సాక్షి, తగరపువలస(భీమిలి): ఇటీవలే ఉద్యోగ విరమణ చేసిన కానిస్టేబుల్, ప్రస్తుతం కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న అతని కుమారుడు ఒక ముఠాను తయారుచేసుకుని అక్రమ వసూళ‍్లకు పాల‍్పడుతున‍్న వైనం ఆలస‍్యంగా వెలుగుచూసింది. విశాఖ జిల్లా భీమిలి పోలీసులు అందజేసిన వివరాలు ఇలా ఉన్నాయి.
ఏఆర్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున‍్న దాట్ల సత్యనారాయణరాజు అనే వ‍్యక్తి మూడు నెలల కిందట రిటైర్ అయ్యారు. అతని కుమారుడు దాట్ల వెంకటవరహాలరాజు ప్రస్తుతం విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. వీరిద్దరూ మరో ముగ్గురితో కలిసి టాస్క్‌ఫోర్స్ పోలీసుల అవతారం ఎత్తారు. ఈ నెల 22న సాయంత్రం 6.30 సమయంలో తగరపువలస శివారు సంగివలస–పాండ్రంగి రహదారిలో తోటకూర గౌరీ లక్ష్మణరావుకు చెందిన దుకాణం వద‍్దకు కారులో వెళ్లారు. పాన్ మసాలాలు గుర్తించి గుట్కాలు అమ్ముతున్నట్టు కేసుపెడతామని బెదిరించారు. రూ.లక్ష ఇస్తే వదిలేస్తామని బేరసారాలకు దిగారు. దీంతో బాధితుడు రూ.25 వేలు ఇస్తామన్నా వదిలిపెట్టకుండా రూ.లక్ష ఇవ్వాల్సిందేనని పట్టుబట్టి తీసుకున్నారు. ఇంకా ఎవరైనా గుట్కా వ్యాపారం చేస్తే సమాచారం ఇవ్వాలని తమ ఫోన్‌నంబరు ఇచ్చి వెళ్లారు.
నిజంగా టాస్క్‌ఫోర్స్ పోలీసులేనని భావించిన బాధితుడు తోటి వ్యాపారస్తుల వద్ద గోడు వెల్లబోసుకున్నాడు. వారు నగరంలోని టాస్క్‌ఫోర్స్ పోలీస్ ఉన్నతాధికారులకు విషయం చేరవేశారు. దీంతో అధికారులు బాధితుడిని పిలిచి బెదిరించిన సిబ్బందిని గుర్తు పట్టాల్సిందిగా కోరారు. అక్కడ వారు లేకపోవడంతో తమ దగ‍్గరికి వచ్చిన వారి కారు నంబరును టాస్క్‌ఫోర్స్ అధికారులకు ఇవ్వగా.. దాని సాయంతో నిందితులను గుర్తించారు. వారిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోవడానికి పథకం వేసి బాధితునితో ఏఆర్ కానిస్టేబుల్‌కు ఫోన్ చేయించి ఈ నెల 24న ఆనందపురం మండలం పెద్దిపాలెం వద్దకు రూ.40 లక్షల విలువైన గుట్కా వస్తుందని నమ్మబలికి రప్పించారు. అప్పటికే అక్కడ వాహనంలో డ్రైవర్ వేషంలో ఉన్న టాస్క్‌ఫోర్స్ సిబ్బందిని ఏఆర్ కానిస్టేబుల్ బెదిరించడంతో పట్టుకుని భీమిలి పోలీసులకు అప్పగించారు. బాధితుడి నుంచి తీసుకున్న సొమ్ములో రూ.40వేలు రికవరీ చేసి తండ్రీ, కొడుకులను రిమాండ్‌కు తరలించనున్నట్టు సీఐ బాలసూర్యారావు తెలిపారు. వీరితో పాటు వచ్చిన మరో ముగ్గురి గురించి ఆరా తీస్తున‍్నట్టు చెప్పారు.
కాగా నిందితులలో ఒకరైన కానిస్టేబుల్ వరహాలరాజు మాట్లాడుతూ గుట్కా నిల్వలు ఉన్నాయేమో తెలుసుకోవడానికి రెక్కీ నిర్వహించడానికి తగరపువలస వైపు వచ్చానని.. పనిలో పనిగా తన తండ్రిని విజయనగరంలో బంధువుల ఇంటిలో దింపేందుకు కారు తీసుకువచ్చానన్నారు. తనపై గిట్టనివారు అక్రమంగా ఈ కేసులో ఇరికించారని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment