌ కంచెకు తగిలి ఓ చిరుతపులి బలైంది. బజార్‌హత్నూర్‌ మండలంలోని డేడ్రా అటవీ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఉమర్డ(బి) గ్రామ సమీపంలో మంగళవా రం రాత్రి చౌహన్‌ నాందేవ్‌ తన చేనులో అ డవి పందుల కోసం విద్యుత్‌ తీగలు అమర్చగా అటువైపు వచ్చిన చిరుతపులి విద్యుదాఘాతానికి గురై మృతి చెందింది.

మండలంలోని డేడ్ర అటవీ ప్రాంతంలో వేటగాళ్ల ఉచ్చులో చిరుతపులి మృతి చెందిన ఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది. ఇచ్చోడ అటవీ శాఖ ఎఫ్‌డీవో బర్నోబా, ఎఫ్‌ఆర్‌వో అప్పయ్య తెలిపిన వివరాల ప్రకారం...  మండలంలోని డేడ్ర అటవీ బీట్‌లోని ఉమర్డ(బి) గ్రామానికి 50మీటర్ల దూరంలోని తన చేనులో చౌహన్‌ నాందేవ్‌ తన కుటుంబంతో కలసి నివాసం ఉంటున్నాడు. మంగళవారం రాత్రి తన చేనులో అడవి పందుల వేట కోసం సింగిల్‌ ఫేజ్‌ విద్యుత్‌ తీగలను అమర్చారు. రాత్రి ఆ వైపుగా వచ్చిన చిరుతపులి విద్యుత్‌ తీగలు తగిలి షాక్‌తో మృతి చెందింది. ఉదయం మృతి చెందిన చిరుతపులిని చూసిన నాందేవ్‌ మరో ఆరుగురు చౌహన్‌ కృష్ణ, సిడం నాగోరావ్, కొడప కృష్ణ, పెందూర్‌ నాగేందర్, సోయం నాగేశ్వర్, మడవి సునిల్‌ సహకారంతో కళేబారాన్ని సంఘటన స్థలం నుంచి 100 మీటర్ల దూరంలోని పొదల్లోకి తీసుకెళ్ళి కాల్చివేశారు. చౌహన్‌ నాందేవ్‌ తాగిన మైకంలో బజార్‌హత్నూర్‌ గ్రామానికి వచ్చి ఫోన్‌లో అటవీశాఖ ఎఫ్‌ఆర్‌వో అప్పయ్యకు ఉమర్డ గ్రామస్తులు చిరుతపులిని చంపారని, దానికి సంబంధించిన ఆధారాలు తన వద్ద ఉన్నాయని తెలిపాడు. దీంతో ఎఫ్‌ఎస్‌వో సుదర్శన్‌ సిబ్బందితో బజార్‌హత్నూర్‌ గ్రామానికి చేరుకుని నాందేవ్‌ను అదుపులో తీసుకున్నారు. సంఘటన స్థలాన్ని పరిశీలించి కాలిన బూడిదను, నాందేవ్‌ ఇంటివద్ద నుంచి చిరుతపులికి సంబంధించిన 9గోర్లు, 7మీసాలను స్వాదీనం చేసుకున్నారు. నిందితులపై వైల్డ్‌లైప్‌ యాక్ట్‌ 1972 ప్రకారం సెక్షన్‌ 9, 39(1)(డీ), 44ఆర్‌/డబ్ల్యూ 51, ఫారెస్ట్‌ యాక్ట్‌ 1967 ప్రకారం యూ/ఎస్‌ 20(1)(సీ), యూ/ఎస్‌ 3, యూ/ఎస్‌ 447, 429, 120(బి), ఆర్‌/డబ్ల్యూ 34ఐపీసీ సెక్షన్‌ల కింద కేసులు నమోదు చేసి ఐదుగురిని అరెస్ట్‌ చేశామని చౌహన్‌ కృష్ణ, కొడప కిషన్‌లు ఇద్దరు పరారీలో ఉన్నారని తెలిపారు. 

ఇన్‌ఫార్మరే ప్రధాన నిందితుడు
డేడ్ర అటవీ ప్రాంతంలో మంగళవారం చోటు చేసుకున్న చిరుతుపులి మృతి సంఘటనలో ప్రధాన నిందితుడు చౌహన్‌ నాందేవ్‌ అటవీ  శాఖ అధికారులకు చాలా రోజులుగా ఇన్‌ఫార్మర్‌గా పని చేస్తున్నాడు. ఉమర్ఢ గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం అటవీ శాఖ అధికారులతో నాందేవ్‌కు ఉన్న సన్నిహిత్యంతో  మాంసం కోసం అటవీ జంతువులను వేటాడుతూ ఉంటాడని, మంగళవారం నాందేవ్‌ అటవీ పందుల కోసం ఏర్పాటు చేసిన విద్యుత్‌ తీగలకు చిరుతపులి బలి అయిందని తెలిపారు. అనంతరం తాగిన మైకంలో అధికారులకు విషయం చెప్పాడని వివరించాడు.  

అక్రమ కేసులు పెట్టారని గ్రామస్తుల ఆందోళన
లంబాడా కులానికి చెందిన చౌహన్‌ నాందేవ్‌ తన కుమారుడు చౌహన్‌ కృష్ణ ఇద్దరు చిరుతపులి మృతికి కారకులని గ్రామానికి చెందిన సిడం కాశీరాం తెలిపారు. ఆయన మాట్లాడుతూ నాందేవ్‌ ఉదయం గ్రామానికి వచ్చి చిరుతపులి మృతిచెందిందని అటవీ శాఖ అధికారులకు తెలిస్తే జైలుకు పంపుతారని, నన్ను కాపాడలని వేడుకుంటే గ్రామస్తులు వెళ్ళారే తప్ప అందులో ఆదివాసీలు ఎవరు బాధ్యులు కారని ఇచ్చోడ రేంజ్‌ కార్యాలయం ఆవరణలో ఆందోళనకు దిగారు. సిడం కిషన్‌ ఢిల్లీలో ఆదివాసీ గర్జన సభలో ఉంటే ఈ కేసులో ఇరికించే ప్రయత్నం చేశారని తెలిపారు. మంగళవారం రాత్రి  విచారణ పేరుతో ఎఫ్‌ఆర్‌వో అప్పయ్య ఉమార్డ గ్రామంలో ఆదివాసీ మహిళను తలుపులు పెట్టి విచారించడం ఏమిటని ప్రశ్నించారు. ఆదివాసీలు వందల సంఖ్యలో రేంజ్‌ కార్యాలయానికి చేరుకోవడంతో బోథ్, ఇచ్చోడ సీఐలు మల్లేష్, శ్రీనివాస్, ఎస్సైలు పుల్లయ్య, ఫరిద్, భరత్‌సుమన్, పోలీసు సిబ్బంది చేరుకొని ఆదివాసీ గిరిజనులను మెప్పించి అక్కడి నుంచి పంపించారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement